Share News

మద్యం కంపెనీల్లో తనిఖీలు

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:21 AM

జిల్లాలోని కశింకోట మండలం సుందరయ్యపేటలో వున్న విశాఖ డిస్టిలరీ (మద్యం తయారీ) కంపెనీలో సీఐడీ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఉదయం 9.30 గంటలకు మద్యం తయారీ కంపెనీలోకి ప్రవేశించిన అధికారులు.. అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. పలు రకాల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కీలక రికార్డులు, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

మద్యం కంపెనీల్లో తనిఖీలు
సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించిన కశింకోట మండలం సుందరయ్యపేటలోని విశాఖ డిస్టిలరీ

కశింకోట మండలం సుందరయ్యపేటలోని విశాఖ డిస్టిలరీలో సీఐడీ దాడులు

ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగిన సోదాలు

పలు రికార్డులు క్షుణ్ణంగా పరిశీలన

కీలక రికార్డులు, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం

(అనకాపల్లి/కశింకోట-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని కశింకోట మండలం సుందరయ్యపేటలో వున్న విశాఖ డిస్టిలరీ (మద్యం తయారీ) కంపెనీలో సీఐడీ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఉదయం 9.30 గంటలకు మద్యం తయారీ కంపెనీలోకి ప్రవేశించిన అధికారులు.. అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. పలు రకాల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కీలక రికార్డులు, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

వైసీపీ పాలనలో జరిగిన మద్యం అమ్మకాల అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు సీఐడీ దూకుడు పెంచింది. గత ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు నాసిరకం మద్యం అమ్మకాల ద్వారా పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని మద్యం తయారీ డిస్టిలరీలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు డిస్టరీల్లో సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని కశింకోట మండలం సుందరయ్యపేటలో వున్న విశాఖ డిస్టిలరీకి సీఐడీ అధికారుల బృందం ఉదయం 9.30 గంటలకు చేరుకుంది. సీఐడీ విశాఖ అదనపు ఎస్పీ ప్రేమ్‌కాజల్‌ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు చలపతిరావు, రమణమూర్తితోపాటు మరో 12 మంది అధికారులు తనిఖీలు చేపట్టారు. రాత్రి 11 గంటల సమయానికి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన మద్యం తయారీ అనుమతులు, ఇతరత్రా లావాదేవీల రికార్డులను సీఐడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలిసింది. మద్యం తయారీ, సరఫరా, గోదాములో మద్యం నిల్వలకు సంబంధించి వివరాలను సేకరించినట్టు సమాచారం. రికార్డులను నిశితంగా పరిశీలించి కొన్నింటిని సీఐడీ అధికారులు తమ వెంట తీసుకెళ్లేందుకు ప్యాకింగ్‌ చేయించినట్టు చెబుతున్నారు. ఇంకా కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లు, నగదు లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో సీఐడీ అధికారులు డిస్టిలరీ ప్రధాన గేటును మూయించి, లోపలికి ఎవరినీ రానివ్వలేదు. తనిఖీల ఫొటోలు తీసేందుకు మీడియాకు కూడా అనుమతివ్వలేదు.

Updated Date - Oct 23 , 2024 | 12:21 AM