Share News

నిండుకుండలా మినీ రిజర్వాయర్లు

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:51 AM

ఇటీవల కురిసిన వర్షాలకు అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లోని సిమిలిగుడ, కొర్రాయి మినీ రిజర్వాయర్లు నిండుకున్నాయి. సిమిలిగుడ రిజర్వాయర్‌ పొర్లుకట్టు పారుతున్నప్పటికీ ఆయకట్టు భూములకు పూర్తిస్థాయిలో నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. రెండు మినీ రిజర్వాయర్లకు ఏళ్ల తరబడి మరమ్మతులు చేపట్టకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

నిండుకుండలా మినీ రిజర్వాయర్లు
సిమిలిగుడ మినీ రిజర్వాయర్‌

అయినా ఆయకట్టు రైతులకు అందని సాగునీరు

సిమిలిగుడ, కొర్రాయి రిజర్వాయర్లకు

ఏళ్ల తరబడి చేయని మరమ్మతులు

రెండు వైపులా కోతలకు గురైన మినీ రిజర్వాయర్లు

ఆందోళన చెందుతున్న గిరి రైతులు

అరకులోయ/డుంబ్రిగుడ, సెప్టెంబరు 13:

ఇటీవల కురిసిన వర్షాలకు అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లోని సిమిలిగుడ, కొర్రాయి మినీ రిజర్వాయర్లు నిండుకున్నాయి. సిమిలిగుడ రిజర్వాయర్‌ పొర్లుకట్టు పారుతున్నప్పటికీ ఆయకట్టు భూములకు పూర్తిస్థాయిలో నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. రెండు మినీ రిజర్వాయర్లకు ఏళ్ల తరబడి మరమ్మతులు చేపట్టకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

రైతులకు అందని సాగునీరు

అరకులోయ మండలంలోని సిమిలిగుడ వద్ద మినీ రిజర్వాయర్‌ 1972లో నిర్మించారు. నాడు ఐరన్‌ వినియోగించకుండా కేవలం సిమెంట్‌ కాంక్రీట్‌తో నిర్మాణం చేపట్టారు. గద్యాగుడ, సిమిలిగుడ, బొసుబెడ్డ గ్రామ రైతుల పంట పొలాలకు ఈ నీరు ఉపయోగపడుతుంది. దీని ఆయకట్టు 1600 ఎకరాలకు పైగా ఉన్నప్పటికీ కేవలం 500 ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందుతున్నదని రైతులు తెలిపారు. కాలువల నిర్మాణం లేకపోవడంతో బెంజిపైర్‌, పానిరంగిని గ్రామాల పొలాలకు నీరు అందడం లేదు. అయితే ఈ రిజర్వాయర్‌కు ఏళ్ల తరబడి ఎటువంటి మరమ్మతులు చేపట్టలేదు. రెండు వైపులా కోతకు గురవడంతో రిజర్వాయర్‌ పటిష్టతపై గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు.

‘కొర్రాయి’ రైతులదీ అదే పరిస్థితి

డుంబ్రిగుడ మండలంలోని కొర్రాయి మినీ రిజర్వాయర్‌ టీడీపీ హయాంలో నిర్మించారు. దీని ఆయకట్టు 110 ఎకరాలు. ఏటా వర్షాధారంపై సాగు చేసే ఆయకట్టు రైతులు రిజర్వాయర్‌ నిర్మాణంతో ఏడాది పొడవునా పంటలు పండించుకునేవారు. ఇటీవల కురిసిన వర్షాలకు మినీ రిజర్వాయర్‌లో పూర్తిగా నీరు చేరింది. అయితే మదుములు మరమ్మతులకు గురవడంతో నీరు వృథాగా పోతున్నది. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అసలు మరమ్మతులు చేపట్టలేదని, దీనివల్ల నీరు వృథాగా పోతున్నదని రైతులు వాపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రిజర్వాయర్‌ చివర కోతకు గురైందని రైతులు తెలిపారు. మినీ రిజర్వాయర్‌ కుడి,ఎడమ కాలువల్లో పూడిక, తుప్పలు పెరిగిపోయాయని, భూములకు పూర్తి స్థాయిలో నీరందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిమిలిగుడ, కొర్రాయి మినీ రిజర్వాయర్లకు మరమ్మతులు చేయాలని ఆయా ప్రాంతాల రైతులు కోరుతున్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:51 AM