Share News

నివాస గృహాల్లో గంజాయి నిల్వలు!

ABN , Publish Date - Mar 25 , 2024 | 01:39 AM

గంజాయి స్మగ్లర్లు సరికొత్త వ్యూహం అమలుచేస్తున్నారు.

నివాస గృహాల్లో  గంజాయి నిల్వలు!

నగరంలో ఇళ్లను అద్దెకు తీసుకుంటున్న స్మగ్లర్లు

ఏజెన్సీ నుంచి సరకు తీసుకొచ్చి నిల్వ

అక్కడి నుంచి పలుమార్గాల్లో ఇతర రాష్ట్రాలకు రవాణా

జనావాసాల మధ్య దర్జాగా అక్రమాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘ఈనెల 21న గోపాలపట్నంలోని ఒక ఇంట్లో గంజాయి నిల్వ చేసినట్టు సమాచారం అందడంతో పోలీసులు, స్పెషల్‌ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు సంయుక్తంగా దాడి చేసి దాదాపు 250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

‘రెండు నెలల కిందట అల్లిపురంలోని ఓ ఇంటిపై పోలీసులు దాడిచేసి 214 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.’

గంజాయి స్మగ్లర్లు సరికొత్త వ్యూహం అమలుచేస్తున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా నగరంలో జనవాసాలమధ్య ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. కొద్దిరోజులు నమ్మకంగా ఉంటూ తర్వాత తమ పథకాన్ని అమలుచేస్తున్నారు. ఏజెన్సీ నుంచి గంజాయిని గుట్టుగా నగరానికి తరలించి, నేరుగా తాము నిర్దేశించుకున్న గమ్యస్థానానికి చేరవేయకుండా నగరంలో అద్దెకు తీసుకున్న ఇంటికి తీసుకెళుతున్నారు. అక్కడ భద్రపరిచిన తర్వాత, అవకాశం చూసుకుని ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు బస్సులు, రైళ్లు, కొరియర్‌ ద్వారా తరలించేస్తున్నారు. గతంలో ఏజెన్సీలో సేకరించిన గంజాయిని స్మగ్లర్లు వాహనాల ద్వారా మైదానప్రాంతానికి తీసుకొచ్చి అక్కడి నుంచి నేరుగా గమ్యస్థానానికి చేర్చేవారు. మరికొందరు గంజాయి రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు వీలుగా వాహనాల్లో ప్రత్యేక మార్పులు చేసి, అందులో తరలించేవారు. ఇలాంటి జిమ్మిక్కులను పోలీసులు పసిగడుతుండడంతో గంజాయి స్మగ్లర్లకు చెక్‌ పడింది. దీంతో ఏజెన్సీ నుంచి విద్యార్థుల ద్వారా, ఇతర సరకుల మధ్యలో కొద్ది పరిమాణంలో గంజాయిని పెట్టి నగరానికి తరలించే పథకాలను అమలు చేశారు. ఇలా నగరానికి స్వల్పపరిమాణంలో చేరుతున్న గంజాయిని తాము అద్దెకు తీసుకున్న ఇళ్లలో భద్రపరుస్తున్నారు. అక్కడ ప్రత్యేక ప్యాకెట్ల రూపంలో మార్చి, అవకాశం చూసుకుని కొరియర్‌, ట్రావెల్స్‌, రైళ్లలో రహస్యంగా తమిళనాడు, కేరళ, గోవా, ముంబయి వంటి ప్రాంతాలకు తరలించేస్తున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో జనావాసాల మధ్య ఇళ్లలో గంజాయి నిల్వ చేయడంపై ప్రత్యేక నిఘా పెట్టారు. గంజాయి స్మగ్లర్లకు ఇల్లు అద్దెకిస్తే ఇంటిని సీజ్‌ చేయడంతో పాటు యజమానిని కూడా ఎన్‌డీపీఎస్‌ కేసులో అరెస్టు చేస్తామని జాయింట్‌ సీపీ ఫకీరప్ప ఆదివారం హెచ్చరించారు.

Updated Date - Mar 25 , 2024 | 01:39 AM