Share News

జగనన్న కాలనీల్లో భారీ కుంభకోణం

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:05 AM

రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో భారీ దోపిడీ జరిగిందని, దీనిపై సీబీసీఐడీతో విచారణ చేయించాలని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అసెంబ్లీలో డిమాండ్‌ చేశారు.

జగనన్న కాలనీల్లో భారీ కుంభకోణం

సీబీసీఐడీతో విచారణ చేయించాలి

అసెంబ్లీలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి

విశాఖపట్నం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో భారీ దోపిడీ జరిగిందని, దీనిపై సీబీసీఐడీతో విచారణ చేయించాలని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అసెంబ్లీలో డిమాండ్‌ చేశారు. జగనన్న కాలనీలపై తాను అడిగిన ప్రశ్నకు మంత్రి ఇచ్చిన సమాధానం సరిగ్గా లేదని, అధికారులు తప్పుడు వివరాలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. విశాఖ జిల్లాలో నగరానికి 50 కి.మీ. దూరంలో పద్మనాభం, ఆనందపురం మండలాల్లో కొండవాలు ప్రాంతాల్లో ఈ కాలనీలు ఏర్పాటుచేశారని, వర్షం పడితే అవన్నీ నీట మునిగిపోతున్నాయన్నారు. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.35 వేలు రుణం ఇప్పించామని చెప్పారని, అంతా అవాస్తవమని, విశాఖలో లబ్ధిదారులే ఆ సొమ్ము కట్టారన్నారు. విశాఖ జిల్లాలో 1.14 లక్షల ఇళ్లకు కేవలం అతి తక్కువ సంఖ్యలో పునాదులు వేశారని, కానీ లెక్కలు మాత్రం భారీగా చూపిస్తున్నారని విమర్శించారు. లేఅవుట్ల అభివృద్ధికి వీఎంఆర్‌డీఏకు రూ.150 కోట్లు ఇచ్చారని, కానీ అక్కడ రహదారులు, కాలువలు, విద్యుద్దీపాలు ఏమీ లేవన్నారు. ఒక్కో ఇల్లు 340 చ.అ. విస్తీర్ణం అని చెప్పారని, కానీ విశాఖలో 229 చ.అ. మాత్రమే ఉందని, ఇది రుషికొండ ప్యాలెస్‌ జగన్‌ బాత్‌రూమ్‌ కంటే చిన్నదని ఆరోపించారు. ఆ ఇళ్లను కూడా ఎంతో కొంత చేతిలో పెట్టి స్థానిక వైసీపీ నాయకులు తీసుకుంటున్నారని, వీటిపై రాష్ట్రవ్యాప్తంగా విచారణ జరగాలని, అధికారులు ఇచ్చే కాకిలెక్కలపై ఆధార పడవద్దని మంత్రిని కోరారు.

Updated Date - Nov 19 , 2024 | 01:05 AM