ఆ పనులు ఆగింది అందుకేనా?
ABN , Publish Date - Nov 19 , 2024 | 01:03 AM
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను రూ.456 కోట్లతో అభివృద్ధి చేయాలని రెండేళ్ల క్రితం నిర్ణయించారు.
విశాఖపట్నం రైల్వే స్టేషన్ అభివృద్ధికి రెండేళ్ల క్రితం గ్రీన్‌సిగ్నల్
రూ.456 కోట్లు మంజూరు
ఇప్పటికి ఇద్దరు కాంట్రాక్టర్లు మార్పు
రకరకాల కారణాలు ప్రచారం
ప్రస్తుతం టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకురాని వైనం
డీఆర్‌ఎం లంచం తీసుకుంటూ పట్టుబడిన నేపథ్యంలో కమీషన్లు ఇచ్చుకోలేకే కాంట్రాక్టర్లు ముందుకువచ్చి ఉండరనే ఊహాగానాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను రూ.456 కోట్లతో అభివృద్ధి చేయాలని రెండేళ్ల క్రితం నిర్ణయించారు. కేంద్రం అమృత్ భారత్ పథకం కింద నిధులు మంజూరుచేసింది. టెండర్లు పిలిచి కాంట్రాక్టు అప్పగించారు. ఆరు నెలలకే పనులు సరిగ్గా చేయడం లేదని ఆ కాంట్రాక్టర్‌ను తొలగించారు. ఆ తరువాత మరో కాంట్రాక్టర్ వచ్చారు. ఆ సంస్థ కూడా ఆరు నెలలు తిరగకుండానే వెళ్లిపోయింది. ఇప్పుడు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకురావడం లేదు. వాల్తేరు డివిజన్ అధికారులు కమీషన్ల కోసం వేధించడం, బిల్లులు మంజూరు చేయడానికి భారీగా లంచాలు కోరడం వల్లే కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.3.17 కోట్ల విలువైన బిల్లులు మంజూరుచేయడానికి, పనుల్లో ఆలస్యం జరిగినందుకు విధించిన జరిమానా తగ్గించడానికి లంచం డిమాండ్ చేసి, ఆ మొత్తంలో రూ.25 లక్షలు తీసుకుంటూ తాజాగా డీఆర్‌ఎం సౌరభ్ ప్రసాద్ ముంబైలో సీబీఐకి దొరికిపోయారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లను కూడా ఇలాగే లంచాల కోసం వేధించి ఉంటారని, అందుకే ఎవరూ ముందుకురావడం లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది.
20 నెలల క్రితమే పనుల ప్రారంభం
విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను 20 నెలల క్రితం ప్రారంభించారు. స్టేషన్‌లో ఎనిమిది ప్లాట్‌ఫారాలు ఉండగా, జ్ఞానాపురం వైపు 9, 10 ప్లాట్‌ఫారాలు కొత్తగా నిర్మించాలని ప్రతిపాదించారు. అలాగే స్టేషన్‌లో కొత్తగా 20 లిఫ్ట్‌లు, 20 ఎస్కలేటర్లు పెడతామని ప్రకటించారు. ఇటు వైపు, అటు వైపు రెండు మల్టీ లెవెల్ కారు పార్కింగ్ సేషన్లు ఏర్పాటుచేస్తామన్నారు. రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చేసి, ప్రయాణికులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. దీనికి సంబంధించి టెండర్ పిలిచి కాంట్రాక్టర్‌ను ఎంపిక చేశారు. అందుకు వీలుగా జ్ఞానాపురం వైపు చెట్లను తొలగించారు. స్టేషన్ లోపలకు రాకపోకలు సాగించే నాలుగో నంబరు గేటును మూసేశారు. అయితే కాంట్రాక్టర్‌తో ఏ తగాదా వచ్చిందో తెలియదు గానీ ఆరు నెలలకే పనులు ఆగిపోయాయి. ఆ సంస్థ వెళ్లిపోయింది. అక్కడ మట్టి లూజుగా ఉందని, నిర్మాణాలు చేపట్టడం కష్టమని వాదన తెరపైకి తెచ్చారు. ఇది జరిగిన తరువాత మరో కాంట్రాక్టర్‌ను తీసుకువచ్చారు. వారు కూడా ఆరు నెలల్లోనే వెళ్లిపోయారు. వారు ఇటువైపు పనులు ప్రారంభించగా, కింద మొత్తం రాయి తగిలిందని, మిషన్లతో కట్ చేసుకుంటూ వెళ్లాలని, అందుకని ఆ పని చేయలేమని వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. ఆ తరువాత ఇంకే కాంట్రాక్టర్ ముందుకు రాలేదు.
భారీ జరిమానాలతో బెదిరింపులు
రైల్వేలో అన్ని స్థాయిల్లో జరిమానాల పేరుతో బెదిరించి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు టిక్కెట్ లేకపోతే అంతకు మించిన మొత్తం టీటీఈలు వసూలు చేయడం అందరికీ అనుభవమే. అభివృద్ధి పనులు, మరమ్మతులు చేపట్టే కాంట్రాక్టు సంస్థలను కూడా ఇలాగే బెదిరించి పబ్బం గడుపుకుంటున్నారు. సివిల్ పనుల్లో జాప్యం సహజం. అయితే వాటిని రికార్డులో నమోదుచేసి, నిబంధనల ప్రకారం చేయలేదని ఆరోపిస్తూ జరిమానా వేయడం, దానిని తగ్గించడానికి లంచాలు కోరడం రైల్వేలో చాలా సాధారణ విషయం అయిపోయిందని పులువురు ఆరోపిస్తున్నారు. ముంబై కాంట్రాక్టర్ కేసులో జరిమానా తగ్గింపునకు డబ్బులు డిమాండ్ చేసి, అది తగ్గించకుండానే బిల్లులో కోత వేసి మిగిలిన మొత్తం ఇవ్వడం వల్లనే కాంట్రాక్టర్ సీబీఐని ఆశ్రయించారని చెబుతున్నారు.
ఏది అమ్మినా కమీషన్ ఇవ్వాల్సిందే
రైల్వేస్టేషన్‌లో రకరకాలు ఆహార పదార్థాలు, వస్తువులు విక్రయిస్తుంటారు. వారికి లైసెన్స్‌లు ఇస్తారు. ఫీజులు కట్టించుకుంటారు. అయినా సరే అధికారులకు కొంత కమీషన్ ఇవ్వాలని, లేదంటే ఆహారం కల్తీ జరిగిందని కేసులు పెడతారని, కొందరైతే ఆ వస్తువులే అమ్మకుండా చేస్తారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. నగరంలో రొట్టెలు, కేకులు, పఫ్‌లు తయారుచేసే ఓ సంస్థ కమీషన్ ఇవ్వలేదని వారి ఫుడ్ అమ్మకుండా అధికారులు నిషేధం విధించిన విషయాన్ని ఓ వ్యాపారి ఈ సందర్భంగా గుర్తుచేయడం గమనార్హం. ఈ లంచాల వ్యవహారంపై సీబీఐ సమగ్ర దర్యాప్తు చేయాలని విశాఖ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.