మన్యం గజగజ
ABN , Publish Date - Nov 19 , 2024 | 11:44 PM
మన్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది. మంగళవారం పాడేరు మండలం మినుములూరు, ముంచంగిపుట్టులో 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
పెరుగుతున్న చలి తీవ్రత
మినుములూరు, ముంచంగిపుట్టులో 9 డిగ్రీలు నమోదు
పాడేరు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది. మంగళవారం పాడేరు మండలం మినుములూరు, ముంచంగిపుట్టులో 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఇన్నాళ్లుగా కనిష్ఠ 12 నుంచి 16 డిగ్రీలు నమోదయ్యేది. కానీ గత మూడు రోజులుగా ఏజెన్సీలోని వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఫలితంగా ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు పొగమంచు దట్టంగా కురుస్తుండగా, కేవలం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు మాత్రమే ఒక మోస్తరుగా ఎండ ప్రభావం చూపుతున్నది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి చలి వాతావరణం కొనసాగుతున్నది. ప్రస్తుత చలికి పలువురు ఉన్ని దుస్తులు ధరిస్తుండగా, మరి కొందరు చలి మంటలుకాగుతూ ఉపశమనం పొందుతున్నారు.