Share News

సాగునీటికి రైతుల పాట్లు

ABN , Publish Date - Sep 16 , 2024 | 01:31 AM

మండలంలోని సాగునీటి కాలువల నిర్వహణ అధ్వానంగా వుంది. దాదాపు ఐదేళ్ల నుంచి పూడికలు తీయలేదు...

సాగునీటికి రైతుల పాట్లు

అధ్వానంగా కాలువలు, మదుములు

నిర్వహణ పనులను గాలికొదిలేసిన వైసీపీ పాలకులు

కాలువల్లో పేరుకుపోయిన పూడిక, తుప్పలు

శిథిలావస్థకు చేరిన స్లూయిస్‌లు

పలుచోట్ల ధ్వంసమైన రెగ్యులేటింగ్‌ గేట్లు

16 వేల ఎకరాలకు ప్రశ్నార్థకంగా సాగునీరు

కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

పాయకరావుపేట రూరల్‌, సెప్టెంబరు 15:

మండలంలోని సాగునీటి కాలువల నిర్వహణ అధ్వానంగా వుంది. దాదాపు ఐదేళ్ల నుంచి పూడికలు తీయలేదు... తుప్పలు తొలగించలేదు. మదుముల (స్లూయిస్‌) గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి. రెగ్యులేటింగ్‌ గేట్లు విరిగిపోయాయి. వీటికి మరమ్మతులు చేయకపోవడంతో ఆయకట్టు పొలాలకు నీరు సరిగా అందడంలేదు. కాలువల్లో పూడిక తీయించి, మదుములు, గేట్లను బాగు చేయించాలని జలవనరుల శాఖ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాయకరావుపేట మండలంలో తాండవ నదిపై నిర్మించిన మినీ ఆనకట్టల నుంచి భూమి కాలువ, ముఠా కాలువ, ఆవ కాలువలు, అనుబంధ చెరువుల ద్వారా గుంటపల్లి, మంగవరం, అరట్లకోట, సత్యవరం, గోపాలపట్నం, పెంటకోట, మాసాహెబ్‌పేట, శ్రీరాంపురం, కేశవరం, రాజవరం, వెంకటనగరం, ఎస్‌.నర్సాపురం తదితర గ్రామాల్లో సుమారు 16 వేల ఎకరాలకు నీరు అందుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు నిధులు మంజూరై సాగునీటి సంఘాల ద్వారా కాలువల్లో పూడిక తీయించేవారు. కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన కాలువలు, ఉప కాలువల్లో ఒక్కసారి కూడా నిర్వహణ (పూడికతీత) పనులు చేపట్టలేదు. దీంతో ఏటేటా కాలువల్లో పూడిక పేరుకుపోయి, తుప్పలు పెరిగిపోయాయి. ఫలితంగా నీటి ప్రవాహం మందగించి ఆయకట్టు భూములకు నీరు సరిగా అందని పరిస్థితి నెలకొంది. మరోవైపు ముదుములు, ఆయకట్టు భూములకు విడతల వారీగా నీరు అందించే రెగ్యులేటింగ్‌ గేట్లు పాడైపోయాయి. గుంటపల్లి కాలువపై గుంటపల్లి వద్ద మదుము పూర్తిగా ధ్వంసమైంది. దీంతో పొలాలకు నీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. మంగవరం కాలువపై మంగవరం వద్ద ఉన్న మదుము ఆనవాళ్లు లేకుండా ధ్వంసం అయ్యింది. ఇక్కడి నుంచి మెరక కాలువ, పల్లం కాలువ, కొముదుల కాలువ, చెరువు కింద కాలవలకు విడివిడిగా సుమారు 500 ఎకరాలకు నీరు అందాలి. కానీ మూడు గేట్లకుగాను ఒక్కదానికి కూడా తలుపులు లేకపోవడంతో పొలాలకు నీరు అందడంలేరు.

కాలువల్లో పూడిక తీసి, కొత్త మదుములునిర్మించాలి

అల్లు వెంకటేశ్వరరావు, రైతు, మంగవరం

మంగవరం కాలువపై ఉన్న మదుము (స్లూయిస్‌) చాలా కాలం క్రితం మరమ్మతుకు గురైంది. గోడలు పూర్తిగా శిఽథిలమై తలుపులు ఊడిపోయాయి. దీనివల్ల పిల్ల కాలువలకు నీరు ఎక్కడంలేదు. మా పొలాలకు నీరు రావడంలేదు. ఈ సమస్యను పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయినా స్పందించి, సాగునీటి కాలువల్లో పూడికలు తీయించి, కొత్త మదుములు నిర్మించి, గేట్లు ఏర్పాటు చేయించాలి.

ప్రతిపాదనలు పంపించాం

జి.శ్రీరామమూర్తి, ఏఈఈ, జలవనరుల శాఖ

పాయకరావుపేట మండలంలోని ఉప్పరగూడెం, పెదరాంభద్రపురం, శ్రీరాంపురం, కేశవరం, మంగవరం, మాసాహెబ్‌పేట, గోపాలపట్నం, పెంటకోట, రాజగోపాలపురం, గుంటపల్లి, గ్రామాల్లో సాగునీటి కాలువలకు సంబంధించి 29 గేట్ల మరమ్మతు లేదా కొత్త గేట్ల ఏర్పాటు కోసం రూ.34.37 లక్షలతో ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది ఖరీఫ్‌ సీజన్‌నాటికి సాగునీటి పారుదలకు రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకుంటాం.

Updated Date - Sep 16 , 2024 | 01:31 AM