మాతాశిశు మరణాల నియంత్రణకు చర్యలు
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:47 AM
గిరిజన ప్రాంతంలో మాతాశిశు మరణాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మహిళా, శిశు సంక్షేమశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జి.చిన్మయిదేవి తెలిపారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ సమావేశమందిరంలో పోషకాహార మాసోత్సవం ముగింపు వేడుకలను ఐసీడీఎస్ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చిన్మయిదేవి మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో ఎక్కడా మాతాశిశు మరణాలు సంభవించకుండా క్షేత్ర స్థాయిలో అంగన్‌వాడీ కార్యకర్తలు కృషి చేస్తున్నారన్నారు.
- బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన
- రక్తహీనత సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ
- మహిళా శిశు సంక్షేమశాఖ ఆర్‌జేడీ చిన్మయిదేవి
చింతపల్లి, అక్టోబరు 1: గిరిజన ప్రాంతంలో మాతాశిశు మరణాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మహిళా, శిశు సంక్షేమశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జి.చిన్మయిదేవి తెలిపారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ సమావేశమందిరంలో పోషకాహార మాసోత్సవం ముగింపు వేడుకలను ఐసీడీఎస్ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చిన్మయిదేవి మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో ఎక్కడా మాతాశిశు మరణాలు సంభవించకుండా క్షేత్ర స్థాయిలో అంగన్‌వాడీ కార్యకర్తలు కృషి చేస్తున్నారన్నారు. ప్రతి గర్భిణి ఆస్పత్రిలోనే ప్రసవం పొందేలా ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ఇంట్లో ప్రసవం పొందడం వల్ల తల్లీబిడ్డకు ప్రమాదమని గర్భిణులను చైతన్యపరుస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతంలో బాల్య వివాహాల నియంత్రణకు ఐసీడీఎస్ అధికారులు అనుబంధశాఖల అధికారులను కలుపుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రధానంగా గిరిజన ప్రాంతంలో బాలింతలు, గర్భిణులు, కిషోర బాలికల్లో రక్తహీనత సమస్య అధికంగా కనిపిస్తున్నదన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. రక్తహీనత కలిగిన మహిళలు ఆరోగ్య తనిఖీలు చేయించుకోవాలన్నారు. అనంతరం పోషకాలు కలిగిన రుచికరమైన వంటకాలను ప్రదర్శించిన అంగన్‌వాడీ కార్యకర్తలకు బహుమతులు అందజేశారు. గర్భిణులకు సీమంతాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి.ఆశాజ్యోతి, తహసీల్దార్ టి.రామకృష్ణ, సీడీపీవోలు జీవీ రమణ, పి.విజయకుమారి, ఏసీడీపీవో ఎం.రామలక్ష్మి, వైస్ ఎంపీపీ శారద, సర్పంచ్ దురియా పుష్పలత, ఎంపీటీసీ సభ్యులు ధారలక్ష్మి పద్మ, జయలక్ష్మి, సూపర్‌వైజర్లు విజయకుమారి, గౌహర్ ఉన్నీష, సత్యవతి, గౌరి, అప్పలనర్సమ్మ పాల్గొన్నారు.
పలువురికి సేవా పురస్కారాలు
కొయ్యూరు: ప్రాజెక్టు పరిధిలో పోషకాహార మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకు సీడీపీవో, సూపర్‌వైజర్లు, కార్యాలయ సిబ్బందితో పాటు 19 మంది అంగన్‌వాడీ వర్కర్లు, ఇద్దరు ఆయాలకు ఆర్‌జేడీ చిన్మయిదేవి ఉత్తమ సేవా పురస్కారాలను అందజేశారు. మంగళవారం కొయ్యూరులోని గిరిజన భవన్‌లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహార మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్మయిదేవి మాట్లాడుతూ ఐసీడీఎస్ రీజియన్ పరిధిలోని ఆరు జిల్లాల్లో బాల్య వివాహాల నియంత్రణకు కృషి చేస్తున్నామన్నారు. గర్భిణులు, బాలింతలు, మహిళలు, కిశోర బాలికల సమగ్ర పోషణ, పరిరక్షణకు వీలుగా సక్షం పేరిట అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునికీకరిస్తున్నామన్నారు. రీజియన్‌లో తొలి విడతగా 280 కేంద్రాలను సక్షం అంగన్‌వాడీ కేంద్రాలుగా తీర్చిదిద్దామన్నారు. మూడు వేలకు పైగా ఉన్న మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్పు చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. అనంతరం 12 మంది గర్భిణులకు సీమంతం చేశారు. ఆమె వెంట సీడీపీవో విజయకుమారి వున్నారు.