Share News

పెదబొడ్డేపల్లిలో భారీ చోరీ

ABN , Publish Date - Dec 26 , 2024 | 12:45 AM

మునిసిపాలిటీ పరిధి పెదబొడ్డేపల్లిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. గొలుగొండ పీహెచ్‌సీ హెల్త్‌ అసిస్టెంట్‌ ఇంట్లోకి దొంగలు చొరబడి నగదు, బంగారం అపహరించారు. బాధితుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పెదబొడ్డేపల్లిలో భారీ చోరీ
బాధితుడి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు

- 80 గ్రాముల బంగారం, రూ.8.2 లక్షల నగదు అపహరణ

నర్సీపట్నం, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పరిధి పెదబొడ్డేపల్లిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. గొలుగొండ పీహెచ్‌సీ హెల్త్‌ అసిస్టెంట్‌ ఇంట్లోకి దొంగలు చొరబడి నగదు, బంగారం అపహరించారు. బాధితుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గొలుగొండ పీహెచ్‌సీలో హెల్త్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బీజేవీ ప్రసాద్‌ పెదబొడ్డేపల్లి అక్షయ ఆస్పత్రి సమీపంలో నివాసముంటున్నారు. మంగళవారం భార్య కమల నెహ్రూ, కుమార్తెతో కలిసి ఆయన సొంతూరు తుని వెళ్లారు. వారి ఇంటికి పక్క రోడ్డులో నివాసముంటున్న సూర్య ప్రభావతి బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రసాద్‌ ఇంటికి వచ్చింది. ప్రసాద్‌ కుటుంబానికి ప్రభావతి బాగా పరిచయస్తురాలు. వారు ఊరు వెళ్లిన సంగతి తెలియక ఇంటికి వచ్చి మెయిన్‌ డోరు తెరిచి ఉండడంతో నేరుగా లోపలకు వెళ్లి చూసింది. బెడ్‌రూమ్‌లో బీరువా తెరిచి దుస్తులు చెల్లాచెదురుగా ఉండడం చూసి వెంటనే ఇంటికి వెళ్లి కోడలికి చెప్పింది. ఆమె కోడలు ప్రసాద్‌ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చింది. వారు తుని నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి మెయిన్‌ డోరు, సైడ్‌ డోరు తెరిచి ఉన్నాయి. తాళం కప్పలు కనిపించ లేదు. చిల్డ్రన్‌ బెడ్‌ రూమ్‌, మాస్టర్‌ బెడ్‌ రూమ్‌లోని బీరువాలు తెరిచి దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉండడం గమనించారు. రెండు బీరువాలలో భద్రపరిచిన రూ.8.2 లక్షల నగదు, సుమారు 80 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్టు ప్రసాద్‌ విలేకరులకు తెలిపారు. దీనిపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లూజ్‌ టీమ్‌ వచ్చి ఆధారాలు సేకరించింది. బాధితుల నుంచి డీఎస్పీ మోహన్‌ప్రసాద్‌ వివరాలు సేకరించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో రూరల్‌ సీఐ రేవతమ్మ పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 12:45 AM