మాతృ వందన యోజన సాయం విడుదల
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:47 AM
ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం బకాయిపెట్టిన మొత్తాన్ని కూటమి ప్రభుత్వం దఫదఫాలుగా విడుదల చేస్తోంది.
ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం లబ్ధిదారులకు కొంతకాలంగా చెల్లింపులు నిలిపివేత
కేంద్రం ఇచ్చిన నిధులనూ మళ్లించిన వైసీపీ ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బిల్లులపై దృష్టి
జిల్లాలో 5,478 మందికి సుమారు రూ.కోటిన్నర విడుదల
విశాఖపట్నం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం బకాయిపెట్టిన మొత్తాన్ని కూటమి ప్రభుత్వం దఫదఫాలుగా విడుదల చేస్తోంది. మొదట విడతగా సుమారు రూ.కోటిన్నర లబ్ధిదారులు ఖాతాల్లో జమ చేసింది. రెండో విడత కూడా త్వరలో మంజూరవుతాయని అధికారులు చెబుతున్నారు.
గర్భిణులు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకునేందుకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2017 నుంచి ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి. తొలి కాన్పు అయితే రెండు విడతల్లో రూ.5 వేలు సాయాన్ని అందిస్తున్నాయి. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే ఒక విడతలో రూ.6 వేలు ఇస్తాయి. ఈ మొత్తంతో తల్లి, బిడ్డ పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ఈ పథకం కింద లబ్ధిదారులకు మంజూరుచేసే మొత్తంలో కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్రం వాటా 40 శాతం. అయితే, గత వైసీపీ ప్రభుత్వం ఏడాది నుంచి లబ్ధిదారులకు నిధుల చెల్లింపును పెండింగ్‌లో పెట్టేసింది. కేంద్రం తన వాటాగా ఇచ్చిన నిధులను కూడా ఇతర అవసరాలకు మళ్లించేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకాన్ని నీరుగార్చేలా వైసీపీ వ్యవహరించిన తీరును గుర్తించింది. వెంటనే లబ్ధిదారులకు చెల్లించాల్సిన బకాయిల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతోపాటు అందుకు అవసరమైన నిధులను మంజూరుచేసింది. మూడు వారాల కిందట జిల్లాలో లబ్ధిదారులకు సుమారు రూ.కోటిన్నర విడుదల చేసింది. సుమారు 4,022 మందికి రూ.1,41,21000ను నేరుగా లబ్ధిదారులు ఖాతాల్లో జమ చేశారు.
ఈ పథకం కింద తొలిసారి గర్భం దాల్చిన మహిళకు ఐదు వేల రూపాయలు అందిస్తారు. జిల్లాలో 5,478 మందికి మొదటి, రెండు విడతలకు సంబంధించిన సొమ్ము చెల్లించాల్సి ఉంది. 3,591 మందికి తొలి విడత నిధులు చెల్లించాల్సి ఉండగా, 2,861 మందికి రూ.2 వేలు చొప్పున రూ.85,83,000 జమ చేశారు. అలాగే, రెండో విడతకు సంబంధించి 1004 మందికిగాను 357 మందికి మూడు వేలు చొప్పున రూ.7,14,000 చెల్లించారు. మిగిలిన వారికి కూడా కొద్దిరోజుల్లోనే నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే, రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టిన వారికి ఈ పథకం కింద ఆరు వేలు చొప్పున అందిస్తారు. అందుకు 2,347 మంది అర్హులుగా అధికారులు గుర్తించారు. ఈ దరఖాస్తులు గడిచిన కొద్దినెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. వీరిలో 804 మందికి రూ.6 వేలు చొప్పున రూ.48,24,000 చెల్లించారు. కొన్ని నెలలు నుంచి పెండింగ్‌లో ఉన్న మొత్తాలను చెల్లించడం పట్ల లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.