కొండకు ఎసరు
ABN , Publish Date - Mar 05 , 2024 | 01:36 AM
ఆనందపురం మండలంలో వైసీపీ నేతల అండదండలతో కొందరు కొండను ఆక్రమించేస్తున్నారు.
జగనన్న కాలనీకి ఇచ్చింది 4 ఎకరాలు..
ఆక్రమించుకున్నది 10 ఎకరాలు!
ఆనందపురం మండలంలో భూ కబ్జా
వైసీపీ నేతల నేతృత్వంలోనే కార్యక్రమం
చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆనందపురం మండలంలో వైసీపీ నేతల అండదండలతో కొందరు కొండను ఆక్రమించేస్తున్నారు. వందల కొద్దీ లారీల మట్టిని తవ్వి అమ్ముకోవడమే కాకుండా సుమారు రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు. ఇదంతా జగనన్న కాలనీ పేరుతో చేయడం గమనార్హం.
జగనన్న కాలనీ కోసం ఆనందపురం మండలం తర్లువాడ పంచాయతీ పరిధిలోని నగరంపాలెం గ్రామంలో 22 మంది రైతుల నుంచి మూడేళ్ల క్రితం నాలుగు ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. అది ప్రభుత్వ భూమే. ఆక్రమించుకుని ఉండడంతో వారికి ఒక్కొక్కరికి ఐదు సెంట్లు చొప్పున భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. సేకరించిన భూమిలో 177 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఈ 22 మందికి ఐదు సెంట్ల భూమి ఇచ్చారు. అయితే తమకు భూమి ఇవ్వలేదని మరికొందరు తెరపైకి వచ్చారు. వారిని ఎంపీపీ రెవెన్యూ అధికారుల వద్దకు తీసుకువెళ్లి, పరిహారం అందలేదని చెప్పారు. పరిశీలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వారితో పాటు పాత 22 మంది కలిసి తర్లువాడ పంచాయతీ నగరపాలెం సర్వే నంబరు 162లో కొండను తవ్వడం ప్రారంభించారు. జాతీయ రహదారికి కూత వేటు దూరంలో ఉన్న ఈ కొండ వద్ద ఎకరా రూ.5 కోట్లు విలువ ఉంది. సుమారు పది ఎకరాల వరకూ చదును చేసేశారు. ఎవరికి నచ్చినంత వారు ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటివరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రైతుల నుంచి సేకరించిన భూమి నాలుగు ఎకరాలు అయితే వారు పది ఎకరాలు ఆక్రమించడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇదంతా వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరగడంతో అధికారులు నోరు మెదపలేకపోతున్నారు. ఈ విషయమై స్థానిక వీఆర్‌ఓను వివరణ కోరగా, ఫిర్యాదు అందిన వెంటనే వెళ్లి పనులు ఆపించానని చెప్పారు. గత తహసీల్దార్‌కు, ప్రస్తుత తహసీల్దార్‌కు ఇవన్నీ తెలుసునని గ్రామస్థులు చెబుతున్నారు.