Share News

అచ్యుతాపురంలో మెగా పవర్‌ ప్లాంట్‌

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:22 AM

దాదాపు పదేళ్ల క్రితం చంద్రబాబునాయుడు కృషితో మంజూరైన ఎన్‌టీపీపీ పవర్‌ ప్రాజెక్టు ఎట్టకేలకు పట్టాలు ఎక్కనున్నది.

అచ్యుతాపురంలో మెగా పవర్‌ ప్లాంట్‌

  • ప్రత్యేక ఆర్థిక మండలిలో ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌

  • నిర్మాణ వ్యయం రూ.85 వేల కోట్లు

  • ఉత్పత్తి సామర్థ్యం 80 గిగావాట్లు

  • 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

  • ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన

  • గత టీడీపీ హయాంలోనే బొగ్గు ఆధారిత పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు

  • ఎన్‌టీపీసీకి 1,200 ఎకరాలు కేటాయింపు.. బొగ్గు దిగుమతిపై కేంద్రం కొర్రి

  • వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తెరమరుగైన ప్రాజెక్టు

  • కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ కదలిక

అచ్యుతాపురం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):

దాదాపు పదేళ్ల క్రితం చంద్రబాబునాయుడు కృషితో మంజూరైన ఎన్‌టీపీపీ పవర్‌ ప్రాజెక్టు ఎట్టకేలకు పట్టాలు ఎక్కనున్నది. గతంలో బొగ్గు ఆధారిత పవర్‌ ప్లాంట్‌కు ఆమోదం లభించగా, గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతోపాటువివిధ కారణాల వల్ల ప్లాంట్‌ నిర్మాణం జరగలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆయన చొరవతో ఎన్‌టీపీసీ ప్రాజెక్టుకు కదలిక వచ్చింది. అయితే ఈసారి బొగ్గు ఆధారంగా కాకుండా పర్యావరణ హితంతో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. రూ.85 వేల కోట్ల పెట్టుబడితో 80 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తితో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టు వల్ల 25 వేల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నెల 29వ తేదీన ఎన్‌టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ నిర్మాణానికి శంకుస్థాపన జరగనునన్నది. ఈ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం..

పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజడ్‌)లో అత్యాధునిక సూపర్‌ పవర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోచించారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందుకు ఆమోదం లభించడంతో 2015లో రాంబిల్లి మండలం పూడి గ్రామం వద్ద ఎస్‌ఈజడ్‌లో 1,200 ఎకరాలను ఎన్‌టీపీసీకి కేటాయించారు. ఇందుకుగాను సంస్థ రూ.700 కోట్లు ఏపీఐఐసీకి చెల్లించింది. ఇక్కడ ఒక్కొక్కటి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంలో నాలుగు యూనిట్ల ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాలన్నది ప్రణాళిక. నిర్మాణ వ్యయం రూ.28,828.29 కోట్లుగా అంచనా వేశారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ కోసం అస్ర్టేలియా నుంచి నాణ్యమైన బొగ్గును దిగుమతి చేసుకోవాలని ప్రతిపాదించారు. ఇందుకోసం పూడిమడక వద్ద హార్బర్‌ నిర్మించాలని టీడీపీ ప్రభుత్వం యోచించి రూ.300 కోట్లు మంజూరు చేసింది. అయితే ప్రతిపాదిత విద్యుత్‌ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో చిన్నపాటి సెలయేర్లు, కాలువలు వున్నాయంటూ కేంద్ర పర్యావరణ శాఖ తొలుత అనుమతులు ఇవ్వలేదు. దీంతో చంద్రబాబునాయుడు అప్పటి పర్యావరణ శాఖ మంత్రిని కలిసి అనుమతులు ఇచ్చేలా కృషి చేశారు. దీంతో ప్లాంట్‌ యాజమాన్యం రూ. 14.2 కోట్ల వ్యయంతో స్థలం చుట్టూ 12 కిలోమీటర్ల మేర ప్రహరీ గోడను నిర్మించింది. ప్లాంట్‌ నిర్మాణం ప్రారంభం కాబోయే సమయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత చెండింది. దీంతో కేంద్రం విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవడం వీలుకాదని కేంద్రం ప్రకటించింది. దీంతో దేశీయ బొగ్గునే కేటాయించాలని ఎన్‌టీపీసీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇదే సమయంలో ఎన్నికలు జరిగి రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎన్‌టీపీసీకి కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకొని ఫార్మా కర్మాగారాలకు విక్రయిండానికి చర్యలు చేపటట్టింది. ఇందులో భాగంగా ఏపీఐఐసీ ద్వారా ఎన్‌టీపీసీకి నోటీసులు జారీ చేయించింది. తాము భూమికి డబ్బులు చెల్లించామని, రాష్ట్రంలో ఎక్కడైనా ఆరు వేల ఎకరాలు కేటాయిస్తే ఇక్కడ భూమిని వదులుకుంటామని యాజమాన్యం స్పష్టం చేసింది. ఇందుకు నిరాకరించిన వైసీపీ ప్రభుత్వం.. విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయిస్తామని ఏపీఐఐసీ ద్వారా నోటీసులు జారీ చేసింది. భూమి కోసం గతంలో తాము చెల్లించిన రూ.700 కోట్లతోపాటు తాము ఇంతవరకు చేసిన ఖర్చును తిరిగి చెల్లించాలని ఎన్‌టీపీసీ యాజమాన్యం షరతు విధించింది. దీంతో ప్రభుత్వం మిన్నకుండిపోయింది. ఈ క్రమంలో సాధారణ ఎన్నికలు జరిగి వైసీపీ ఘోరంగా ఓడిపోయి, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఎన్‌టీపీసీ విద్యుత్‌ ప్లాంట్‌కు మళ్లీ కదలిక వచ్చింది. అయితే మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా, కాలుష్యరహితంగా విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీపీసీ నిర్ణయించాయి. చంద్రబాబు నాయుడు చొరవతో ఎన్‌టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌గా పట్టాలెక్కబోతున్నది. ఈ నెల 29వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.

Updated Date - Nov 19 , 2024 | 01:22 AM