భారీ వాహనాల ఇష్టారాజ్యం
ABN , Publish Date - Nov 15 , 2024 | 01:13 AM
నగరంలో భారీ వాహనాలు ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తున్నాయి.
నగరంలోని అంతర్గత రహదారుల్లో రాకపోకలకు వేళలు నిర్దేశించిన ప్రభుత్వం
రాత్రి 10 నుంచి ఉదయం 7 గంటల వరకూ మాత్రమే అనుమతి
ఒకవేళ ఆ సమయంలో లోడింగ్/అన్‌లోడింగ్ పూర్తికాకుంటే సమీపంలో నిలుపుకోవలసిందే...
ముందస్తు అనుమతి ఉంటేనే మధ్యాహ్నం 12-4 గంటల మధ్య ఓకె
కానీ, రోజంతా కొనసాగుతున్న రాకపోకలు
దాంతో నిత్యం ట్రాఫిక్ జామ్‌లు, తరచూ రోడ్డు ప్రమాదాలు
అయినా పట్టించుకోని ట్రాఫిక్ సిబ్బంది మామ్మూళ్లు అందుతుండడమే
కారణమని ఆరోపణలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో భారీ వాహనాలు ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తున్నాయి. జాతీయ రహదారిపై కాకుండా అంతర్గత రోడ్లపై రాకపోకలకు నిర్దేశిత సమయం ఉంటుంది. అయితే అదేమీ పట్టించుకోకుండా రద్దీ వేళల్లో కూడా భారీ వాహనాలు వచ్చి,వెళుతున్నాయి. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిసినా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది అధికారులు వాహనాల యజమానులు, వ్యాపారుల నుంచి మామూళ్లు తీసుకుంటుండడం వల్లే అలా వదిలేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రోడ్డు ప్రమాదాలను తగ్గించే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. అందులో భాగంగా రద్దీ ఎక్కువగా ఉండే వేళల్లో భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. భారీ వాహనాలు జాతీయ రహదారి పైనుంచి మాత్రం ఏ సమయంలోనైనా రాకపోకలు సాగించుకోవచ్చు. కానీ నగరంలోని అంతర్గత రహదారుల్లోకి ప్రవేశించాలంటే మాత్రం నిర్దేశిత సమయాన్ని కేటాయించింది. రాత్రి పది గంటల తర్వాత మరుసటిరోజు ఉదయం ఏడు గంటల వరకూ అంతర్గత రోడ్లపై వాహనాల రద్దీ, జన సంచారం పెద్దగా ఉండదు కాబట్టి ఆ సమయంలో మాత్రమే రవాణా వాహనాలు, ఇతర భారీ వాహనాల రాకపోకలకు అవకాశం కల్పించింది. మిగిలిన సమయాల్లో కంటెయినర్లు, సరకు రవాణా చేసే లారీలు, భవన నిర్మాణ సామగ్రి రవాణా వాహనాలు, ఆరు చక్రాలు అంతకంటే పెద్ద వాహనాలు ఏవైనా సరే నగర సరిహద్దులో నిలిపేయాల్సి ఉంటుంది. రాత్రి పది గంటల తర్వాత వాహనాలు అక్కడి నుంచి బయలుదేరి నగరంలోకి ప్రవేశించి గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంటుంది. సరకు అన్‌లోడింగ్ చేసిన తర్వాత ఉదయం ఏడుగంటల్లోగా నగరం నుంచి బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ అన్‌లోడింగ్ ఆలస్యమైతే అదే ప్రాంతంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేనిచోట పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే భారీ కంటెయినర్లు, సరకు రవాణా వాహనాలు రద్దీ వేళల్లో సైతం నగరంలోని అంతర్గత రహదారుల్లోకి వచ్చేస్తున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడడం, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడం జరుగుతుంది. మద్దిలపాలెంలోని పిఠాపురం కాలనీ నుంచి మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఇంటికి వెళ్లే రోడ్డులోకి భారీ కంటెయినర్లు యథేచ్ఛగా వచ్చి వెళుతుంటాయి. రోడ్డుపైనే వాహనాన్ని ఉంచి లోడింగ్, అన్‌లోడింగ్ చేస్తుండడంతో తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. అలాగే మద్దిలపాలెం జంక్షన్ వద్ద జాతీయ రహదారి పక్కనే సిమెంట్, ఐరన్‌లోడుతో వచ్చే భారీ వాహనాలు లోడింగ్, అన్‌లోడింగ్ చేస్తుంటాయి. జాతీయ రహదారిపై నిత్యం వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో ట్రాఫిక్ జామ్ అయిపోతోంది. సమీపంలోనే ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ ఉన్నప్పటికీ సిబ్బంది మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుంటారు. అదేవిధంగా గురుద్వారా జంక్షన్ నుంచి శాంతిపురం వెళ్లే రోడ్డులో ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలు ఉండడంతో కంటెయినర్లు ఏ సమయంలో పడితే ఆ సమయంలో వచ్చివెళుతుంటాయి. భవన నిర్మాణ సామగ్రి రవాణా చేసే వాహనాల యజమానులు, బిల్డర్లు, వ్యాపారులతో కొంతమంది ట్రాఫిక్ అధికారులకు సత్సంబంధాలు ఉన్నాయి. దాంతో వారి వాహనాలు నచ్చిన సమయంలో నగరంలోకి ప్రవేశించి సరకు అన్‌లోడింగ్ చేసి తిరిగి వెళుతుంటాయి. డాబాగార్డెన్స్, వన్‌టౌన్‌లోని వివిధ మార్కెట్ల పరిసరాల్లో కూడా నిత్యం ఇదే పరిస్థితి కనిపిస్తుంటుంది. ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకూ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులతో రోడ్లన్నీ రద్దీగా ఉంటాయి. ఆ సమయంలో జాతీయ రహదారిపై ఉన్న ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనాలు భారీగా బారులు తీరిపోయి ఉంటాయి. కొన్నిచోట్ల అయితే రెండు, మూడుసార్లు సిగ్నల్ పడిన తర్వాత గానీ జంక్షన్‌ను దాటే పరిస్థితి ఉండదు. అలాంటి సమయంలో కూడా నగరంలోని అంతర్గత రోడ్లలో భారీ వాహనాలు రాకపోకలు సాగుతుండడం అన్ని వర్గాలవారికి ఇబ్బందిగా ఉంటోంది. వీటన్నింటిపై ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ ఎందుచేతనో చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు.
నిషేధిత వేళల్లో ప్రవేశిస్తే చర్యలు
ప్రవీణ్‌కుమార్, ట్రాఫిక్ ఏడీసీపీ
నగరంలోకి నిషేధిత వేళల్లో భారీ వాహనాలు ప్రవేశించడం నేరం. అలా ఎక్కడైనా భారీ వాహనాలు ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నగరంలోకి రాత్రి పది నుంచి ఉదయం ఏడు గంటలు వరకు మాత్రమే భారీ వాహనాలను అనుమతిస్తున్నాం. తర్వాత భారీ వాహనాలు రాకుండా నూటికి నూరుశాతం అడ్డుకుంటున్నాం. ఒకటో అరా ఎక్కడైనా భారీ వాహనాలు వస్తే సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం.