జనవరి 4న హెలికాప్టర్ మ్యూజియం ప్రారంభం
ABN , Publish Date - Dec 03 , 2024 | 01:07 AM
నగరంలోని ఆర్‌కే బీచ్ రోడ్డులో వీఎంఆర్‌డీఏ సిద్ధం చేస్తున్న యుహెచ్-3హెచ్ హెలికాప్టర్ మ్యూజియాన్ని జనవరి 4వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులు మీదుగా ప్రారంభించనున్నట్టు తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధార్కర్ తెలిపారు.
అదేరోజు బీచ్‌లో నేవీ డే విన్యాసాలు
ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబునాయుడు హాజరు
విశాఖ విమానాశ్రయం పౌర సేవలకు సదా సిద్ధమే
తూర్పు నౌకాదళం చీఫ్ రాజేశ్ పెంధార్కర్
విశాఖపట్నం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని ఆర్‌కే బీచ్ రోడ్డులో వీఎంఆర్‌డీఏ సిద్ధం చేస్తున్న యుహెచ్-3హెచ్ హెలికాప్టర్ మ్యూజియాన్ని జనవరి 4వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులు మీదుగా ప్రారంభించనున్నట్టు తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధార్కర్ తెలిపారు. నేవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన ఇష్టాగోష్ఠిలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రతి ఏటా నేవీ దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్‌లో సాహస విన్యాసాలు (ఆపరేషన్ డెమో) ప్రదర్శించేవారమని, ఈసారి ఈ కార్యక్రమం పూరీలో ఏర్పాటుచేశామన్నారు. విశాఖ ప్రజలకు అసంతృప్తి లేకుండా జనవరి 4న ఆపరేషన్ డెమో నిర్వహిస్తామని చెప్పారు. దీనికి కూడా సీఎం చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా వస్తారన్నారు.
- విశాఖపట్నం విమానాశ్రయం పౌర సేవలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని, అందుకు అవసరమైన మౌలిక వసతులన్నీ ఉన్నాయన్నారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తరువాత కూడా ఈ విమానాశ్రయం ఉపయోగించుకుంటామంటే తమకు ఏమీ అభ్యంతరం లేదన్నారు.
- తీర ప్రాంతం (బీచ్)లో నిర్మించే అత్యంత ఎత్తైన భవనాలకు నేవీ నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్‌ఓసీ) అవసరమన్నారు. జిల్లా అధికారులతో కూడిన కమిటీలో నిబంధనల మేరకు అవసరమైన వాటికి ఎన్‌ఓసీలు ఇస్తామన్నారు. రక్షణపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
- విమాన వాహక నౌక (ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్) విక్రాంత్ విశాఖపట్నం కేంద్రంగానే పనిచేస్తుందని, అయితే అతి పెద్ద నౌక కావడంతో అది నేవల్ డాక్‌యార్డులోకి రాలేదని, దాని కోసం ప్రత్యేకంగా అవుటర్ హార్బర్‌లో జెట్టీ నిర్మాణం చేయాలని, దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయన్నారు.
- విజయనగరం సమీపానున్న బాడంగి ఎయిర్‌స్ర్టిప్‌లో ప్రస్తుతం నేవీ కార్యక్రమాలు ఏమీ నిర్వహించడం లేదని స్పష్టంచేశారు.
- విశాఖపట్నం పరిసరాల్లో మొక్కల పెంపకానికి సంబంధించి 1.4 కోట్ల విత్తన బంతులు ఏడాది కాలంలో వెదజల్లామని చెప్పారు.