Share News

నిరుపేదలకు ఆరోగ్య రక్ష

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:05 AM

నిరుపేదలకు ఆరోగ్య భరోసాను కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా లబ్ధిదారులకు రూ.5 లక్షల విలువజేసే వైద్యాన్ని ఉచితంగా అందించనుంది. పథకానికి సంబంధించి గతంలోనే అర్హుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. మిగిలిన వారికి కొద్దిరోజుల్లో ఇంటింటి సర్వేను నిర్వహించి ఎంపిక చేయనున్నారు.

నిరుపేదలకు ఆరోగ్య రక్ష

ఆయుష్మాన్‌ భారత్‌ పేరుతో కేంద్ర పథకం

ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం

ఇప్పటివరకూ జిల్లాలో 2,44,192 కుటుంబాలు గుర్తింపు

లబ్ధిదారుల సంఖ్య 9,11,734

6,33,742 మందికి ఈకేవైసీ పూర్తి

16,806 మందికి కార్డులు కూడా రాక...6,710 పంపిణీ

దారిద్య్ర రేఖకు ఎగువనున్నా

70 దాటిన వారంతా ఈ పథకానికి అర్హులే

విశాఖపట్నం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):

నిరుపేదలకు ఆరోగ్య భరోసాను కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా లబ్ధిదారులకు రూ.5 లక్షల విలువజేసే వైద్యాన్ని ఉచితంగా అందించనుంది. పథకానికి సంబంధించి గతంలోనే అర్హుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. మిగిలిన వారికి కొద్దిరోజుల్లో ఇంటింటి సర్వేను నిర్వహించి ఎంపిక చేయనున్నారు.

ఇప్పటివరకూ పూర్తిచేసిన ప్రక్రియ మేరకు జిల్లాలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకానికి 2,44,192 కుటుంబాలు అర్హత సాధించగా, 9,11,734 మంది కుటుంబ సభ్యులున్నారు. వీరిలో 6,33,742 మందికి ఈకేవైసీ ప్రక్రియను స్థానిక సచివాలయ/వార్డు సిబ్బంది పూర్తిచేశారు. లబ్ధిదారులకు అందించేందుకు ఎన్టీఆర్‌ వైద్య సేవ కార్యాలయానికి 16,806 ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు రాగా, వీటిని జిల్లాలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేశారు. అక్కడి సిబ్బంది 6,710 మందికి కార్డులను అందించారు. మిగిలిన కార్డులను పంపిణీ చేయాల్సి ఉందని చెబుతున్నారు. కొద్దిరోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.

రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం

ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో భాగంగా ఉచితంగా రూ.5 లక్షల వరకు విలువచేసే వైద్యాన్ని అందిస్తారు. జిల్లాలో ఆయుష్మాన్‌ భారత్‌ నెట్‌వర్క్‌ పరిఽధిలో 87 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. ఎన్టీఆర్‌ వైద్యసేవ నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్న ఆస్పత్రులన్నీ ఈ పథకానికీ సేవలందిస్తున్నాయి. ఎన్టీఆర్‌ వైద్య సేవ కార్డులు కలిగిన కుటుంబాలు జిల్లాలో 4.3 లక్షలు ఉండగా, ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో భాగంగా ఇప్పటివరకు తొలివిడతలో 2,44,192 కుటుంబాలను అర్హులుగా గుర్తించారు.

ఇదీ ఎంపిక ప్రక్రియ..

ఆయుష్మాన్‌ భారత్‌ పథకానికి బీపీఎల్‌ (దారిద్య్ర రేఖకు దిగువనున్న) కుటుంబానికిచెందిన వారంతా అర్హులే. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు అందించింది. వీరికి కార్డులను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే బీపీఎల్‌ పరిధిలో లేకపోయినా 70 ఏళ్లు దాటిన వారంతా ఈ పథకానికి అర్హులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అర్హుల జాబితా వచ్చిన తరువాత క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎం సర్వే చేస్తారు. యాప్‌లో వివరాలను పొందుపరుస్తారు. అనంతరం వారికి కార్డులు పంపిణీ చేస్తారు. ఆన్‌లైన్‌లో వివరాలను నమోదుచేయడం ద్వారా కార్డు డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. అర్హులైనప్పటికీ ఈ పథకానికి ఎంపిక కాకపోతే స్థానిక గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రతించాలి.

కార్డుల పంపిణీకి చర్యలు

- డాక్టర్‌ అప్పారావు, ఎన్టీఆర్‌ వైద్యసేవ జిల్లా కో-ఆర్డినేటర్‌

జిల్లాకు ఇప్పటివరకు వచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ పరిధిలోని అన్ని ఆస్పత్రుల్లో ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద వైద్యసేవలు అందిస్తారు. ఇబ్బందులుంటే స్థానిక ఆరోగ్య, సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకురావాలి. రాష్ట్రంలో ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకంలో భాగంగా రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యం పొందే వీలుంది.

Updated Date - Nov 21 , 2024 | 01:05 AM