మద్యం దుకాణాలు బంద్
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:34 AM
ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బంది మంగళవారం సమ్మెకు దిగారు. దుకాణాలను తెరవకుండా ఆందోళన చేశారు. దీంతో ప్రభుత్వ దుకాణాల్లో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. .
సిబ్బంది ఆకస్మిక సమ్మె
ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
5వ తేదీన చర్చలకు ఆహ్వానించిన ఎక్సైజ్ కమిషనర్
సాయంత్రం తరువాత సమ్మె విరమణ
తెరుచుకున్న మద్యం దుకాణాలు
అనకాపల్లి/ నర్సీపట్నం అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బంది మంగళవారం సమ్మెకు దిగారు. దుకాణాలను తెరవకుండా ఆందోళన చేశారు. దీంతో ప్రభుత్వ దుకాణాల్లో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. .
గత వైసీపీ ప్రభుత్వం సొంతంగానే మద్యం వ్యాపారం చేపట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో ఒక్కో మద్యం దుకాణంలో ఒక సూపర్‌వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్, ఒక వాచ్‌మన్ కలిపి నలుగురిని తాత్కాలిక భృతిపై నియమించింది. వీరి కాంట్రాక్టు గడువు సెప్టెంబరుతో ముగిసింది. మరోవైపు కూటమి ప్రభుత్వం మద్యం అమ్మకాలను గతంలో మాదిరిగా ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించి కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని 151 ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సుమారు 750 మంది సిబ్బంది మద్యం దుకాణాలను తెరవలేదు. ఆయా దుకాణాల ఎదుట ఆందోళన చేశారు. దీంతో జిల్లా అంతటా (రెస్టారెండ్ అండ్ బార్లు మినహా) మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ మద్యం దుకాణాల ఉద్యోగుల సంఘం జిల్లా ప్రతినిధి అరవింద్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీ కారణంగా తాము జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన జీవో ప్రకారం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందిని పది రోజులపాటు కొనసాగించి తరువాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారని అన్నారు. కరోనా సమయంలో కూడా మద్యం దుకాణాల్లో పనిచేశామని, తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.
5వ తేదీన చర్యలకు ఆహ్వానం.. సమ్మె విరమణ
ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బంది సమ్మెకు దిగిన విషయం తెలుసుకున్న ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు, మద్యం దుకాణాల ఉద్యోగుల సంఘ ప్రతినిఽధులతో మాట్లాడారు. ఈ నెల ఐదో తేదీన అమరావతిలో చర్చలు జరపడానికి రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ అంగీకరించారు. దీంతో మద్యం దుకాణాల సిబ్బంది సాయంత్రం సమ్మె విరమించి ఐదు గంటల తరువాత దుకాణాలను తెరిచి మద్యం అమ్మకాలు సాగించారు