భూముల విలువ సవరణ!
ABN , Publish Date - Dec 25 , 2024 | 12:20 AM
జిల్లాలో భూముల విలువను ప్రభుత్వం స్వల్పంగా పెంచున్నది. జాతీయ రహదారికి సమీపంలో పొలాలు, స్థలాల విలువను బాగానే సవరించారు. ప్రాంతాన్నిబట్టి ప్రస్తుతం ఉన్న భూమి విలువ 10 శాతం నుంచి 50 శాతం వరకు పెరగనున్నది. దీంతో ఆస్తుల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. ఇప్పటికే అభ్యంతరాలను స్వీకరించిన రిజిస్ర్టేషన్ శాఖ... జనవరి ఒకటో తేదీ నుంచి పెంచిన విలువలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నది.
ప్రాంతాన్నిబట్టి 10 శాతం నుంచి 50 శాతం వరకు పెంపు
కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు జనవరి ఒకటి నుంచి అమలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో భూముల విలువను ప్రభుత్వం స్వల్పంగా పెంచున్నది. జాతీయ రహదారికి సమీపంలో పొలాలు, స్థలాల విలువను బాగానే సవరించారు. ప్రాంతాన్నిబట్టి ప్రస్తుతం ఉన్న భూమి విలువ 10 శాతం నుంచి 50 శాతం వరకు పెరగనున్నది. దీంతో ఆస్తుల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. ఇప్పటికే అభ్యంతరాలను స్వీకరించిన రిజిస్ర్టేషన్ శాఖ... జనవరి ఒకటో తేదీ నుంచి పెంచిన విలువలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నది.
గత వైసీపీ ప్రభుత్వం 2023లో జాతీయ రహదారికి ఆనుకొని వున్న అనకాపల్లి, సబ్బవరం, కశింకోట, ఎలమంచిలి, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో భూముల విలువను భారీగా పెంచేసిన సంగతి తెలిసిందే. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు గణనీయంగా లాభపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భూముల మార్కెట్ విలువను ప్రాంతాల వారీగా సవరణ చేస్తూ, అవసరం మేరకు భూముల విలువ పెంచడం ద్వారా స్వల్పంగా రిజిసే్ట్రషన్‌ల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిఽధిలోని ప్రపోజల్స్ కమిటీలతో చర్చలు పూర్తి చేశారు. సూచనలు, అభ్యంతరాలను స్వీకరించి సమగ్ర నివేదికను కలెక్టర్, జేసీలకు అందజేశారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి పెంచిన భూముల విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు అమలులోకి రానున్నాయని జిల్లా రిజిస్ట్రార్ మన్మథరావు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిఽధికి తెలిపారు.
ఏ ప్రాంతంలో.. ఎంత పెరగనున్నది...
అనకాపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో నివాసిత భూమి విలువ ప్రస్తుతం చదరపు గజం ధర రూ.18 వేలు, వాణిజ్య సముదాయాల భూమి రూ.40 వేలు ఉండగా వీటిల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. వ్యసాయ భూమి ఎకరా రూ.1.1 కోట్ల నుంచి రూ.1.2 కోట్లకు పెంచనున్నారు.
చోడవరం కార్యాలయం పరిఽధిలో నివాస స్థలం గజం రూ.2 వేలు ఉండగా రూ.2,500కు, వాణిజ్య సముదాయాల భూమి గజం రూ.5 వేల నుంచి రూ.7 వేలుకు, వ్యవసాయ భూమి ఎకరా రూ.35 లక్షల నుంచి రూ.37 లక్షలకు పెంచనున్నారు.
కె.కోటపాడు పరిధిలో నివాస భూమి గజం రూ.2,500 నుంచి రూ.3 వేలకు, వాణిజ్య అవసరాల భూమి గజం రూ.3,500 నుంచి రూ.4 వేలకు, వ్యసాయ భూమి ఎకరా రూ.1.7 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచనున్నారు.
కోటవురట్ల పరిఽధిలో నివాస భూమి గజం రూ.650 నుంచి రూ.1,000, వాణిజ్య భూమి గజం రూ.3,500 నుంచి రూ.4 వేలకు పెరగనుంది.
లంకెలపాలెం పరిఽధిలో నివాస భూమి గజం రూ.10 వేల నుంచి రూ.12 వేలు, వాణిజ్య భూమి గజం రూ.12 వేల నుంచి రూ.15 వేలకు, వ్యవసాయ భూమి ఎకరా రూ.1.23 కోట్లు నుంచి రూ.1.35 కోట్లకు పెరగనుంది.
మాడుగుల పరిఽధిలో నివాస భూమి గజం రూ.2 వేల నుంచి రూ.3 వేలకు, వాణిజ్య భూమి గజం రూ.3 వేల నుంచి రూ.4 వేలకు, వ్యవసాయ భూమి ఎకరా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెరగనుంది.
నక్కపల్లి పరిఽధిలో నివాస భూమి గజం రూ.3 వేల నుంచి రూ.5 వేలు, వాణిజ్య భూమి గజం రూ.7 వేల నుంచి రూ.9 వేలకు, వ్యవసాయ భూమి ఎకరా రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షలు ఉండగా దీనిని రూ.24 లక్షల నుంచి రూ.26 లక్షలకు పెంచనున్నారు.
సబ్బవరం పరిఽధిలో నివాస భూమి గజం రూ.5,500 నుంచి రూ.7 వేలు, వాణిజ్య భూమి రూ.6 వేల నుంచి రూ.8 వేలకు, వ్యవసాయ భూమి ఎకరా రూ.63 లక్షల నుంచి రూ.83 లక్షలకు పెరగనున్నది.
నర్సీపట్నం పరిఽధిలో నివాస భూమి గజం రూ.5 వేల నుంచి రూ.6 వేలు, వాణిజ్య భూమి రూ.8 వేల నుంచి రూ.9 వేలకు, వ్యవసాయ భూమి ఎకరా రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షలకు పెరగనున్నది.
ఎలమంచిలి పరిఽధిలో నివాస భూమి గజం రూ.7 వేల నుంచి రూ.7,500, వాణిజ్య భూమి రూ.9 వేల నుంచి రూ.10 వేలకు, వ్యవసాయ భూమి ఎకరా రూ.32 లక్షల నుంచి రూ.35 లక్షలకు పెరగనున్నది.