Share News

అభివృద్ధికి నోచని మినీ రిజర్వాయర్‌

ABN , Publish Date - Dec 23 , 2024 | 11:25 PM

పాడేరు మండలంలో కుజ్జెలి, హుకుంపేట మండలం అడ్డుమండ గ్రామాల సరిహద్దులోని అడ్డుమండ మినీ రిజర్వాయర్‌ చాలా ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో అది మరమ్మతులకు గురై దాని కింద ఉన్న ఆయకట్టు భూములకు సాగునీరు అందని దుస్థితి చాలా కాలంగా కొనసాగుతోంది.

అభివృద్ధికి నోచని మినీ రిజర్వాయర్‌
మరమ్మతులకు గురైన అడ్డమండ మినీ రిజర్వాయర్‌

200 ఎకరాల పంట భూములకు సాగు నీరందని దుస్థితి

మన్యంలో సాగునీటి వనరులపై గత పాలకుల నిర్లక్ష్యం

అడ్డుమండ మినీ రిజర్వాయర్‌ను వినియోగంలోకి తీసుకురావాలని రైతుల వేడుకోలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

పాడేరు మండలంలో కుజ్జెలి, హుకుంపేట మండలం అడ్డుమండ గ్రామాల సరిహద్దులోని అడ్డుమండ మినీ రిజర్వాయర్‌ చాలా ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో అది మరమ్మతులకు గురై దాని కింద ఉన్న ఆయకట్టు భూములకు సాగునీరు అందని దుస్థితి చాలా కాలంగా కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి వసతుల కల్పనపై కనీసం దృష్టి సారించకపోవడంతో పరిస్థితి దారుణంగా ఉంది.

మండలంలోని వంతాడపల్లి, తుంపాడ, కుజ్జెలి పంచాయతీల పరిధిలో గల గ్రామాలకు, హుకుంపేట మండలం అడ్డుమండ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 200 ఎకరాల్లో పంట భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చాలా ఏళ్ల క్రితం కుజ్జెలి, అడ్డుమండ పరిసర ప్రాంతాల్లో వున్న దిగువమోదాపుట్టు గెడ్డపై మినీ రిజర్వాయర్‌ను నిర్మించారు. దాని ఆధారంగా ఆ పంట పొలాలకు ఏడాది పొడవునా సాగునీరు అందేది. దీంతో మినీ రిజర్వాయర్‌ ఆయకట్టు కింద వరి, చెరకు, రాగులు, తదితర పంటలను గిరి రైతులు సాగు చేసేవారు. సాగునీరు అందుబాటులో ఉండడంతో గిరిజన రైతులు ఖరీఫ్‌, రబీ సీజన్లలో సైతం పలు రకాల పంటలను పండించే వారు. అయితే క్రమంగా మినీ రిజర్వాయర్‌ మరమ్మతులకు గురికావడం, అందులో నీరు నిల్వ ఉండకపోవడం, దానికి అనుబంధంగా ఉన్న చానళ్లు, కాల్వలు పాడైపోవడంతో పంట పొలాలకు సక్రమంగా సాగునీరు అందని దుస్థితి కొనసాగుతున్నది.

మినీ రిజర్వాయర్‌ అభివృద్ధి ప్రకటనలకే పరిమితం

మండలంలో దిగువమోదాపుట్టు గెడ్డపై నిర్మించిన అడ్డుమండ మినీ రిజర్వాయర్‌కు అవసరమైన మరమ్మతులు నిర్వహించి అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన చాలా కాలంగా కార్యరూపం దాల్చడం లేదు. దీంతో మినీ రిజర్వాయర్‌ ఏ విధంగానూ అభివృద్ధికి నోచుకోవడం లేదు. మినీ రిజర్వాయర్‌కు మరమ్మతులు చేపట్టి తమకు సాగునీటి సదుపాయం కల్పించాలని గతంలో ఆయా ప్రాంతాలకు చెందిన గిరిజన రైతులు ఎంపీ, ఎమ్మెల్యేలకు, అధికారులకు అనేక మార్లు వినతిపత్రాలను సమర్పించారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వమైనా స్పందించి మినీ రిజర్వాయర్‌ అభివృద్ధికి కృషి చేయాలని ఈ ప్రాంత గిరి రైతులు కోరుతున్నారు.

Updated Date - Dec 23 , 2024 | 11:25 PM