Share News

ఇటొస్తే నరకమే..

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:26 PM

మండల కేంద్రం నుంచి ముంచంగిపుట్టు వైపు సంపంగిపుట్టు వరకు, అలాగే పాడేరు వైపు బంగారుమెట్ట వరకు రోడ్డు అధ్వానంగా ఉండడంతో రాకపోకలకు వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇటొస్తే నరకమే..
పన్నెడా- బంగారుమెట్ట ప్రధాన రహదారిపై ఏర్పడిన గోతులు

గోతులమయంగా సంపంగిపుట్టు - బంగారుమెట్ట మెయిన్‌రోడ్డు

వాహనచోదకులకు నిత్యం ఇబ్బందులు

పెదబయలు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం నుంచి ముంచంగిపుట్టు వైపు సంపంగిపుట్టు వరకు, అలాగే పాడేరు వైపు బంగారుమెట్ట వరకు రోడ్డు అధ్వానంగా ఉండడంతో రాకపోకలకు వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. దీని వల్ల వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పన్నెడా వద్ద భారీ గోతులు ఏర్పడడంతో గత ఎన్నికల సమయంలో వైసీపీ పాలకులు హడావిడిగా క్రషర్‌ బుగ్గి, మెటల్‌ చిప్స్‌ వేసి తాత్కాలికంగా పూడ్చారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు అవి కొట్టుకుపోయాయి. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. వానొస్తే ఆ గోతులు నీరు చేరి వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనికి తోడు రోడ్డు అంచులు కొట్టుకుపోవడంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు రాకపోకలు సాగించడం కష్టంగా ఉంది. రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, సంపంగిపుట్టు - బంగారుమెట్ట రోడ్డు పరిస్థితిని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వాహనచోదకులు కోరుతున్నారు.

Updated Date - Nov 20 , 2024 | 11:26 PM