Share News

ఉద్యాన పంటలకు ఉపాధి ఊతం

ABN , Publish Date - Jun 21 , 2024 | 12:40 AM

ఉద్యాన పంటల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. దీనిలో భాగంగా ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన పంటలతో అనుసంధానం చేసింది. ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ దస్త్రంపై తొలి సంతకం చేయడంతో జిల్లాలోని ఉద్యాన రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది.

ఉద్యాన పంటలకు ఉపాధి ఊతం
అనకాపల్లి మండలంలో జీడిమామిడి తోట

- ఉద్యాన పంటల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి

- ఉపాఽధి హామీ పథకంతో అనుసంధానం

- ఉద్యాన రైతుల్లో ఆనందం

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

ఉద్యాన పంటల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. దీనిలో భాగంగా ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన పంటలతో అనుసంధానం చేసింది. ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ దస్త్రంపై తొలి సంతకం చేయడంతో జిల్లాలోని ఉద్యాన రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది.

గతంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేవలం ఎస్పీ, ఎస్టీ , చిన్న, సన్నకారు రైతులు కొంతమందిని మాత్రమే ఎంపిక చేసి వారి ద్వారానే ఉద్యాన పంటల సాగు చేపట్టేవారు. కొత్తగా మొక్కలు నాటించి వారికి సబ్సిడీ అందించి తగిన ప్రోత్సాహాన్ని అందించేవారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకంతో ఉద్యాన పంటల పనులు అనుసంధానం చేసి ఉద్యాన రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేయనుంది. ఉద్యాన పంటల సాగుకు పెట్టుబడి వ్యయం ఎక్కువగా పెట్టాల్సి వున్నందున భూమి విస్తీర్ణం తక్కువగా వున్న చిన్న, సన్నకారు రైతులు ఉద్యాన పంటల సాగుకు ముందుకు రావడం లేదు. అయితే ఇక ముందు ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయడం ద్వారా ప్రభుత్వమే చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీ అందించి వారు 13 రకాల పండ్ల తోటలు సాగు చేసే విధంగా ప్రోత్సాహాన్ని అందించనుంది. మామిడి, జీడి మామిడి, నిమ్మ, బత్తాయి, జామ, సీతాఫలం, సపోటా, మునగ, డ్రాగన్‌ఫ్రూట్స్‌, అరటి, దానిమ్మ, కొబ్బరి రకాలతో పాటు కూరగాయల పంటల సాగుకు సాయమందించాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఉన్న ఉద్యాన పంటల నిర్వహణ పనులను ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయనున్నారు. జిల్లాలో 52 వేల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగులో ఉన్నాయి. మామిడి, జీడిమామిడి, నిమ్మ, సీతాఫలం, జామ వంటి పండ్ల జాతి పంటల సాగుతో పాటు వివిధ రకాల కూరగాయల సాగు జరుగుతోంది. వీటిని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసేందుకు అవసరమైన ప్రణాళికను జిల్లా నీటియాజమాన్య సంస్థ, ఉద్యాన శాఖాధికారులు సిద్ధం చేస్తున్నారు. ఉద్యాన పంటల అనుసంధానం, అభివృద్ధిపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇంకా అందాల్సి వుందని, ప్రస్తుతం ఎంతమంది ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు?, ఇంకా ఎంత విస్తీర్ణంలో సాగుకు అనుకూలం అనే వివరాలు మాత్రమే సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉద్యాన పంటలకు ప్రోత్సాహాన్ని అందజేస్తామని జిల్లా ఉద్యాన శాఖాధికారి ప్రభాకరరావు తెలిపారు.

Updated Date - Jun 21 , 2024 | 12:40 AM