ఆశ్రమాలపై అంతులేని నిర్లక్ష్యం
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:29 PM
మన్యంలో ఎంతో ఆదర్శంగా ఉండే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు నేడు దుర్భరంగా మారాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆశ్రమ పాఠశాలలను గాలికి వదిలేయడమే దీనికి ప్రధాన కారణం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటినా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోని స్థితిగతుల్లో మాత్రం ఎటువంటి మార్పు రాకపోవడం గమనార్హం.
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలపై కొరవడిన పర్యవేక్షణ
కూటమి పాలనలోనూ గాడిన పడని దుస్థితి
వరుస సంఘటనలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలో ఎంతో ఆదర్శంగా ఉండే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు నేడు దుర్భరంగా మారాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆశ్రమ పాఠశాలలను గాలికి వదిలేయడమే దీనికి ప్రధాన కారణం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటినా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోని స్థితిగతుల్లో మాత్రం ఎటువంటి మార్పు రాకపోవడం గమనార్హం.
ఏజెన్సీ వ్యాప్తంగా 117 ఆశ్రమ పాఠశాలల్లో 37 వేల మంది గిరిజన విద్యార్థులు 3 నుంచి 10వ తరగతి వరకు ఆశ్రమ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఏడాదికోమారు అమ్మఒడిని అమలు చేస్తున్నామనే ఉద్దేశంతో సాధారణ ప్రాథమిక పాఠఽశాలల వలే వాటిని సైతం కనీసం అభివృద్ధి, పర్యవేక్షణ లేకుండా వదిలేసింది. గతంలో ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రతి నెలా పాకెట్ మనీ, సబ్బులు, షాంపులు, పౌడర్, కొబ్బరినూనె వంటి కాస్మోటిక్స్‌తో పాటు పెట్టెలు, జంబుఖానాలు, రగ్గులు, స్వెటర్లు, దుప్పట్లు, కంచాలు, గ్లాసులు వంటివి పంపిణీ చేసేవారు. కానీ అమ్మఒడి అమలు చేస్తున్నామనే కారణంతో వైసీపీ పాలనలో వాటి పంపిణీని పూర్తిగా రద్దు చేసింది. అలాగే ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వర్కర్లను సైతం తొలగించింది. దీంతో ఆశ్రమాల్లో విద్యార్థుల ఆరోగ్యం, ఇతర సమస్యలపై సైతం ఎవరూ పట్టించుకోని దుస్థితి నెలకొంది.
ఆశ్రమ పాఠశాలలపై పర్యవేక్షణేది?
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలపై అంతులేని నిర్లక్ష్యం నేటికీ కొనసాగుతున్నది. వార్డు మెంబర్ మొదలుకుని ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వంటి ప్రజాప్రతినిధులు, ఐటీడీఏ పీవో, గిరిజన సంక్షేమ శాఖ డీడీ, మండల స్థాయిలో ఉండే ఏటీడబ్ల్యూవోలు, మండలాల్లో ఉండే స్కూల్ కాంప్లెక్స్‌ల ప్రధానోపాధ్యాయులు సైతం ఆశ్రమ పాఠశాలల పర్యవేక్షణపై కనీసం దృష్టి సారించని పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతున్నది. దీంతో ఇదే అదనుగా టీడబ్ల్యూ డీడీ, ఏటీడబ్ల్యూవోలు, స్కూల్ కాంప్లెక్స్‌ల హెచ్‌ఎంలు సైతం ఆశ్రమ పాఠశాలల పర్యవేక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదు. దీంతో ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గిరిజన విద్యార్థులకు అరకొరగా భోజనాలు పెట్టడం, సదుపాయాలు సమకూర్చకపోవడం మామూలైపోయిందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆశ్రమ పాఠశాలల్లోకి ఇతరుల ప్రవేశాన్ని నిషేఽధించాలని హైకోర్టు ఒక సందర్భంలో ఇచ్చిన ఉత్తర్వులను సైతం గిరిజన సంక్షేమ విద్యాశాఖాధికారులు, ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలు, వార్డెన్లు తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో సమస్యలపై విద్యార్థి, ప్రజాసంఘాలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, విలేకరులు సైతం దృష్టిపెట్టలేని పరిస్థితిని ఏర్పరచి, ఇష్టారాజ్యంగా ఆశ్రమ పాఠశాలల నిర్వహణ చేస్తున్నారు. ఒక వైపు అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, మరో వైపు సంఘాలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు సైతం ఆశ్రమ పాఠశాలలపై దృష్టిపెట్టని పరిస్థితులు ఏర్పడడంతో అవి మరింత అధ్వానంగా మారాయి. ఈ ఏడాది సెప్టెంబరు నెలలో డుంబ్రిగుడ మండలం జాముగూడలో పదుల సంఖ్యలో గిరిజన బాలికలు ఆహార కలుషితంతో ఇబ్బం దులు పడ్డారు. తాజాగా జి.మాడుగుల మండలం బందవీధి ఆశ్రమ పాఠశాలకు చెందిన ఇద్దరు గిరిజన బాలికలు ఐదు రోజుల క్రితం అదృశ్యమైనా హెచ్‌ఎం, మేట్రిన్ కనీసం పట్టించుకోలేదు. అక్టోబరు నెలలో పాడేరులోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఓ గిరిజన విద్యార్థినిపై అక్కడి ఉద్యోగి లైంగిక దాడికి పాల్పడిన ఘటన మరువక ముందే, తాజాగా జి.మాడుగుల మండల కేంద్రంలోని ఓ బాలికల ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థినిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆ ముగ్గురు వ్యక్తులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు అనేక సమస్యలు, ఇబ్బందుల నడుమ విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను మెరుగుపరిచేందుకు, గిరిజన విద్యార్థులకు రక్షణతో పాటు చక్కని విద్యనందించేందుకు కృషి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.