ఆయుష్‌కు ఊపిరిలూదేనా?
ABN , Publish Date - Dec 30 , 2024 | 01:13 AM
ప్రజలకు ప్రాచీన, సంప్రదాయ వైద్యాన్ని అందించేందుకు నెలకొల్పిన ఆయుష్ డిస్పెన్సరీలను సిబ్బంది కొరత వేధిస్తోంది. ఖాళీల భర్తీకి పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రోగులకు సక్రమంగా సేవలందని పరిస్థితి నెలకొంది. ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి వైద్య పద్ధతులను కలిపి ఆయుష్‌గా పేర్కొంటారు. ఉమ్మడి జిల్లాలో 38 ఆయుష్ డిస్పెన్సరీలు ఉన్నాయి. వీటిలో అనేకచోట్ల రోగులను పరీక్షించి, సమస్యను గుర్తించేందుకు వైద్యులు లేరు. కొన్నిచోట్ల అటెండర్లు లేకపోవడంతో మందులు అందించడం నుంచి అన్ని పనులూ వైద్యులే చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
- వైద్యులు, సిబ్బంది కొరతతో సేవలపై ప్రభావం
- ఉమ్మడి జిల్లాలో 38 ఆయుష్ డిస్పెన్సరీలు
- సగానికిపైగా కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఖాళీ
- అధ్వాన స్థితిలో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం
- కుర్చీలు కూడా లేని దుస్థితి
(విశాఖపట్నం- ఆంధ్రజ్యోతి)
ప్రజలకు ప్రాచీన, సంప్రదాయ వైద్యాన్ని అందించేందుకు నెలకొల్పిన ఆయుష్ డిస్పెన్సరీలను సిబ్బంది కొరత వేధిస్తోంది. ఖాళీల భర్తీకి పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రోగులకు సక్రమంగా సేవలందని పరిస్థితి నెలకొంది. ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి వైద్య పద్ధతులను కలిపి ఆయుష్‌గా పేర్కొంటారు. ఉమ్మడి జిల్లాలో 38 ఆయుష్ డిస్పెన్సరీలు ఉన్నాయి. వీటిలో అనేకచోట్ల రోగులను పరీక్షించి, సమస్యను గుర్తించేందుకు వైద్యులు లేరు. కొన్నిచోట్ల అటెండర్లు లేకపోవడంతో మందులు అందించడం నుంచి అన్ని పనులూ వైద్యులే చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
అల్లూరి జిల్లాలో...
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆయుర్వేద విభాగానికి సంబంధించి నాలుగు డిస్పెన్సరీలు ఉన్నాయి. వాటిలో మొత్తం 12 పోస్టులు ఉండగా 10 ఖాళీగా ఉన్నాయి. అడ్డాకుల డిస్పెన్సరీలో మాత్రమే మెడికల్ ఆఫీసర్, కాంపౌడర్ ఉన్నారు. అక్కడ స్వీపర్ కమ్ స్కావెంజర్ పోస్టు ఖాళీగానే ఉంది. మిగిలిన మూడు (అరకు, డుంబ్రిగుడ, గంపరాయి) డిస్పెన్సరీల్లో మెడికల్ ఆఫీసర్, కాంపౌండర్, స్వీపర్ కమ్ స్కావెంజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని వల్ల మూడు డిస్పెన్సరీల పరిధిలో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే జిల్లాలో మూడు హోమియో డిస్పెన్సరీలు ఉండగా, పాడేరులో మాత్రమే మెడికల్ ఆఫీసర్ ఉన్నారు. అక్కడ కూడా కాంపౌండర్, స్వీపర్ కమ్ స్కావెంజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీలేరు, తాజంగిలో మెడికల్ ఆఫీసర్, కాంపౌండర్, స్వీపర్ కమ్ స్కావెంజర్ పోస్టులు ఖాళీ. ఈ రెండు డిస్పెన్సరీల బాధ్యతలను పాడేరు మెడికల్ ఆఫీసరే చూస్తుంటారు.
అనకాపల్లి జిల్లాలోనూ అంతే...
అనకాపల్లి జిల్లాలో 11 ఆయుర్వేద డిస్పెన్సరీలు ఉండగా, 34 పోస్టులకుగాను 22 ఖాళీగా ఉన్నాయి. వేంపాడులో మెడికల్ ఆఫీసర్, కాంపౌండర్, హరిపాలెంలో కాంపౌండర్, ఏఎన్‌ఎం, అటెండర్, గవరపాలెం, లింగరాజుపాలెం, కొత్తకోట, దేవరాపల్లిల్లో మెడికల్ ఆఫీసర్, కాంపౌండర్, స్వీపర్ కమ్ స్కావెంజర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కన్నూరుపాలెంలో మెడికల్ ఆఫీసర్, కాంపౌండర్, ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీగా ఉండగా, ఎంఎన్‌వో మాత్రమే పనిచేస్తున్నారు. హోమియో డిస్పెన్సరీల విషయానికి వస్తే..ఎలమంచిలిలో మెడికల్ ఆఫీసర్ పోస్టు, స్వీపర్ కమ్ స్కావెంజర్ పోస్టు, పాయకరావుపేటలో కాంపౌండర్, ఎ.కొండూరులో కాంపౌండర్, స్వీపర్ కమ్ స్కావెంజర్, ఏఎల్ పురంలో మెడికల్ ఆఫీసర్, కాంపౌండర్, స్వీపర్ కమ్ స్కావెంజర్, ఎం.కోడూరులో మెడికల్ ఆఫీసర్, కాంపౌండర్ పోస్టులు, అచ్యుతాపురం డిస్పెన్సరీలో కాంపౌండర్, స్వీపర్ కమ్ స్కావెంజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
విశాఖలో కాస్త మెరుగు
విశాఖ జిల్లాల్లో ఐదు ఆయుర్వేద డిస్పెన్సరీలు ఉండగా ఉక్కు నగరంలో మెడికల్ ఆఫీసర్ పోస్టు, కేజీహెచ్‌లోని డిస్పెన్సరీల్లో స్వీపర్ కమ్ స్కావెంజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన నాలుగుచోట్ల మెడికల్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. హోమియోకు సంబంధించి ఐదు డిస్పెన్సరీలు ఉండగా, 15 పోస్టులకు గాను ఆరు ఖాళీలు ఉన్నాయి. ప్రసాద్ గార్డెన్స్‌లోని డిస్పెన్సరీలో మెడికల్ ఆఫీసర్ పోస్టు, వేపగుంటలో కాంపౌండర్ పోస్టు, మిందిలో కాంపౌండర్, స్వీపర్ కమ్ స్కావెంజర్, అగనంపూడిలో కాంపౌండర్, స్వీపర్ కమ్ స్కావెంజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో రెండు యునాని డిస్పెన్సరీలు ఉండగా, రెల్లివీధిలో కాంపౌండర్ పోస్టు, భీమునిపట్నంలో కాంపౌండర్, ఏఎన్‌ఎం, ఎఫ్‌ఎన్‌వో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఆధ్వానంగా ఆర్‌డీడీ కార్యాలయం
మధురవాడలో 1987లో ఆయుష్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం ఏర్పాటుచేశారు. ఆరు జిల్లాలను పర్యవేక్షించే కార్యాలయం ఒక చిన్న గదిలో నడుస్తోంది. అక్కడ కూర్చునేందుకు సరైన కుర్చీలు, ఫైళ్లు భద్రం చేసేందుకు బీరువాలు, కంప్యూటర్లు లేవు. దీనిపై ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం కనిపించలేదని చెబుతున్నారు.