Share News

ఎమ్మెల్యేల లిక్కర్‌ దందా

ABN , Publish Date - Nov 16 , 2024 | 01:22 AM

మద్యం వ్యాపారంలో కొంతమంది ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకుంటున్నారు.

ఎమ్మెల్యేల లిక్కర్‌ దందా

  • మద్యం వ్యాపారులకు ఇండెంట్లు

  • దుకాణాల్లో వాటా అడుగుతున్న ఒక ఎమ్మెల్యే

  • దుకాణానికి రూ.పది లక్షలు గుడ్‌ విల్‌ ఇవ్వాలని మరో ప్రజా ప్రతినిధి డిమాండ్‌

  • తనను కలవని వారికి లైసెన్స్‌ ఇవ్వొద్దని ఎక్సైజ్‌ అధికారులకు మరో ఎమ్మెల్యే ఆదేశాలు

  • లాటరీలో దక్కించుకున్న వారి వద్ద నుంచి మూడు దుకాణాలు చేజిక్కించుకున్న మరో ఎమ్మెల్యే

  • ఆ దుకాణాల పరిసరాల్లో మరే దుకాణానికి లైసెన్స్‌ ఇవ్వకుండా మోకాలడ్డు

  • నిబంధనలకు విరుద్ధంగా కొన్నిచోట్ల దుకాణాలు ఏర్పాటు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మద్యం వ్యాపారంలో కొంతమంది ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకుంటున్నారు. దుకాణాల్లో వాటా ఒకరు డిమాండ్‌ చేస్తే, మరొకరు...ప్రతి దుకాణం నుంచి గుడ్‌విల్‌ పేరుతో డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. బినామీ పేర్లతో తాము దక్కించుకున్న దుకాణాల పరిసరాల్లో మరొక దుకాణం ఏర్పాటుకాకుండా ఇంకొందరు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.

మద్యం వ్యాపారంలో ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టంగా ఆదేశించినా ఉమ్మడి జిల్లాలో కొంతమంది పెడచెవిన పెడుతున్నారు. తాము ప్రత్యక్షంగా సీన్‌లోకి రాకుండా తమ అనుచరులు, ఎక్సైజ్‌ శాఖలోని అస్మదీయులైన అధికారుల ద్వారా చక్రం తిప్పుతున్నారు. అనకాపల్లి జిల్లా పరిధిలోని ఒక ప్రజా ప్రతినిధి తన నియోజకవర్గంలో ఉన్న మద్యం దుకాణాల నుంచి గుడ్‌విల్‌ కింద కొంత మొత్తం వసూలు చేయాలంటూ అనుచరుడి ద్వారా ఎక్సైజ్‌ అధికారికి ఇండెంట్‌ పెట్టించారు. ఎక్సైజ్‌ శాఖ అధికారులు నియోజకవర్గంలోని ఒక్కో దుకాణం నుంచి రూ.పది లక్షలు చొప్పున వసూలు చేసి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. రెండు రోజుల కిందట జరిగిన ఎక్సైజ్‌ శాఖ సమావేశంలో ఈ విషయాన్ని ఉన్నతాధికారులు సంబంధిత నియోజకవర్గంలో పనిచేస్తున్న ఎక్సైజ్‌ సీఐలకు వివరించినట్టు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో వ్యాపారులను పిలిచి ఉన్నతాధికారుల ప్రతిపాదనను వారికి వివరించాలని సీఐలు భావిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని మరో నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధి మద్యం వ్యాపారంలో స్లీపింగ్‌ పార్టనర్‌గా చేరాలనే ఉద్దేశంతో ఉన్నారు. ప్రతి దుకాణంలో తనకు వాటా ఇవ్వాలని, ఆ మేరకు లైసెన్స్‌ ఫీజును ఇచ్చేస్తానని వ్యాపారులకు ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతోంది. గుడ్‌విల్‌, అధికారులకు ఇచ్చే ఫార్మాలిటీలను తాను ఇచ్చుకోలేనని కేవలం లైసెన్స్‌ ఫీజులో వాటాను మాత్రమే చెల్లిస్తానని చెప్పడంతో వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. మరొక ప్రజా ప్రతినిధి తన నియోజకవర్గంలో నోటిఫై చేసిన దుకాణాలకు లైసెన్స్‌లను జారీచేసేముందు తన దృష్టిలో పెట్టాలని ఎక్సైజ్‌ శాఖ అధికారులకు ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. తనను కలిసి ప్రసన్నం చేసుకున్న వారికి మాత్రమే లైసెన్స్‌లు జారీచేయాలని అధికారులకు సూచిస్తున్నారని, కలవని వారికి దుకాణాలు దొరకకుండా చేయడంతోపాటు ఎక్కడైనా ఏర్పాటుచేసుకున్నాసరే లైసెన్స్‌ జారీ కాకుండా ఇబ్బందిపెడుతున్నారని కొంతమంది వ్యాపారులు చెబుతున్నారు. సదరు ప్రజా ప్రతినిధి ఇబ్బంది పడలేకే రూ.ఐదు లక్షలు ఖర్చుపెట్టి దుకాణం ప్రారంభించిన వ్యాపారి ఒకరు...పది రోజుల తర్వాత బీచ్‌రోడ్డులోకి దుకాణాన్ని మార్చుకున్నారంటున్నారు. నగరంలోని ప్రజా ప్రతినిధి ఒకరు తన నియోజకవర్గ పరిధిలో నోటిఫైడ్‌ దుకాణాలను లాటరీలో దక్కించుకున్నవారి నుంచి మూడింటిని స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ మూడు దుకాణాలు ఏర్పాటుచేసిన ప్రాంతాల్లో మరో నాలుగు దుకాణాలు ఏర్పాటుచేయాల్సి ఉన్నప్పటికీ అందుకు లైసెన్స్‌ ఇవ్వకుండా తనకు అస్మదీయుడైన కీలక అధికారి ద్వారా చక్రం తిప్పారంటున్నారు. ప్రజా ప్రతినిధుల మెప్పు కోసం కొంతమంది ఎక్సైజ్‌ అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. నగరానికి చెందిన మరొక ప్రజా ప్రతినిధికి సన్నిహితుడైన ప్రముఖ మద్యం వ్యాపారి ఒకరు బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లో కార్పొరేట్‌ స్టైల్‌లో దుకాణం ఏర్పాటుచేస్తున్నారు. దుకాణం మొదటి అంతస్థులో ఉండడంతో పైకి ఎక్కేందుకు రోడ్డువైపు నుంచి మెట్లు లేకపోవడంతో ఫుట్‌పాత్‌ను ఆక్రమించేసి మరీ ర్యాంపు నిర్మించేస్తున్నారు. జీవీఎంసీ, పోలీస్‌ అధికారులను అటు వైపు చూడొద్దని సదరు ప్రజా ప్రతినిధి ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. కమర్షియల్‌ భవనంలో మాత్రమే అలాంటి దుకాణం ఏర్పాటుచేయాలని, అయితే నివాసానికి ప్లాన్‌ కలిగిన భవనంలో ఏర్పాటుచేస్తున్నాసరే అధికారులు ముందువెనుకా ఆలోచించ కుండా లైసెన్స్‌ మంజూరుచేయడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.

Updated Date - Nov 16 , 2024 | 01:23 AM