లైక్స్ లేవాయె, కామెంట్స్ రావాయె..
ABN , Publish Date - Dec 15 , 2024 | 01:30 AM
ఒకప్పుడు కుటుంబం, బంధువులు, స్నేహితుల గురించి గొప్పగా చెప్పుకునేవాళ్లు. కాలం మారింది.
సోషల్ మీడియా వినియోగిస్తున్న నేటి తరానికి ఇప్పుడు ఇదే పెద్ద సమస్య!
సహచరుల ఖాతాలతో పోల్చి చూసుకుంటూ ఆందోళన
గంటలు తరబడి సామాజిక మాధ్యమాల్లోనే గడుపుతున్న వైనం
పరిధి దాటితే ప్రమాదమంటున్న వైద్యులు
అసభ్యకర మెసేజ్‌లతో యూట్యూబర్స్, రీల్స్ చేసే వారిలో ఒత్తిడి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఒకప్పుడు కుటుంబం, బంధువులు, స్నేహితుల గురించి గొప్పగా చెప్పుకునేవాళ్లు. కాలం మారింది. నేటి తరం కుటుంబం, బంధువుల కంటే సామాజిక మాధ్యమాల్లో వచ్చే లైకులు, కామెంట్లు చూసి గొప్పగా ఫీల్ అవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో తాము పెట్టే పోస్టుకు లైక్స్, కామెంట్స్ ఎన్ని ఎక్కువ వస్తే...తాము అంత గొప్ప అన్న భావనలో ఉంటున్నారు. పొరపాటున పోస్టులకు ఆశించిన స్థాయిలో రీచ్ రాకపోతే ఒత్తిడికి గురవుతున్నారు. ఇటువంటి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రానురాను పెరుగుతోందని మానసిక వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా 25 ఏళ్లలోపు యువతలో ఈ సమస్య అధికంగా ఉంటోందంటున్నారు. ఈ మధ్య ఆదాయం కోసం యూట్యూబ్ చానెల్స్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలు స్టార్ట్ చేసిన వారు కూడా వయసుతో సంబంధం లేకుండా ఇటువంటి సమస్యతో బాధపడుతున్నారంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్రెండ్స్ అవుతున్న ముక్కూ, మొహం తెలియనివారు పెట్టే కామెంట్ల కోసం అర్రులు చాస్తూ ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు.
పదే పదే చూడడమే పని..
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ‘ఎక్స్’ (ట్విట్టర్) వంటి సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కనీసం పదేళ్లు వచ్చే వరకూ కూడా ఆగడం లేదు. వీటిలో ఏదో ఒక ఖాతాను ఓపెన్ చేసి తమకు నచ్చిన ఫొటోలు, విషయాలను పోస్టు చేస్తున్నారు. అయితే, వీటిని వినియోగిస్తున్న ఎక్కువ మందిలో ఒక రకమైన ఉత్సుకత కనిపిస్తోందని చెబుతున్నారు. తాము పోస్ట్ పెట్టిన తరువాత ఎంతమంది దానికి రియాక్ట్ అయ్యారన్న విషయాన్ని తెలుసుకునేందుకు పదేపదే చెక్ చేసుకుంటున్నారు. లైక్‌లు, కామెంట్లు ఎన్ని వచ్చాయన్నది చూసుకుంటున్నారు. ఆశించిన స్థాయిలో స్పందన లభిస్తే ప్రశాంతంగా ఉంటున్నారు. లేనిపక్షంలో మాత్రం తీవ్రమైన టెన్షన్‌కు గురవుతున్నట్టు చెబుతున్నారు. ఇందులో అధికంగా ఇరవై ఏళ్లలోపువారు ఉంటున్నారు. గంటల తరబడి సోషల్ మీడియా ఖాతాలను వినియోగించే వారిలో ఈ సమస్య అధికంగా ఉంటున్నట్టు చెబుతున్నారు. ఇటువంటివారు పదే పదే ఫోన్ చూసుకుంటూ తీవ్రమైన టెన్షన్, ఒత్తిడికి గురవుతుంటారని, కొందరిలో ఆందోళన, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయని చెబుతున్నారు. ఫ్రెండ్స్‌గా ఉన్నవారు స్పందించకపోతే వారితో బయట మాట్లాడడం కూడా మానేస్తుంటారని, తన పోస్టుకు స్పందించని వాళ్లతో తానెందుకు మాట్లాడాలన్న భావనలో చాలామంది ఉంటున్నారని చెబుతున్నారు.
పోలికతో సమస్య...
ఇటువంటి సమస్య ఎక్కువగా ఎదుటి వారితో పోల్చుకోవడం వల్ల వస్తుంది. తమ సర్కిల్‌లో ఉన్న ఒక వ్యక్తికి ఎక్కువ మంది ఫాలోవర్స్, ఫ్రెండ్స్ ఉన్నా, వారికి ఎక్కువ కామెంట్లు వస్తున్నా చూసి చాలామంది తట్టుకోలేకపోతుంటారని చెబుతున్నారు. వారి స్థాయిలో తనకు రావడం లేదన్న బాధతో తెగ మథనపడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. తినేందుకు ఇష్టపడరని, నిద్ర కూడా సరిగా పోరని పేర్కొంటున్నారు. ఇది విద్యార్థుల్లో అధికంగా కనిపిస్తోందని, వయసుతో సంబంధం లేకుండా మహిళల్లోనూ ఇటువంటి సమస్య ఉన్నట్టు చెబుతున్నారు.
వేధింపులు
ఇక భిన్నమైన అంశాలపై వీడియోలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే వారికి రకరకాల కామెంట్లు వస్తుంటాయి. కొన్ని అసభ్యకరంగా కూడా ఉంటాయి. ఇటువంటి కామెంట్లతో ఇబ్బంది పడుతున్నవాళ్లు ఉన్నారు. కొందరు వేధింపులకు గురిచేస్తుండడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై నిపుణులను సంప్రతిస్తున్న వారి సంఖ్య పెరిగింది. వీరిలో ఎక్కువగా మహిళలు ఉంటున్నారు. యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చేసే వారికి ఈ సమస్య ఉత్పన్నమవుతోంది.
పోల్చి చూసుకోవడం వల్లే ఇబ్బందులు
- డాక్టర్ ఎన్‌ఎన్ నిహాల్, మానసిక వైద్య నిపుణులు
సామాజిక మాధ్యమాల్లో చేసే పోస్టులకు వచ్చే రియాక్షన్స్ చూసుకుంటూ చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. ఇది చాలా చిన్న విషయం అని గుర్తించడం లేదు. ఇదంతా ఇతరులతో పోల్చుకోవడం వల్ల వస్తున్న ఇబ్బంది. ఒకసారి పోస్టు పెట్టిన తరువాత గంటల తరబడి వాటికి వచ్చిన రియాక్షన్స్ లెక్కించుకుంటూ కూర్చుంటున్నారు. గంటల తరబడి సామాజిక మాధ్యమాలకు సమయాన్ని వెచ్చించడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్న మవుతాయి. దీనిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. కొన్నిసార్లు స్నేహితుల మధ్య గొడవకు కూడా ఇది కారణం అవుతోంది. పిల్లాడు దిగులుగా ఉంటున్నాడని, ఎవరితో మాట్లాడడం లేదని కొందరు తల్లిదండ్రులు చెబుతున్నారు. విషయం ఏమిటని ఆరా తీస్తే ఈ విషయాలను చెబుతున్నారు.