Share News

మన్యం అందాలకు ఫిదా

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:31 PM

మన్యంలోని సందర్శనీయ ప్రాంతాలు ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడాయి. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో రద్దీగా మారాయి. మన్యంలో ఏ ప్రాంతంలో చూసినా సందర్శకులే కనిపించారు.

మన్యం అందాలకు ఫిదా
కొత్తపల్లి జలపాతంలో ఆదివారం పర్యాటకుల సందడి

సందర్శనీయ ప్రాంతాలు కిటకిట

ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చిన పర్యాటకులు

సహజ సిద్ధ ప్రకృతి అందాలను తిలకించి పరవశం

బొర్రా గుహలు మొదలుకుని లంబసింగి వరకు సందడి

పాడేరు, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రాంతాలు ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడాయి. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో రద్దీగా మారాయి. మన్యంలో ఏ ప్రాంతంలో చూసినా సందర్శకులే కనిపించారు.

అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పర్యాటకుల సందడి నెలకొంది. ఏజెన్సీలో మంచు కురుస్తుండడంతో ప్రకృతి అందాలు మరింత సుందరంగా దర్శనమిస్తున్నాయి. ఆదివారం అనంతగిరి మండలం బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌, రణజిల్లెడ జలపాతం, కొత్తవలస వ్యవసాయ క్షేత్రం, పెదలబుడు గిరిజన గ్రామదర్శిని, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయిగెడ్డ, పెదబయలు మండలంలో తారాబు జలపాతం, పాడేరు మండలంలో మినుములూరు, మోదాపల్లి కాఫీ తోటలు, అమ్మవారి పాదాలు, పాడేరు మోదకొండమ్మ ఆలయం, వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువులవేనం, లంబసింగి, యర్రవరం జలపాతం ప్రాంతాలను పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శించారు. కాగా 2024 సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆదివారం ఏజెన్సీకి వచ్చిన పర్యాటకుల్లో చాలా మంది జనవరి ఒకటో తేదీ వరకు ఇక్కడే ఉండి నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

వంజంగి మేఘాల కొండపై..

పాడేరురూరల్‌: మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం వంజంగి మేఘాల కొండకు పర్యాటకులు పోటెత్తారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి పర్యాటకులు శనివారం సాయంత్రమే పాడేరుకు చేరుకున్నారు. పాడేరులో రాత్రి బస చేసి ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో మేఘాల కొండకు చేరుకుని ప్రకృతి అందాలను ఆస్వాదించారు. పాల సముద్రాన్ని తలపించే మంచు మేఘాలు, సూర్యోదయం వేళ మంచును చీల్చుకుంటూ వచ్చిన భానుడి కిరణాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. పర్యాటకుల తాకిడి పెరగడంతో పాడేరు పట్టణంలోని టిఫిన్‌, భోజన హోటళ్లు రద్దీగా మారాయి.

కొత్తపల్లి జలపాతం వద్ద..

జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం ఆదివారం పర్యాటకులతో సందడిగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కోలాహలంగా ఉంది. ఆదివారం జలపాతాన్ని 1,300 మంది సందర్శించారని ఎకో టూరిజం సూపర్‌వైజర్‌ అభి తెలిపారు.

అరకులోయలో..

అరకులోయ: మండలంలోని పర్యాటక ప్రాంతాల్లో రద్దీ కొనసాగుతోంది. అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో సందడి నెలకొంది. పద్మాపురం గార్డెన్‌, గిరిజన మ్యూజియం, సుంకరమెట్ట కాఫీ తోటలు, మాడగడ సన్‌రైజ్‌ హిల్స్‌ కిటకిటలాడాయి. సుంకరమెట్టలోని అరణ కాఫీ ట్రయల్‌లో గల కెనోపి వాక్‌(ఉడెన్‌ బ్రిడ్జి)పై నడిచేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు. అయితే పర్యాటకుల తాకిడి ఎక్కువ కావడంతో మధ్యాహ్నం నుంచి దాని సందర్శనను నిలిపివేశారు. కాగా అనంతగిరి, బీసుపురం కాఫీ తోటల్లో కూడా కెనోపి వాక్‌ను ఏర్పాటు చేస్తే సుంకరమెట్ట వద్ద రద్దీ తగ్గడంతో పాటు అటవీ అభివృద్ధి సంస్థకు ఆదాయం కూడా వస్తుందని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు.

లంబసింగిలో..

చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఆదివారం లంబసింగి ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. లంబసింగి జంక్షన్‌, చెరువులవేనం, తాజంగి జలాశయాల వద్ద ఉదయం ఐదు గంటల నుంచి పర్యాటకుల సందడి ప్రారంభమైంది. చెరువులవేనం వ్యూపాయింట్‌ వద్దకు భారీ సంఖ్యలో పర్యాటకులు రావడంతో జాతర వాతావరణాన్ని తలపించింది. మంచు అందాలను తిలకిస్తూ పర్యాటకులు ఎంజాయ్‌ చేశారు. శ్వేత వర్ణంలో ఉన్న మంచు సోయగాల సరసన ఫొటోలు తీసుకునేందుకు పోటీపడ్డారు. సాయంత్రం వరకు పర్యాటక ప్రాంతాలు రద్దీగా కనిపించాయి.

Updated Date - Dec 29 , 2024 | 11:31 PM