Share News

గ్రావెల్‌ తవ్వకాలపై విచారణ జరిపించాలి

ABN , Publish Date - Feb 12 , 2024 | 11:44 PM

పరవాడ రెవెన్యూ పరిధి సర్వే నంబరు 11లో అక్రమ గ్రావెల్‌ తవ్వకాలపై తక్షణమే విచారణ జరిపించాలని, ఇందులో ప్రధానపాత్ర పోషించిన ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ను సస్పెండ్‌ చేయాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్‌ చేశారు.

గ్రావెల్‌ తవ్వకాలపై విచారణ జరిపించాలి
గ్రావెల్‌ తవ్వకాలు జరిపి ప్రాంతాన్ని పరిశీలిస్తున్న బండారు సత్యనారాయణమూర్తి, టీడీపీ నాయకులు

ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ను అరెస్టు చేసి, సస్పెండ్‌ చేయాలి

మాజీ మంత్రి బండారు డిమాండ్‌

పరవాడ, ఫిబ్రవరి 12: పరవాడ రెవెన్యూ పరిధి సర్వే నంబరు 11లో అక్రమ గ్రావెల్‌ తవ్వకాలపై తక్షణమే విచారణ జరిపించాలని, ఇందులో ప్రధానపాత్ర పోషించిన ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ను సస్పెండ్‌ చేయాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్‌ చేశారు. ఆదివారం గ్రావెల్‌ తవ్వకాలు జరిపిన ప్రదేశాన్ని టీడీపీ శ్రేణులతో కలిసి సోమవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ అండదండలతో పరవాడ ప్రాంతంలో యథేచ్ఛగా గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు, తరలింపు జరుగుతున్నాయని ఆరోపించారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు ఏపీ ట్రాన్స్‌కో నుంచి, గ్రావెల్‌ తవ్వకాలకు మైనింగ్‌ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని, కానీ ఇవేమీ లేకుండా గ్రావెల్‌ తవ్వి, తరలించుకుపోవడానికి ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌, అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు కుమ్మక్కయారని బండారు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి ఏపీఐఐసీ అధికారిని అరెస్టు చేసి ప్రాసిక్యూట్‌ చేయాలని, పోలీసులు సీజ్‌ చేసిన ఎక్స్‌కవేటర్‌, డంపర్‌ లారీలను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

వంద ఎకరాల్లో గ్రావెల్‌ తవ్వకాలు రంగం సిద్ధం

దేశపాత్రునిపాలెం రెవెన్యూ పరిధిలో సుమారు వంద ఎకరాల్లో గ్రావెల్‌ తవ్వకాలు జరిపేందుకు వైసీపీ నాయకులు రంగం సిద్ధం చేశారని, బండారు ఆరోపించారు. ఈ వ్యవహారంలో జిల్లాకు చెందిన ఓ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రధానపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఇక్కడ గ్రావెల్‌ తవ్వకాలకు కలెక్టర్‌ తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్టు తమ దృష్టికి వచ్చిందని, ఎట్టి పరిస్థితుల్లో గ్రావెల్‌ తవ్వకాలు జరిపేందుకు వీల్లేదని,. కలెక్టర్‌ అనుమతులు ఇచ్చివుంటే తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో 79వ వార్డు కార్పొరేటర్‌ రౌతు శ్రీనివాస్‌, తిక్కవానిపాలెం ఎంపీటీసీ సభ్యుడు సూరాడ బంగార్రాజు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 11:44 PM