Share News

ఫ్లాట్ల రేట్లూ సవరణ

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:57 AM

జిల్లాలో భూముల విలువలతో పాటు అపార్టుమెంట్లలో ఫ్లాట్ల విలువలను కూడా సవరిస్తూ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.

ఫ్లాట్ల రేట్లూ సవరణ

  • రిజిస్ర్టేషన్‌ విలువల పెంపు

  • బీచ్‌రోడ్డులో అత్యధికంగా 20 శాతం పెంపు ప్రతిపాదన

  • మర్రిపాలెంలో 14 శాతం

  • సీతమ్మధారలో 4 శాతం

  • రుషికొండలో 9 శాతం

  • అభ్యంతరాలు ఉంటే 24లోగా లిఖిత పూర్వకంగా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో సమర్పించవచ్చు

  • జనవరి ఒకటో తేదీ నుంచి అమలు

  • సీతమ్మధారలో అత్యధికంగా మార్కెట్‌ రేటు చదరపు అడుగు రూ.8,200

  • ఎండాడలోరూ.7 వేలు

  • కూర్మన్నపాలెంలో రూ.3 వేలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో భూముల విలువలతో పాటు అపార్టుమెంట్లలో ఫ్లాట్ల విలువలను కూడా సవరిస్తూ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. విశాఖపట్నంలో లావాదేవీలు ఎక్కువగా ఫ్లాట్లకు సంబంధించినవి కావడంతో ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్‌ విలువలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అత్యధికంగా 20 శాతం పెంచారు. కూర్మన్నపాలెంలో అయితే అసలు ఎటువంటి మార్పు చేయలేదు. అక్కడ చదరపు అడుగు ధర రూ.3 వేలు ఉండగా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు.

పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక, కూర్మన్నపాలెం, మల్కాపురం ఏరియాల్లో చ.అ. ధర రూ.3 వేలకు మించి లేకపోవడం గమనార్హం. నగరంలోని సీతమ్మధార లో మార్కెట్‌ విలువ చ.అడుగు రూ.8,200 ఉన్నట్టుగా అధికారులు చూపించారు. అయితే అక్కడ ప్రభుత్వ ధర రూ.5,700 మాత్రమే ఉంది. దానిని నాలుగు శాతం పెంచి రూ.5,900 చేశారు. బీచ్‌రోడ్డులో ఎస్‌ఎఫ్‌టీ ధర రూ.5 వేలు ఉండగా రూ.6 వేలు చేశారు. అంటే 20 శాతం పెరగనున్నది. అదే అత్యధికం. మధురవాడలోని వీఎంఆర్‌డీఏ హరిత ప్రాజెక్టులో ప్రభుత్వ ధర చదరపు అడుగు రూ.4 వేలు ఉండగా మార్కెట్‌ ధర రూ.7 వేలు ఉంది. దానిని ఇప్పుడు రూ.4,200 చేశారు. మార్కెట్‌ రేటు ప్రకారం కొనుగోలు చేసినా దానిని సవరించిన రేటు ప్రకారం అడుగు రూ.4,200 చొప్పున రిజిస్టర్‌ చేసుకోవచ్చు. దానిపైనే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుములు చెల్లించాలి. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు ప్రకారం నిర్ణయించిన రేటుకే డాక్యుమెంట్‌ రాసుకోవచ్చు. కొత్త రేట్లపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే 24వ తేదీలోగా లిఖిత పూర్వకంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సమర్పించవచ్చు. పెంపు జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది.

ఇంకా ఎక్కడెక్కడ ఎలా పెరిగాయంటే...

- మురళీనగర్‌లో ప్రస్తుతం చ.అడుగు రూ.4,500 ఉండగా రూ.5,100 చేశారు. అక్కడ మార్కెట్‌ విలువ రూ.6,300 ఉంది.

- మర్రిపాలెం మెయిన్‌రోడ్డులో ప్రస్తుతం రూ.4,400 ఉండగా రూ.5 వేలు చేశారు. మార్కెట్‌ విలువ రూ.5 వేలు ఉంది.

- మాధవధారలో చ.అడుగు రూ.4,600 ఉండగా రూ.5,100 చేశారు. అక్కడ మార్కెట్‌ రేటు రూ.6,300.

- అబిద్‌నగర్‌, అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డులో ప్రస్తుతం రూ.5,500 ఉండగా రూ.5,600 చేశారు. అక్కడ మార్కెట్‌ విలువ రూ.7,800 ఉంది.

- సీతమ్మధార, పీ అండ్‌ టీ కాలనీ, బాలయ్య శాస్త్రి లేఅవుట్‌లలో రూ.5,700 ఉండగా రూ.5,900 చేశారు. అక్కడ మార్కెట్‌ విలువ రూ.8,200 ఉంది.

- నాయుడుతోట, దుర్గానగర్‌, కృష్ణానగర్‌లలో చ.అడుగు రూ.2,600 ఉండగా రూ.2,900 చేశారు. అక్కడ మార్కెట్‌ విలువ రూ.4,900గా ఉంది.

- ప్రహ్లాదపురం కాలనీలో రూ.3,200 ఉండగా రూ.3,600 చేశారు. మార్కెట్‌ రేటు రూ.6 వేలు ఉంది.

- లా కాలేజీ రోడ్డు, ఎంవీవీ సిటీలో చ.అడుగు రూ.4 వేలు ఉండగా రూ.4,200 చేశారు. మార్కెట్‌ రేటు రూ.7 వేలు ఉంది.

- కొమ్మాది జంక్షన్‌లో రూ.4,500 ఉండగా దానిని రూ.200 పెంచి రూ.4,700 చేశారు. అక్కడ మార్కెట్‌ రేటు రూ.6 వేలు ఉంది.

- సాయిప్రియా లేఅవుట్‌లో రూ.3,500 ఉండగా 200 పెంచి రూ.3,700 చేశారు. అక్కడ మార్కెట్‌ విలువ రూ.6 వేలు ఉంది.

- రుషికొండ వుడా లేఅవుట్‌లో రూ.3,500 ఉండగా రూ.3,800 చేశారు. అక్కడ మార్కెట్‌ రేటు రూ.5,500 ఉంది.

- ఎండాడలో రూ.3,500 ఉండగా రూ.300 పెంచి రూ.3,800 చేశారు. అక్కడ మార్కెట్‌ రేటు రూ.5,500 ఉంది.

- ఇండియా బుల్స్‌, ఐటీ పార్కు, స్కై లైన్‌, స్కై పార్క్‌, ఎంకే గోల్డ్‌, ఎంకే కోస్టు తదితర అపార్ట్‌మెంట్లలో చ.అడుగు ధర రూ.4 వేలు ఉండగా దానిని రూ.4,200 చేశారు. మార్కెట్‌ రేటు రూ.7 వేలు ఉంది.

- ఎం.వి.పి.కాలనీలో చ.అడుగు రూ.4,500 ఉండగా దానిని రూ.5,300 చేశారు.

- లాసన్స్‌ బే కాలనీలో రూ.5 వేలు ఉండగా రూ.5,300 చేశారు.

Updated Date - Dec 22 , 2024 | 12:57 AM