Share News

పోస్టింగుల కోసం పైరవీలు

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:29 AM

కావలసిన స్థానాల కోసం పైరవీలు జోరందుకున్నాయి.

పోస్టింగుల కోసం పైరవీలు

బదిలీలకు ఉద్యోగుల యత్నాలు

సిఫారసు లేఖలతో అధికారులపై ఒత్తిళ్లు

కోరుకున్న చోటను దక్కించుకునేందుకు పావులు

మైదాన ప్రాంతాల్లో కొనసాగేందుకు

ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు

నేడు బదిలీ దరఖాస్తులకు చివరి రోజు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

ఉద్యోగుల బదిలీలకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో కావలసిన స్థానాల కోసం పైరవీలు జోరందుకున్నాయి. విద్య, వైద్య, వ్యవసాయ అనుబంధ శాఖల్లో మినహా మిగిలిన 15 ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాతిపదికన జరుగుతున్న బదిలీల కోసం ఆయా శాఖల హెచ్‌ఓడీలకు ఉద్యోగులు దరఖాస్తులు చేస్తున్నారు. ఇప్పటికే అందిన దరఖాస్తులను హెచ్‌ఓడీలు పరిశీలిస్తున్నారు. వాస్తవానికి ఈనెల 15వ తేదీతోనే ఆన్‌లైన్‌ దరఖాస్తులకు గడువు ముగిసినా విజయవాడ వరదల కారణంగా ఈనెల 21వ తేదీ వరకు అవకాశం కల్పించారు.

సుదీర్ఘ కాలం తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు అనుమతించింది. రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, జిల్లాపరిషత్‌, డీఆర్‌డీఏ, డ్వామా, ఇంజినీరింగ్‌, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బదిలీలు జరగనున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో వివిధ శాఖల్లో బదిలీల కోసం 7 వేల మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. వీరిలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు వెయ్యి మందిలోపే ఉంటారని చెబుతున్నారు. మిగిలిన వారంతా రిక్వస్ట్‌ ట్రాన్స్‌ఫర్స్‌, స్పౌస్‌ కోటా కింద బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు సుమారు మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. కొందరు బదిలీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని మాన్యువల్‌గా స్థానిక ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను హెచ్‌ఓడీలకు అందజేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో నేతలతో అంటకాగిన పలువురు మండల స్థాయి ఉద్యోగులు కూటమి ప్రభుత్వంలోనూ కావలసిన చోట పోస్టింగ్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ల్యాండ్‌ అండ్‌ సర్వే విభాగాల్లో ఉద్యోగులు ప్రస్తుత ప్రజాప్రతినిధుల లేఖలతో అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం. కొందరు ఉద్యోగులు బదిలీల్లో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేసినట్టు తెలిసింది. రెవెన్యూ శాఖలో భూపరిపాలన విభాగానికి చెందిన ల్యాండ్స్‌, సర్వే శాఖలో గ్రామ సర్వేయర్లు, మండల సర్వేయర్లు, డిప్యూటీ మండల సర్వేయర్లు 480 మంది వరకు ఉన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భూ రికార్డుల విషయంలో వీరి పాత్ర ఎంతో కీలకం కావడంతో కూటమి ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉండే మండల సర్వేయర్లకు బదిలీల కోసం సిఫారసు లేఖలు ఇచ్చినట్టు సమాచారం. వాస్తవానికి జీవో ప్రకారం ఐదేళ్లు సర్వేసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు మాత్రమే బదిలీలు తప్పనిసరి చేశారు. ఏఎస్‌ఆర్‌ జిల్లాల్లో వీరు గతంలో పనిచేయకపోతే ఏజెన్సీకి బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ అనకాపల్లి జిల్లాలో సర్వే, ల్యాండ్స్‌ విభాగంలో పలువురు ఐదేళ్లు పూర్తి చేసుకున్న సర్వేయర్లు ఏజెన్సీకి వెళ్లకుండా మళ్లీ మైదాన ప్రాంతంలోనే పోస్టింగ్‌ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మండల సర్వేయర్లు కూడా రెండేళ్లు సర్వీసు పూర్తయితే రిక్వెస్టు ట్రాన్స్‌ఫర్‌కు అవకాశం ఉండడంతో బదిలీల కోసం దరఖాస్తులు చేసుకొని కావలసిన చోటు కోసం ఎమ్మెల్యేల లేఖలతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువ మంది ఉద్యోగులు ఏజెన్సీలో పోస్టింగులు పడకుండా మైదాన ప్రాంత మండలాల్లో పోస్టింగుల కోసం ఆప్షన్లు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. చాలామంది ఉద్యోగులు జిల్లాల పునర్విభజన తరువాత అనకాపల్లి, ఏఎస్‌ఆర్‌ జిల్లాల్లో పనిచేస్తున్నా, ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రం నుంచే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది తిరిగి విశాఖ జిల్లాలో మండలాలకు బదిలీపై వెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితి ప్రధానంగా రెవెన్యూ, పంచాయతీరాజ్‌, డ్వామా, డీఆర్‌డీఏ, సచివాలయాలు, ల్యాండ్స్‌, సర్వే శాఖల్లోనే ఎక్కువగా ఉంది. రెవెన్యూ శాఖలో కొందరు ఉద్యోగులైతే ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేల చుట్టూ పోస్టింగుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసి వచ్చిన తమకు మళ్లీ ఏజెన్సీ ప్రాంతాలకు పంపేందుకు కుట్ర జరుగుతోందని పలువురు సర్వేయర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. బదిలీలను పారదర్శకంగా చేసి న్యాయం చేయాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:29 AM