Share News

త్వరలో అందుబాటులోకి మేలి రకం రాజ్‌మా

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:46 AM

ఆదివాసీ రైతులకు మేలి రకం రాజ్‌మా విత్తనాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స్థానిక ఆచార్య ఎన్‌జీ రంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చేపడుతున్న ప్రయోగాత్మక సాగు విజయవంతమైంది. ఈ ఏడాది ప్రతికూల వాతావావరణ పరిస్థితులను తట్టుకుని అరుణ్‌, జ్వాల రకాలు మంచి దిగుబడులు ఇచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వచ్చే ఏడాది విత్తనాభివృద్ధి లక్ష్యంగా అభ్యుదయ రైతులకు మినీ కిట్ల రూపంలో నూతన వంగడాలు పంపిణీ చేస్తామని శాస్త్రవేత్తలు అంటున్నారు.

త్వరలో అందుబాటులోకి మేలి రకం రాజ్‌మా
అరుణ్‌ రకం రాజ్‌మా విత్తనాలు

- ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రయోగాత్మక సాగు విజయవంతం

- గిరిజన ప్రాంతంలో అరుణ్‌, జ్వాల అత్యంత అనుకూలం

- వచ్చే ఏడాది అభ్యుదయ రైతులకు విత్తనాల పంపిణీ

చింతపల్లి, జనవరి 16: ఆదివాసీ రైతులకు మేలి రకం రాజ్‌మా విత్తనాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స్థానిక ఆచార్య ఎన్‌జీ రంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చేపడుతున్న ప్రయోగాత్మక సాగు విజయవంతమైంది. ఈ ఏడాది ప్రతికూల వాతావావరణ పరిస్థితులను తట్టుకుని అరుణ్‌, జ్వాల రకాలు మంచి దిగుబడులు ఇచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వచ్చే ఏడాది విత్తనాభివృద్ధి లక్ష్యంగా అభ్యుదయ రైతులకు మినీ కిట్ల రూపంలో నూతన వంగడాలు పంపిణీ చేస్తామని శాస్త్రవేత్తలు అంటున్నారు.

దక్షిణ భారత దేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే రాజ్‌మా పండుతోంది. ఆదివాసీ రైతులు 40 ఏళ్లగా రాజ్‌మా పంటను సంప్రదాయేతర వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. 12 ఏళ్ల క్రితం వరకు ఆదివాసీ రైతులు సుమారు 45 వేల హెక్టార్లలో రాజ్‌మాను సాగుచేసేవారు. అయితే ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటను నష్టపోవడం, కనీసం విత్తనాలు కూడా చేతికి అందకపోవడం వల్ల కాలక్రమేణా గిరిజన ప్రాంతంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఈ ఏడాది పాడేరు డివిజన్‌ పరిధిలో కేవలం 12,500 ఎకరాల్లో మాత్రమే రాజ్‌మా సాగు చేశారు. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో గరిష్ఠంగా ఆరు వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. ఆదివాసీ రైతులు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడం వల్లే రాజ్‌మా సాగుకు దూరమవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన చింతపల్లి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు నూతన రాజ్‌మా వంగడాలపై 2022లో పరిశోధనలు ప్రారంభించారు.

రెండేళ్లగా రాజ్‌మా పంటపై పరిశోధనలు

రాజ్‌మా నూతన వంగడాల అభివృద్ధికి రెండేళ్లుగా పరిశోధనలు చేపడుతున్నారు. 2022లో అసోం, హిమాచల్‌ప్రదేశ్‌ వ్యవసాయ పరిశోధన స్థానాల నుంచి ఆరు రకాల రాజ్‌మా విత్తనాలను దిగుమతి చేసుకుని పరిశోధనలు ప్రారంభించారు.

ఆశాజనకంగా జ్వాల, అరుణ్‌

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్న ఆరు రకాల వంగడాల్లో జ్వాలా, అరుణ్‌ ఆశాజనకంగా ఉన్నట్టు గుర్తించారు. అసోం, హిమాచల్‌ప్రదేశ్‌ వ్యవసాయ పరిశోధన స్థానాల నుంచి దిగుమతి చేసుకున్న అంబెర్‌, ఫాల్గుణ, అరుణ్‌, ఉత్కర్స్‌, ఉదయ్‌, జ్వాలాతో పాటు ప్రాంతీయంగా లభించే చింతపల్లి రెడ్‌ విత్తనాలపై శాస్త్రవేత్తలు 2022లో ప్రయోగాత్మక సాగు చేపట్టారు. ప్రధానంగా గింజ పరిమాణం, దిగుబడి, తెగుళ్లు తట్టుకునే శక్తితో పాటు పోషక విలువలు, రుచి ఆధారంగా గిరిజన ప్రాంతానికి జ్వాల, అరుణ్‌ రకాలు అత్యంత అనుకూలంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారించారు.

ప్రతికూల పరిస్థితుల్లోనూ దిగుబడులు

ఈ ఏడాది పరిశోధన స్థానంలో చేపట్టిన రాజ్‌మా ప్రయోగాత్మక సాగులో అరుణ్‌, జ్వాల రకాలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఆశించి దిగుబడులు వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అరుణ్‌, జ్వాల రకాలు 2022లో ఎకరానికి 600 కిలోల దిగుబడులు వచ్చాయి. ఈ ఏడాది సెప్టెంబరులో నాట్లు వేయగా నవంబరులో పిందెకట్టే దశలో వర్షాలు లేవు. పంట చేతికందే సమయంలో మిచౌంగ్‌ తుఫాను విరుచుకు పడింది. ఈ కారణాల వల్ల రాజ్‌మా పంటకు అపార నష్టం కలిగింది. ఈ ప్రతికూల పరిస్థితులను సైతం తట్టుకుని అరుణ్‌ ఎకరానికి 450 కిలోలు, జ్వాలా 350 కిలోల దిగుబడులు వచ్చాయి. కాగా పాడేరు రెవెన్యూ డివిజన్‌లో రైతులు నాట్లు వేసుకున్న చింతపల్లి రెడ్‌ రకం పంట పొలాల్లో ఎకరానికి కేవలం 50-70 కిలోల దిగుబడులు మాత్రమే వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది పరిశోధనల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం ఆరుణ్‌, జ్వాల రకాలు తట్టుకుని మంచి దిగుబడులనిస్తాయని గుర్తించామని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 12:46 AM