Share News

మ్యూజియానికి మంచిరోజులు

ABN , Publish Date - Oct 22 , 2024 | 12:38 AM

లంబసింగిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియానికి మంచిరోజులు రానున్నాయి. మ్యూజియం నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో పనులు ఊపందుకోనున్నాయి.

మ్యూజియానికి మంచిరోజులు
శ్లాబ్‌ నిర్మాణానికి సిద్ధం చేసిన మ్యూజియం మెయిన్‌ బ్లాక్‌

లంబసింగిలోని గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి నిధులు విడుదల

రూ.6.75 కోట్ల నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వం

గత వైసీపీ పాలనలో పైసా కూడా విడుదల చేయని వైనం

కేంద్రం ఇచ్చిన నిధులూ ఇతర అవసరాలకు మళ్లింపు

పనులకు బ్రేక్‌

తాజాగా నిధుల విడుదలతో ఊపందుకోనున్న నిర్మాణాలు

చింతపల్లి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): లంబసింగిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియానికి మంచిరోజులు రానున్నాయి. మ్యూజియం నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో పనులు ఊపందుకోనున్నాయి. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రం వాటా నిధుల్లో కనీసం పైసా కూడా విడుదల చేయలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం రాష్ట్రం వాటాగా రూ.6.75 కోట్ల నిధులు కేటాయించడంతో గిరిజన సంక్షేమశాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.

దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్‌ పాలకులను గడగడ వణికించిన ఆదివాసీ పోరాటయోధుల చరిత్ర భావితరాలకు తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2021లో రాష్ట్రానికి ‘గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం’ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మ్యూజియం నిర్మాణానికి రూ.35 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.15 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.20 కోట్లుగా ఒప్పందం జరిగింది. కేంద్రం వాటాలో తొలి విడతగా రూ.7.5 కోట్ల నిధులను మంజూరు చేసింది. మ్యూజియం నిర్మాణానికి లంబసింగికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాజంగి డెయిరీ ఫారం భూములు 22 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. మ్యూజియం నిర్మాణాలకు 2021 అక్టోబరు 8వ తేదీన నాటి గిరిజన సంక్షేమశాఖా మంత్రి పుష్పశ్రీవాణి శంకుస్థాపన చేశారు. మ్యూజియంలో స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను వివరిస్తూ విగ్రహాలు, తిరుగుబాటులో వినియోగించిన ఆయుధాలను ప్రదర్శిస్తూ ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మ్యూజియంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గిరిజనుల కోసం ప్రత్యేక దుకాణ సముదాయాలు, యాంఫీ థియేటర్‌, రెస్టారెంట్‌, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. ఈ మ్యూజియం రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేశారు.

నిధుల విడుదలలో జాప్యంతో మందకొడిగా పనులు

మ్యూజియం నిర్మాణాలకు సంబంధించి కేంద్రం వాటాలో తొలి విడతగా 2021లో రూ.7.5కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులను గత వైసీపీ ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన నిధుల్లో తొలి విడతగా రూ.3.5కోట్లు, ఈ ఏడాది జనవరిలో రూ.నాలుగు కోట్లను విడుదల చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటాకి సంబంధించి ఒక్కపైసా విడుదల చేయకపోవడంతో నిర్మాణ పనులు ముందుకు సాగలేదు.

ప్రభుత్వం మారడంతో పనుల్లో కదలిక

కూటమి ప్రభుత్వం రావడంతో మ్యూజియం పనులకు కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించేందుకు కాంట్రాక్టర్‌కి భరోసా ఇవ్వడంతో పనులు పునఃప్రారంభమయ్యాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.20 కోట్లలో తొలి విడతగా రూ.6.75 కోట్లు కేటాయించింది. ఈ నిధులు విడుదల చేసేందుకు గిరిజన సంక్షేమశాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో ఈ నిధులు కాంట్రాక్టర్‌కు మంజూరుకానున్నాయి. దీంతో మ్యూజియం పనులు వేగవంతంకానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మ్యూజియం నిర్మాణాలకు నిధులు విడుదల చేయడంపై ఈ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 22 , 2024 | 12:38 AM