ఐదేళ్లలో అభివృద్ధికి ప్రణాళిక
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:54 AM
స్వర్ణాంధ్ర-2047కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రణాళిక రూపొందించారు.
2028-29కల్లా వ్యవసాయంలో 10.95 శాతం వృద్ధి లక్ష్యం
పారిశ్రామిక రంగంలో 15.55, సేవల రంగంలో 15.61 శాతం...
2022-23 ఆర్థిక సంవత్సరంలో జిల్లా స్థూల ఆదాయం రూ.1,19,268 కోట్లు
2028-29కల్లా రూ.2,58,565 కోట్లు సాధించాలని లక్ష్యం
స్వర్ణాంధ్ర 2047కు అనుగుణంగా జిల్లా యాక్షన్ ప్లాన్-2029కు రూపకల్పన
విశాఖపట్నం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
స్వర్ణాంధ్ర-2047కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రణాళిక రూపొందించారు. దానికి అనుగుణంగా జిల్లాల వారీగా విజనరీ యాక్షన్ ప్లాన్ ఖరారుకు ఆదేశించారు. ఈ మేరకు విశాఖ జిల్లా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవల రంగాలు ప్రధానమైనవిగా గుర్తించి వాటిల్లో 2028-29కల్లా సాధించాల్సిన లక్ష్యాలపై అంచనాలు రూపొందించారు. ఇందుకు 2022-23 ఆర్థిక సంవత్సరం లెక్కలను ప్రామాణికంగా తీసుకున్నారు.
విశాఖ జిల్లా స్థూల ఆదాయం/ఉత్పత్తి 2022-23 సంవత్సరంలో రూ.1,19,268 కోట్లు (రాష్ట్ర స్థాయిలో జిల్లా వాటా 9.14 శాతం)గా నమోదైంది. ఆ సంవత్సరంలో లెక్కల మేరకు వ్యవసాయం నుంచి రూ.3,569 కోట్లు (3.19 శాతం), పారిశ్రామిక రంగాల నుంచి రూ.59,264 కోట్లు (52.93 శాతం), సేవల రంగం నుంచి 49,131 కోట్లు (43.88 శాతం)...మొత్తం రూ.1,11,964 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ మూడు రంగాల్లో ఆదాయం 2028-29 కల్లా రూ.2,58,565 కోట్లు లక్ష్యంగా ప్రణాళికలో పొందుపరిచారు. వ్యవసాయంలో 10.95 శాతం వృద్ధితో రూ.6348 కోట్లు, పారిశ్రామిక రంగంలో 15.55 శాతం వృద్ధితో రూ.129,269 కోట్లు, సేవల రంగంలో 15.61 శాతం వృద్ధితో 1,22,948 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2029 నాటికి జిల్లా అభివృద్ధి కోసం ప్రణాళిలు రూపొందించి నివేదించామని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తెలిపారు. ప్రధానంగా వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలగా విభజించి ప్రణాళికలు ఖరారు చేశామన్నారు.
వ్యవసాయ రంగంలో 10.95 శాతం వృద్ధి లక్ష్యం
జిల్లాలో వ్యవసాయ భూముల విస్తీర్ణం చాలా తక్కువ. రాష్ట్ర స్థాయిలో విశాఖ జిల్లా చివరి స్థానం (26)లో నిలిచింది. వ్యవసాయ రంగం ద్వారా 2022-23లో వచ్చిన ఆదాయం రూ.3,569 కోట్లు. దీనిని ఏటా 10.95 శాతం వృద్ధితో 2028-29కల్లా రూ.6,348 కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. శాఖల వారీగా వివరాలు పరిశీలిస్తే వ్యవసాయం నుంచి రూ.86 కోట్లు ఆదాయం రాగా నాలుగు శాతం వృద్ధితో 2029 కల్లా ఏటా రూ.102 కోట్లు, ఉద్యానవనాల నుంచి రూ.477 కోట్లు ఉండగా ఏటా ఏడు శాతం వృద్ధితో రూ.711 కోట్లు, లైవ్ స్టాక్ నుంచి రూ.1085 కోట్లు సమకూరగా ఏటా పది శాతం వృద్ధితో రూ.1,932 కోట్లు, మత్స్య శాఖ నుంచి రూ.1,833 కోట్లు రాగా ఏటా 13 శాతం వృద్ధితో రూ.3,488 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. బీడు భూముల్లో పంటల సాగు ప్రధానంగా నేచురల్ ఫార్మింగ్, చిరుధాన్యాల సాగు, తోటల పెంపకం, ఇంకా పంటల నిల్వకు శీతల గిడ్డంగులు, మేలు జాతి పశువుల పెంపకం, సముద్ర మత్స్య ఉత్పత్తులు పెంపు, ఫిష్ జట్టీలు ఏర్పాటు, చేపల వేటకు మత్స్యకారులకు ఆధునిక పనిముట్లు అందజేయడం వంటివి చేయాలని ప్రణాళికలు పొందుపరిచారు.
