మెట్రో రైలుకు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Dec 03 , 2024 | 01:05 AM
విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
తొలి దశకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే
డీపీఆర్‌కు ఆమోదం
మూడు కారిడార్లు...46.23 కి.మీ.
రూ.11,498 కోట్ల వ్యయం
రెండో దశలో 30.67 కి.మీ., రూ.5,734 కోట్లు
నిర్మాణ వ్యయం పూర్తిగా భరించాలని కేంద్రానికి వినతి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా 46.23 కి.మీ. పొడవున మూడు కారిడార్లు నిర్మిస్తారు. రెండో దశలో 30.67 కి.మీ. పొడవున మరో కారిడార్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఆమోదిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇదే సందర్భంలో గత వైసీపీ ప్రభుత్వం 2023 డిసెంబరు 29న జారీచేసిన 161వ నంబరు జీఓను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. వైసీపీ ప్రభుత్వం విశాఖలో లైట్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రతిపాదనలు రూపొందించింది. అందులో 76.9 కి.మీ. పొడవున నాలుగు కారిడార్లను రూ.14,309 కోట్లతో నిర్మిస్తామని ప్రతిపాదించింది. దీనిని వయబులిటీ గ్యాప్ ఫండ్-పీపీపీ విధానంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 40 శాతం తీసుకొని, మిగిలిన 60 శాతం ప్రైవేటు డెవలపర్ల నుంచి సమీకరిస్తామని అప్పుడు వెల్లడించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒకేసారి నాలుగు కారిడార్లు కాకుండా మొదట మూడు కారిడార్లు, ఆ తరువాత మిగిలిన నాలుగో కారిడార్ నిర్మించాలని కొత్త డీపీఆర్ తయారుచేసింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయం మొత్తం కేంద్రం నుంచే రాబట్టాలని ప్రయత్నం చేస్తోంది. కోల్‌కతాలో మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రమే పూర్తిగా నిధులు అందించిందని, అదే విధానంలో విశాఖ మెట్రోకు సాయం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి నారాయణ ఇటీవల ఢిల్లీ వెళ్లి అక్కడి పెద్దలను కోరారు.
తొలి దశలో
మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశలో స్టీల్ ప్లాంటు నుంచి కొమ్మాది వరకు 34.4 కి.మీ.తో మొదటి కారిడార్, గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకు 5.08 కి.మీ. పొడవున రెండో కారిడార్, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకూ 6.75 కి.మీ. పొడవున మూడో కారిడార్ నిర్మిస్తారు. దీనికి అవసరమైన భూమి ధర కాకుండా రూ.11,498 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ మూడు కారిడార్లకు 99.75 ఎకరాలు అవసరమని, అందుకు మరో రూ.882 కోట్లు అవసరమని అధికారులు లెక్కగట్టారు.
రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 30.67 కి.మీ. పొడవున నాలుగో కారిడార్ నిర్మిస్తారు. దీనికి రూ.5,734 కోట్లు అవసరం. సుమారు 6.13 ఎకరాల భూమి అవసరమని, దానికి రూ.23 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.