Share News

గుర్రాలే రవాణా సాధనాలు

ABN , Publish Date - Nov 18 , 2024 | 11:44 PM

జీకేవీధి మండలం గాలికొండ పంచాయతీ పాత్రుగుంట గ్రామానికి రహదారి సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరకులు తెచ్చుకోవాలన్నా, పండిన పంటలను సప్పర్ల సంతకు తీసుకువెళ్లి విక్రయించాలన్నా గుర్రాలపైనే తరలించాల్సిన పరిస్థితి ఉంది.

గుర్రాలే రవాణా సాధనాలు
పాత్రుగుంట గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో గుర్రాలపై నిత్యావసర సరకులు తరలిస్తున్న గిరిజనులు

పాత్రుగుంట గ్రామానికి రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు

సంతకు పంటలను తరలించాలంటే కష్టాలు

గిరిజనులకు తప్పని అవస్థలు

సీలేరు, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం గాలికొండ పంచాయతీ పాత్రుగుంట గ్రామానికి రహదారి సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరకులు తెచ్చుకోవాలన్నా, పండిన పంటలను సప్పర్ల సంతకు తీసుకువెళ్లి విక్రయించాలన్నా గుర్రాలపైనే తరలించాల్సిన పరిస్థితి ఉంది.

పాత్రునిగుంట గ్రామంలో 21 పీవీటీజీ కుటుంబాలు ఉండగా, ఇందులో 18 మందికి పీఎం జన్‌మన్‌ పథకం కింద ఇళ్లు మంజూరయ్యాయి. అయితే గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో భవన నిర్మాణ సామగ్రి తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉంది. సిమెంట్‌, ఇసుక, ఇటుకలు సుమారు మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న గాలికొంత బత్తునూరు నుంచి గుర్రాలపై తెచ్చుకోవలసి వస్తోంది. దీని వల్ల ప్రభుత్వం మంజూరు చేసే నిధులు సగం వరకు వీటి రవాణాకే సరిపోతుందని గిరిజనులు వాపోతున్నారు. కాగా అత్యవసర సమయాల్లో గర్భిణులు, రోగులను ఆస్పత్రికి తరలించడానికి కనీసం ఫీడర్‌ అంబులెన్స్‌ కూడా తమ గ్రామానికి వచ్చే పరిస్థితి లేదని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌, ఐటీడీఏ పీవో స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Nov 18 , 2024 | 11:44 PM