Share News

ఉక్కులో ఫైర్‌ ప్రైవేటీకరణ

ABN , Publish Date - Dec 25 , 2024 | 01:09 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఉక్కులో ఫైర్‌ ప్రైవేటీకరణ

ఆసక్తి గల ఏజెన్సీల నుంచి బిడ్లకు ఆహ్వానం

3 ఫైర్‌ స్టేషన్లు, 13 ఫైర్‌ ఇంజన్లు...282 మంది సిబ్బంది

శాశ్వత సిబ్బందిని తొలగించి ప్రైవేటుకు అప్పగించేందుకు సన్నాహాలు

యాజమాన్యం తన నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల డిమాండ్‌

వేలాది మంది పనిచేస్తున్న కర్మాగారంలో రక్షణ బాధ్యతలు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడం

సముచితం కాదని వాదన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత నాలుగు దశాబ్దాలుగా ప్లాంటుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ అగ్నిప్రమాదం సంభవించినా రక్షణ, సహాయక చర్యలు చేపడుతున్న అగ్నిమాపక (ఫైర్‌ ఫైటింగ్‌) విభాగాన్ని ప్రైవేటీకరణ చేస్తోంది. వీటిని నిర్వహించగలిగిన సామర్థ్యం కలిగిన ఏజెన్సీలు ఎవరైనా ముందుకురావాలని మంగళవారం ప్రకటన జారీచేసింది.

స్టీల్‌ ప్లాంటు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అక్కడ వేలాది మంది నిరంతరం వివిధ పనుల్లో ఉంటారు. పరిపాలన, ఉత్పత్తి విభాగాలతో పాటు ఆస్పత్రి, కమ్యూనిటీ సెంటర్లు కూడా ఉన్నాయి. ఇది స్టీల్‌ ఉత్పత్తి చేసే పరిశ్రమ కావడంతో వివిధ రకాల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. అందుకే అతి పెద్ద ఫైర్‌ ఫైటింగ్‌ విభాగం ఏర్పాటుచేశారు. ప్లాంటులో మూడు ఫైర్‌ స్టేషన్లు, 13 ఫైర్‌ ఇంజన్లు (అగ్నిమాపక వాహనాలు), వాటిలో పనిచేయడానికి 282 మంది శాశ్వత సిబ్బంది ఉన్నారు. ప్లాంటులో 2,744 ఫైర్‌ హైడ్రెంట్లు, 1,071 ఎక్సటర్నల్‌ ఫైర్‌ హైడ్రెంట్లు, 86 మానిటరింగ్‌ కేంద్రాలు, 28 ఫైర్‌ ఫైటింగ్‌ పంప్‌ హౌస్‌లు ఉన్నాయి. ప్రమాదాలు సంభవించినప్పుడు కొన్నిసార్లు మంటలను నీటితో కాకుండా ఫోమ్‌, రసాయనాలను ఉపయోగించి నియంత్రించాల్సి ఉంటుంది. దానికి తగిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మంటలను అదుపుచేసే కార్బన్‌ డయాక్సైడ్‌ వాహనం, ఫోమ్‌తో కూడిన వాహనాలు ఉన్నాయి. ఇవికాకుండా వివిధ ప్రాంతాల్లో 14 వేల ఫైర్‌ ఎగ్జిటింగ్‌ విషర్లు ఏర్పాటుచేశారు. వీటిని ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది గత నాలుగు దశాబ్దాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. స్టీల్‌ ప్లాంటులోనే కాకుండా హెచ్‌పీసీఎల్‌, పోర్టు, ఫార్మా సిటీ వంటి పరిశ్రమల్లో భారీ ప్రమాదాలు సంభవించినప్పుడు స్టీల్‌ ప్లాంటు అగ్నిమాపక శకటాలు వెళ్లి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ప్లాంటుతో పాటు ఉద్యోగులు నివసించే టౌన్‌షిప్‌, హిల్‌ టాప్‌ గెస్ట్‌హౌస్‌, ఆస్పత్రి, స్కూళ్లు, పోస్టాఫీసులు, ఇతర భవనాలకు కూడా వీరు రక్షణ కల్పించాల్సి ఉంది. ఈ విభాగంలో పనిచేసే వారు ప్లాంటుకు చెందిన శాశ్వత సిబ్బంది కాబట్టి ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా ప్రాణాలకు తెగించి రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇప్పుడు దీనిని ప్రైవేటీకరణ చేస్తే...కాంట్రాక్టుకు పనిచేసే సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి స్టీల్‌ప్లాంటు ఆస్తులను, మనుషులను కాపాడతారా?...అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇంత పెద్ద కర్మాగారం రక్షణ బాధ్యతలను ప్రైవేటుకు అప్పగించడం సముచితం కాదని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పైగా ఈ ఫైర్‌ ఫైటింగ్‌ విభాగంలో ఉన్న వనరులన్నీ ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చి, కేవలం కాంట్రాక్టు సిబ్బందితో నిర్వహించాలని కోరడం ఏ విధంగా ఆమోదయోగ్యం కాదనే వాదన గట్టిగా వినిపిస్తోంది.

ఇది దుర్మార్గం..వెనక్కి తీసుకోవాలి

అయోధ్యారామ్‌, సీఐటీయూ నాయకులు

యాజమాన్యం ప్లాంటుకు అవసరమైన ముడి పదార్థాలు ఎలా తేవాలి?, ఉత్పత్తి ఎలా పెంచాలి?, మార్కెటింగ్‌ ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశాలపై దృష్టి పెట్టకుండా ఉద్యోగుల సంఖ్య తగ్గించడంపైనా, ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటీకరణ చేయడంపైనా కసరత్తు చేస్తోంది. ఇది దుర్మార్గమైన చర్య. దీని కోసం విడుదల చేసిన ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలి.

Updated Date - Dec 25 , 2024 | 01:09 AM