అప్‌గ్రేడేషన్‌పై ఆశలు
ABN , Publish Date - Nov 22 , 2024 | 01:09 AM
నగరంలోని ప్రాంతీయ కంటి ఆస్పత్రిని రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆప్తమాలజీ (ఆర్‌ఐవో)గా అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదనలు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి.
ప్రాంతీయ కంటి ఆస్పత్రిని రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆప్తమాలజీ (ఆర్‌ఐవో)గా మార్చేందుకు ఏడేళ్ల కిందట ప్రతిపాదనలు
ముందుకుతీసుకువెళ్లిన నాటి తెలుగుదేశం ప్రభుత్వం
ఆ తరువాత ప్రభుత్వం మారడంతో ఫలించని యత్నాలు
ప్రస్తుతం కూటమి అధికారంలోకి రావడంతో కదలిక
అప్‌గ్రేడ్ చేస్తే అందుబాటులోకి అధునాతన విభాగాలు, పరికరాలు
రోగులకు మరిన్ని సేవలందించేందుకు వీలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి):
నగరంలోని ప్రాంతీయ కంటి ఆస్పత్రిని రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆప్తమాలజీ (ఆర్‌ఐవో)గా అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదనలు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. ఏడేళ్ల కిందట అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ నరసింహారావు ఈ ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేసేందుకు యత్నించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం సహకరించింది. కానీ ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రతిపాదనలు మూలకు చేరాయి. అప్‌గ్రేడేషన్ అయితే ఖరీదైన, క్లిష్టతరమైన శస్త్రచికిత్సలు చేసే అవకాశం లభిస్తుంది. అధునాతన వైద్య పరికరాలు, విభాగాలు అందుబాటులోకి వస్తాయి.
దేశంలోని అనేక రాష్ట్రాల్లో కంటి ఆస్పత్రులు ఆర్‌ఐవోగా అప్‌గ్రేడ్ అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోని సరోజనీదేవి కంటి ఆస్పత్రిని కేంద్ర ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. రాష్ట్ర విభజన తరువాత విశాఖ ప్రాంతీయ కంటి ఆస్పత్రికి ఆ హోదా కోసం అధికారులకు ప్రతిపాదించారు. నాటి టీడీపీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్లింది. ప్రజా ప్రతినిధులు తమ వంతు కృషిచేయడంతో గుర్తింపు లభిస్తుందని భావించారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం, అప్పటి ఉన్నతాధికారి రిటైర్ కావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. కొంతమంది అధికారులు యత్నించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్యరూపం దాల్చలేదు.
అప్‌గ్రేడ్ చేస్తే...
అనేక రాష్ట్రాల్లోని కంటి ఆస్పత్రులను కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఐవోగా అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇందుకోసం విశాఖ ప్రాంతీయ కంటి ఆస్పత్రితోపాటు కర్నూలులోని కంటి ఆస్పత్రి పోటీపడ్డాయి. ఇక్కడి ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు అప్పట్లో వేగంగా స్పందించడంతో ప్రక్రియ ముందుకుసాగింది. అప్‌గ్రేడ్ జరిగితే రెటీనా, కార్నియా, గ్లకోమా, స్క్వింట్ అండ్ ఆక్లోప్లాస్టియా (కంటి ప్లాస్టిక్ సర్జరీ) వంటి విభాగాలను ఏర్పాటుచేస్తారు. నిపుణులు, అధునాతత లేబొరేటరీ, అనస్థీషియా విభాగం, స్టాఫ్ నర్సులు, థియేటర్ అసిస్టెంట్లు, పారా మెడికల్ సిబ్బందిని కేటాయిస్తారు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్‌నెస్ (ఎన్‌పీసీబీ) రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ నిధులు ఇస్తుంది. ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న పడకల సంఖ్య మూడు నుంచి నాలుగు రెట్లు పెరుగుతుంది. దీనివల్ల ఎక్కువమంది రోగులకు వైద్య సేవలందించేందుకు, శస్త్రచికిత్సలు చేసేందుకు వీలుంటుంది.
ముందుకు కదిలేనా..?
రాష్ట్రంలో ఎన్ని కంటి ఆస్పత్రులున్నప్పటికీ ఒక్క ఆస్పత్రినే కేంద్రం ఆర్‌ఐవోగా అప్‌గ్రేడ్ చేస్తుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రతిపాదనకు మోక్షం లభిస్తుందని భావిస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళితే ప్రయోజనం లభిస్తుందంటున్నారు. కర్నూలు ఆస్పత్రి అధికారుల్లోనూ ఇదే ఆలోచన ఉన్న నేపథ్యంలో ఇక్కడి ఎంపీలు, ఎమ్మెల్యేలు వేగంగా స్పందించాల్సి ఉంది. దీని గురించి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి.మీనాక్షి వద్ద ప్రస్తావించగా ఇటీవల ఉన్నతాధికారులకు విషయం గుర్తుచేశామన్నారు. రాష్ట్రంలోని ఏ ఆస్పత్రికి ఆర్‌ఐవో అప్‌గ్రేడేషన్ దక్కలేదని, విశాఖకు లభించేలా తమవంతు కృషి చేస్తామన్నారు.