Share News

ఉపాధి పనుల్లో అక్రమాలు

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:29 PM

సీసీ రోడ్లు నిర్మించకుండా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, గ్రావెల్‌ రహదారుల నిర్మాణానికి అడ్వాన్సుల పేరిట నిధులను ఉపాధి ఉద్యోగులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై దోచుకున్నారని సామాజిక తనిఖీల్లో బయటపడింది.

ఉపాధి పనుల్లో అక్రమాలు
ప్రజావేదికలో పనుల వివరాలను వెల్లడిస్తున్న సామాజిక తనిఖీ బృందం

సీసీ రోడ్లు నిర్మించకుండా బిల్లుల చెల్లింపు

గ్రావెల్‌ రోడ్ల నిర్మాణానికి అడ్వాన్సుల పేరిట దోపిడీ

సామాజిక తనిఖీలో బట్టబయలు

గూడెంకొత్తవీధి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): సీసీ రోడ్లు నిర్మించకుండా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, గ్రావెల్‌ రహదారుల నిర్మాణానికి అడ్వాన్సుల పేరిట నిధులను ఉపాధి ఉద్యోగులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై దోచుకున్నారని సామాజిక తనిఖీల్లో బయటపడింది. దీంతో పూర్వ, ప్రస్తుత ఏపీవోలకు జీతాలు నిలుపుదల చేయడంతో పాటు రికవరీ చేయాలని ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పీడీ శివయ్య ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం పనులపై ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పీడీ అధ్యక్షతన ప్రజావేదిక నిర్వహించారు. 2023 ఏప్రిల్‌ నుంచి 2024 మార్చి వరకు ఈజీఎస్‌, పీఆర్‌, ఐటీడీఏ, ఎస్‌ఎస్‌ఏ, ఇరిగేషన్‌శాఖల పరిధిలో 2,688 పనులకు కూలి రూపంలో రూ.21,13,50,156, మెటీరియల్‌ రూపంలో రూ.16,63,80,306 నగదు చెల్లింపులు జరిగాయి. ఈ పనులపై ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సామాజిక తనిఖీ బృందం గ్రామాల్లో పర్యటించిన పనుల నిర్వహణ, కూలీ చెల్లింపులపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో పలు అక్రమాలు బయటపడ్డాయి. ప్రధానంగా కూలీలు ఎన్నిరోజులు పనిచేశారు?, ఎంత కూలీ తీసుకున్నారనే వివరాలు ఏ పంచాయతీ పరిధిలోనూ ఉపాధి ఉద్యోగులు నమోదు చేయలేదని సామాజిక తనిఖీ బృందం గుర్తించింది. ఈ కారణంగా తనిఖీలకు తీవ్ర అంతరాయం కలిగిందన్నారు. ఉపాధి పనుల నిర్వహణకు ఎక్కడా గ్రామ సభలు ఏర్పాటు చేయడంలేదని, దీంతో ఉపాధి పనుల సమాచారం ప్రజలకు, ప్రజాప్రతినిధులకు తెలియడంలేదని స్పష్టం చేశారు. దేవరాపల్లి పంచాయతీ పరిధిలో చనిపోయిన ఐదుగురికి కూలీ చెల్లింపులు జరిగాయని సామాజిక తనిఖీ బృందం సభ్యులు సభలో ప్రస్తావించారు. దీంతో సంబంధిత వీఆర్‌పీల నుంచి నగదు వసూలు చేయాలని పీడీ ఆదేశించారు. అలాగే దేవరాపల్లి పంచాయతీ పరిధిలో సీసీ రోడ్డు నిర్మించకుండా రూ.6 లక్షలు కాంట్రాక్టర్‌కి చెల్లింపులు జరిగాయని తనిఖీ బృందం చెప్పింది. దీంతో ఆ నగదును సంబంధిత కాంట్రాక్టర్‌ నుంచి రికవరీ చేయాలని, నగదు వసూలు చేసే వరకు ఏపీవోలు రాంప్రసాద్‌, అప్పలరాజుకు జీతాలు నిలిపివేయాలని పీడీ ఆదేశించారు. గాలికొండ పంచాయతీ యర్రగెడ్డ లో గిరిజన సంక్షేమశాఖ పరిధిలో మంజూరైన ఉపాధి హామీ పథకం గ్రావెల్‌ రోడ్డు నిర్మాణానికి అడ్వాన్సు రూపంలో రూ.15 లక్షలు కాంట్రాక్టర్‌కి చెల్లించినా పనులు ఇప్పటికీ ప్రారంభించలేదని తనిఖీ బృందం వెల్లడించింది. వెంటనే గ్రావెల్‌ రోడ్లు పూర్తిచేయాలని పీడీ ఆదేశించారు. మండలంలో సీసీ రోడ్లు, గ్రావెల్‌ రోడ్లు నిర్మించకుండా రూ.లక్షల్లో నిధులు దోచుకున్నట్టు ప్రజావేదికలో రుజువైంది. దీనిపై సంబంధితశాఖ అధికారులు, ఉద్యోగులపై రికవరీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోయిన కుమారి, ఏవో ఇమ్మానుయేలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ డీవీవో నిర్మలాదేవి, ఏపీడీ లోకేశ్‌, ఏవీవో వెంకటేశ్వర్లు, ఏపీవోలు రాంప్రసాద్‌, అప్పలరాజు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 11:29 PM