Share News

మహాశక్తిపై కసరత్తు

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:49 AM

‘కూటమి’ ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్‌ సిక్స్‌’ హామీల్లో ‘మహాశక్తి’ పథకం ఒకటి.

మహాశక్తిపై కసరత్తు

పథకం కింద దీపావళి నుంచి అర్హులైన వారికి ఉచిత సిలిండర్లు

ఏడాదికి మూడు...

జిల్లాలో మొత్తం గ్యాస్‌ కనెక్షన్లు 9,05,661

దీపం కనెక్షన్లు 1,31,749, ఉజ్వల కనెక్షన్లు 15,320

విశాఖపట్నం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):

‘కూటమి’ ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్‌ సిక్స్‌’ హామీల్లో ‘మహాశక్తి’ పథకం ఒకటి. ఈ పథకం కింత పేద మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ఈ ఏడాది దీపావళి నుంచి పథకం అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు, చమురు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు.

‘మహాశక్తి’ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేస్తారు. నాలుగు నెలలకు ఒకసారి ఉచిత సిలిండర్‌ తీసుకోవచ్చు. సిలిండర్‌ డెలివరీ సమయంలో మొత్తం సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. సిలిండర్‌కు సంబంధించి కేంద్రం ఇచ్చే సబ్సిడీ పోను మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల్లో లబ్ధిదారుని ఖాతాకు జమ చేస్తుంది. ప్రస్తుతం విశాఖలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.811. కేంద్రం ఇచ్చే సబ్సిడీ రూ.3.95. ఇది మినహాయిస్తే రూ.807 లబ్ధిదారుడికి అందుతుంది.

ఇదిలావుండగా విశాఖ జిల్లాలో అన్ని కేటగిరీల్లో కలిపి 9,05,661 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. బియ్యం కార్డులు 5,29,054 ఉన్నాయి. నగరం, గ్రామీణ ప్రాంతాల్లో 3,76,607 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్న కుటుంబాలకు బియ్యం కార్డులు లేవు. ఇక విశాఖ జిల్లాలో అన్ని చమురు కంపెనీలకు సంబంధించి 55 గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో సాధారణ గ్యాస్‌ కనెక్షన్లు 8,90,341 ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోని ఐదు ఏజెన్సీల పరిధిలో సింగిల్‌ సిలిండర్లు ఉన్నవి 2,988, డబుల్‌ సిలిండర్లు ఉన్న కనెక్షన్లు 39,356 ఉన్నాయి. నగరంలో సింగిల్‌ సిలిండర్లు ఉన్నవి 2,21,616, డబుల్‌ సిలిండర్లు ఉన్న కనెక్షన్లు 4,94,632 ఉన్నాయి. దీపం పథకం కింద గ్రామీణ ప్రాంతంలో 7,632, నగరంలో 1,24,117 కనెక్షన్లు ఉన్నాయి. కేంద్రం అందించే ఉజ్వల పథకం కింద జిల్లాలో 15,320 కనెక్షన్లు ఉన్నాయి. వీరికి మాత్రం ప్రతి సిలిండర్‌పై కేంద్రం రూ.300 సబ్సిడీ ఇస్తోంది. ‘మహాశక్తి’ పథకం లబ్ధిదారులు ఈనెల 24వ తేదీ నుంచి సిలిండర్‌ బుక్‌ చేసుకోవచ్చునంటున్నారు. అయితే లబ్ధిదారులపై ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.

Updated Date - Oct 23 , 2024 | 12:49 AM