Share News

మూడు తరాలుగా రాజకీయాల్లో...

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:44 AM

నర్సీపట్నం మండలంలోని వేములపూడికి చెందిన బోళెం గోపాత్రుడు కుటుంబంలో మొదటి తరం నుంచి మూడో తరం వరకూ ఏదో ఒక పదవి చేపట్టి ప్రజా ప్రతినిధులుగా రాణించారు.

మూడు తరాలుగా రాజకీయాల్లో...

సర్పంచ్‌ నుంచి ఎమ్మెల్యే వరకూ పలు పదవులు చేపట్టిన బోళెం గోపాత్రుడు కుటుంబం

1978 సంవత్సరంలో నర్సీపట్నం ఎమ్మెల్యేగా గోపాత్రుడు

2009లో శాసనసభ సభ్యురాలిగా ఆయన కోడలు ముత్యాలపాప

ఎంపీపీలుగా గోపాత్రుడు, వెంకటరమణ, అరుణశ్రీ

వేములపూడి సర్పంచులుగా బోళెం సన్యాసిపాత్రుడు, చెల్లయ్యమ్మ

నర్సీపట్నం, ఏప్రిల్‌ 26:

నర్సీపట్నం మండలంలోని వేములపూడికి చెందిన బోళెం గోపాత్రుడు కుటుంబంలో మొదటి తరం నుంచి మూడో తరం వరకూ ఏదో ఒక పదవి చేపట్టి ప్రజా ప్రతినిధులుగా రాణించారు. గ్రామ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యే పదవులతో నేటికీ రాజకీయాలలో ఉనికిని చాటుకుంటున్నారు.

బోళెం గోపాత్రుడు ఎమ్మెల్యేగా, ఎంపీపీగా పనిచేశారు. ఆయన కుమారుడు సన్యాసిపాత్రుడు, కోడలు చెల్లయ్యమ్మ వేములపూడి సర్పంచులుగా చేశారు. వీరి పెద్ద కుమారుడు వెంకటరమణ, చిన్న కుమారుడు రామ్‌ప్రసాద్‌, ఇద్దరు ఆడ పిల్లలు. పెద్దకుమారుడు వెంకటరమణ రెండు పర్యాయాలు ఎంపీపీగా, ఒకసారి వైస్‌ ఎంపీపీగా చేశారు. పెద్దకోడలు బోళెం ముత్యాలపాప ఎంపీపీ, ఎమ్మెల్యే పదవులు చేపట్టారు. చిన్న కుమారుడు రామ్‌ప్రసాద్‌ వేములపూడి ఉప సర్పంచ్‌గా, ఆయన భార్య అరుణశ్రీ నర్సీపట్నం ఎంపీపీగా చేశారు. రామ్‌ప్రసాద్‌ ప్రస్తుతం వేములపూడి-1 సెగ్మెంట్‌ నుంచి ఎంపీటీసీ సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బోళెం గోపాత్రుడు రెండుసార్లు (1972, 1978) నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసి ఒక పర్యాయం విజయం సాధించారు. 1978లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గోపాత్రుడు...జనతా పార్టీ అభ్యర్థి రాజాసాగి సూర్యనారాయణరాజు పై విజయం సాధించారు. ఆ తరువాత మండల వ్యవస్థలో ప్రత్యక్ష పద్ధతిలో మొట్టమొదటిసారిగా జరిగిన ఎన్నికలలో బోళెం గోపాత్రుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కాళ్ళ నూకరాజుపై విజయం సాధించారు. ఆయన 1987 నుంచి 88 వరకు నర్సీపట్నం మండల అధ్యక్షుడుగా పదవిలో ఉన్నారు. ఆయన కాలం చేయడంతో ఎంపీపీ పదవికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికలలో ఆయన మనవడు బోళెం వెంకటరమణ ఎంపీపీగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 1995 నుంచి 2000 వరకు ఎంపీపీగా, 2001 నుంచి 2006 వరకూ మండల ఉపాధ్యక్షుడుగా పదవులు చేపట్టారు. ఆ తర్వాత బోళెం వెంకటరమణ భార్య ముత్యాలపాప 2009 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడుపై విజయం సాధించారు. అలాగే 2009 నుంచి 2011 వరకు బోళెం వెంకటరమణ సోదరుడు రాంప్రసాద్‌ భార్య అరుణశ్రీ ఎంపీపీగా ఉన్నారు. 2009 నుంచి 2011 మధ్య కాలంలో బోళెం చెల్లయ్యమ్మ వేములపూడి సర్పంచ్‌గా, ఆమె పెద్ద కోడలు ముత్యాలపాప నర్సీపట్నం ఎమ్మెల్యేగా, చిన్న కోడలు అరుణశ్రీ నర్సీపట్నం ఎంపీపీ పదవిలో ఉండడం విశేషం.

Updated Date - Apr 27 , 2024 | 01:44 AM