Share News

ఆర్‌ఈసీఎస్‌పై నేతల కన్ను

ABN , Publish Date - Dec 03 , 2024 | 01:10 AM

అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సరఫరా సహకార సంస్థ (ఆర్‌ఈసీఎస్‌)ను మళ్లీ వెనక్కి తీసుకోవాలని కొందరు ప్రజా ప్రతినిధులు యత్నిస్తున్నారు.

ఆర్‌ఈసీఎస్‌పై నేతల కన్ను

  • ఈపీడీసీఎల్‌ నుంచి వెనక్కి తీసుకునేందుకు వ్యూహం

  • వాస్తవాలు దాస్తున్న నాయకులు

  • గతంలో నెలకు రూ.2 కోట్లలోపు లాభం చూపిన అధికారులు, నాయకులు

  • మిగిలింది దుర్వినియోగం చేశారనే ఆరోపణలు

  • తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలోకి వచ్చిన తరువాత రూ.127.68 కోట్లు మిగులు

  • ఖర్చులు పోను రూ.85.68 కోట్ల లాభం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సరఫరా సహకార సంస్థ (ఆర్‌ఈసీఎస్‌)ను మళ్లీ వెనక్కి తీసుకోవాలని కొందరు ప్రజా ప్రతినిధులు యత్నిస్తున్నారు. లాభాలు వస్తున్న సంస్థను లాగేసుకున్నారని తప్పుడు లెక్కలు చెబుతున్నారు. నష్టాల విషయాన్ని, నిధుల దుర్వినియోగాన్ని దాచి పెడుతున్నారు.

ఆర్‌ఈసీఎస్‌ సహకార సంస్థలో ఉన్నప్పుడు భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఏటా ఆర్‌ఈసీఎస్‌లు ప్రభుత్వ సిఫారసుతో లైసెన్స్‌ రెన్యువల్‌ చేసుకోవాలి. కానీ అనకాపల్లి ఆర్‌ఈసీఎస్‌ ఆ నిబంధన ఉల్లంఘించింది. సిఫారసు లేకుండానే రెన్యువల్‌కు దరఖాస్తు చేసింది. ఈ విషయాన్ని ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీఎస్‌) గుర్తించి అభ్యంతరం వ్యక్తంచేసింది. యూనిట్‌ విద్యుత్‌ రూ.1.40కు తీసుకొని, సగటున రూ.5కి విక్రయిస్తున్నారని, ఆ రాయితీ (మిగులు) మొత్తం ఏమి చేస్తున్నారని నిలదీసింది. సమాధానం చెప్పలేక అప్పటి ఆర్‌ఈసీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చేతులెత్తేశారు. దాంతో ఆర్‌ఈసీఎస్‌ను ఏపీ తూర్పు విద్యుత్‌ ప్రాంత పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) నిర్వహించాలని, ఆ తరువాత విలీనం చేసుకోవాలని ఆదేశించింది. దీంతో ఆర్‌ఈసీఎస్‌ 2021 సెప్టెంబరులో ఈపీడీసీఎల్‌ స్వాధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఎటువంటి సమస్యలు లేకుండా నడుస్తోంది.

ప్రజా ప్రతినిధులు ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాల ప్రకారం అనకాపల్లి ఆర్‌ఈసీఎస్‌కు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1.83 కోట్లు, 2020-21లో రూ.1.91 కోట్ల లాభం వచ్చింది. అయితే 2018-19లో రూ.1.74 కోట్ల నష్టం వచ్చింది. ఈ విషయాన్ని మాత్రం సదరు నేతలు అసెంబ్లీలో వెల్లడించలేదు. ఈపీడీసీఎల్‌ స్వాధీనం చేసుకున్న తరువాత 2023వ సంవత్సరంలో విద్యుత్‌ సరఫరా, బిల్లుల వసూళ్లు, ఖర్చులు, లాభం చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. అవే వనరులు, అదే ఉద్యోగులతో ఈపీడీసీఎల్‌ ఆర్‌ఈసీఎస్‌ను నడుపుతోంది. 2023 జనవరి నుంచి డిసెంబరు నెలాఖరు వరకు రూ.161.52 కోట్లు బిల్లుల రూపంలో వసూలైంది. అంటే నెలకు రూ.12 కోట్లపైనే వచ్చింది. ఆ ఏడాది వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు రూ.4.46 కోట్లు చెల్లించింది. ఉద్యోగులకు జీతాలు, చిల్లర ఖర్చులకు రూ.29.37 కోట్లు అయ్యాయి. దీంతో రూ.127.68 కోట్లు మిగిలింది. గతంలో ఆర్‌ఈసీఎస్‌కు ఈపీడీసీఎల్‌ సరఫరా చేసిన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.1.40 మాత్రమే వసూలు చేసేది. 2023లో ఆర్‌ఈసీఎస్‌కు సుమారు 30 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. దానికి ఆ రేటు ప్రకారం చూసుకుంటే రూ.42 కోట్ల వరకు బిల్లింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ మొత్తం కూడా మినహాయిస్తే నికరంగా 2023లో రూ.85.68 కోట్లు మిగిలినట్టు. అవే ఏర్పాట్లు, అదే సిబ్బంది, అదే బిల్లింగ్‌...లెక్కలు మాత్రం వేరు. నాడు రెస్కో చూపించిన ఖర్చులు వేరు. ఇప్పుడు అయిన ఖర్చులు వేరు. అదే తేడా. అనకాపల్లి నేతలు అసెంబ్లీలో రెండేళ్ల లాభం లెక్కలు చూపించారు. ఒక్క ఏడాది కూడా రూ.2 కోట్లు లేదు. కానీ ఈపీడీసీఎల్‌ నుంచి సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాల ప్రకారం ఒక్క 2023లోనే రూ.85.68 కోట్లు మిగిలాయి.

రాయితీ మొత్తం

ఈపీడీసీఎల్‌ నుంచి యూనిట్‌ రూ.1.40 చొప్పున తీసుకుని సగటున రూ.5 చొప్పున అమ్ముకుంటున్నారు. అంటే యూనిట్‌కు రూ.3.60 మిగులుతోంది. సొసైటీ కాబట్టి దీనిని సభ్యులకు డివిడెండ్‌ రూపంలో పంచాలి. కానీ రూ.2 కోట్ల కంటే తక్కువ లాభం చూపించి, మిగిలిన మొత్తం అంతా రకరకాల ఖర్చుల పేర్లతో సొసైటీ అధికారులు, ఆ ప్రాంత నాయకులు స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్‌ఈసీఎస్‌ చేజారిపోకుండా గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు చేయని ప్రయత్నం లేదు. ప్రభుత్వం నుంచి సిఫారసు లేఖ ఇప్పించారు. కొంతమంది వద్ద రూ.లక్షలు తీసుకుని ఉద్యోగులుగా నియమించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అధికారంలో ఎవరు ఉన్నా ఆర్‌ఈసీఎస్‌ నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఈపీడీసీఎల్‌ నుంచి వెనక్కి తీసుకుని లైసెన్స్‌ ఇప్పించాలని కొందరు కూటమి నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి ఉత్తరాంధ్రకు చెందిన ఒక కీలక నేత సహకారం అందిస్తున్నట్టు చెబుతున్నారు.

Updated Date - Dec 03 , 2024 | 01:10 AM