పారిశ్రామిక రంగంలో 15.55 శాతం వృద్ధి లక్ష్యం
పారిశ్రామిక ఉత్పత్తిలో 2022-23లో రూ.59,264 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఏటా 15.55 శాతం వృద్ధితో 2028-29కల్లా ఆదాయం రూ.1,29,269 కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. 2022-23లో మైనింగ్ శాఖ నుంచి రూ.30 కోట్లు ఆదాయం రాగా ఏటా మూడు శాతం వృద్ధితో రూ.38 కోట్లకు పెంచనున్నారు. ఉత్పత్తి రంగంలో రూ.10,031 కోట్ల ఆదాయం రాగా 18 శాతం వృద్ధితో రూ.25,841 కోట్లకు, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వాటా కింద రూ.2,829 కోట్లు రాగా ఏటా 15 శాతం వృద్ధితో 6,543 కోట్లు ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమల్లో మరింత ఉత్పత్తి పెంచడం, చిన్న, కుటీర, మధ్యతరహా పరిశ్రమ రంగాన్ని ప్రోత్సహించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ రంగాల్లో రూ.144.61 కోట్లతో 813 యూనిట్లు స్థాపించి 5129 మంది ఉపాధి కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో అమలుచేస్తున్న ఉపాధి పథకాలను వేగంగా మంజూరుచేయడం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తరచు శిక్షణ శిబిరాలు నిర్వహించి ప్రోత్సహించడం వంటి చేపట్టాలని నిర్ణయించారు.
సేవల రంగంలో 15.61 శాతం వృద్ధి లక్ష్యం
జిల్లాలో 2022-23లో సేవల రంగం నుంచి 43.88 శాతం వాటాతో రూ.49,131 కోట్లు ఆదాయం వచ్చింది. దీనిని 2028-29కల్లా ఏటా 15.61 శాతం వృద్ధితో రూ.1,12,948 కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. వ్యాపారం, హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి రూ.13,917 కోట్ల ఆదాయం రాగా ఏటా 18 శాతం వృద్ధితో రానున్న ఐదేళ్లలో రూ.34,910 కోట్లకు చేర్చాలని నిర్దేశించుకున్నారు. రవాణా, గిడ్డంగులు తదితర రంగాల నుంచి రూ.9,350 కోట్ల ఆదాయం రాగా ఏటా 17 శాతం వృద్ధితో రూ.22,684 కోట్లు, రియల్ ఎస్టేట్, దాని అనుబంధ రంగాల నుంచి రూ.6,464 కోట్ల ఆదాయం రాగా ఏటా 16 శాతం వృద్ధితో రూ.15,208 కోట్లు, ఇతర సేవల విభాగాల నుంచి రూ.6,667 కోట్లు రాగా 15.74 శాతంతో రూ.12,070 కోట్లు ఆదాయం సేకరించాలని ప్రతిపాదించారు. సేవల రంగం ఆదాయం పెంపునకు సంబంధించి ప్రధానంగా ఆగ్నేసియా దేశాల నుంచి బౌద్ధ పర్యాటకులకు ఆకర్షించడం, సముద్రంలో క్రూయిజ్‌ల నిర్వహణ, యాటింగ్, సీప్లేన్, బీచ్‌లకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెంచడం, వాటర్ స్పోర్ట్స్, హెల్త్, కల్చరర్ పర్యాటక రంగాలను ప్రోత్సహించాలని ప్రణాళికలు పొందుపరిచారు.