Share News

గజానికో గండం..!

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:32 AM

వాయుగుండం కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులు అత్యంత దారుణంగా మారాయి. ఎక్కడికక్కడ తేలి, గోతులు ఏర్పడాయి.

గజానికో గండం..!
నేవీ రోడ్డులో సంతపాలెం జంక్షన్‌ సమీపంలో దుస్ధితి

భారీ వర్షాలకు అస్తవ్యస్తంగా మారిన పలు గ్రామాల రహదారులు

రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు

గత ఐదేళ్లలో పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం

ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని అంతా వేడుకోలు

రాంబిల్లి, సెప్టెంబరు 11 : వాయుగుండం కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులు అత్యంత దారుణంగా మారాయి. ఎక్కడికక్కడ తేలి, గోతులు ఏర్పడాయి. వాటిలో వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు వాహనచోదకులు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. కొన్నిచోట్ల గోతులు చెరువులను తలపిస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వాడ నర్సాపురం నుంచి వెంకటాపురం వెళ్లే నేవీ రోడ్డు, సంతపాలెం నుంచి వెల్చూరు మీదుగా పెదకలవలాపల్లి వెళ్లే రోడ్డు, రాజుకోడూరు, అప్పారాయుడుపాలెం, కృష్ణంపాలెం గ్రామాలకు వెళ్లే రోడ్ల దుస్థితి చెప్పనక్కర్లేదు. చాలాచోట్ల గొయ్యి ఎక్కడో, రోడ్డు ఎక్కడో గుర్తించడం కష్టంగా ఉంది. వీటిపై ప్రయాణం అంటే సాహసమనే చెప్పాలి. పగటి పూట ఎలాగోలా రాకపోకలు సాగిస్తున్నామని, రాత్రి వేళ ఈ రోడ్లపై ప్రయాణం అంటే భయంగా ఉందని పలువురు వాపోతున్నారు. వర్షాలు పడినప్పుడల్లా గోతులు మరింత పెరిగిపోతున్నా కన్నెత్తి చూసేవారు కరువయ్యారని పేర్కొంటున్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ దుస్థితి ఏర్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ రోడ్ల మరమ్మతుకు ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా వాహన చోదకులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:32 AM