Share News

ఏకమై కదిలారు.. మార్గం చూపారు

ABN , Publish Date - Nov 14 , 2024 | 11:52 PM

రహదారి సౌకర్యం లేక మండలంలోని రూఢకోట పంచాయతీలో గల మారుమూల పెదకొండా గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి సౌకర్యం కల్పించాలని గత ఐదేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో గురువారం గ్రామస్థులంతా శ్రమదానంతో ఐదు కిలో మీటర్ల మేర మార్గం ఏర్పాటు చేసుకున్నారు.

ఏకమై కదిలారు.. మార్గం చూపారు
శ్రమదానంతో రహదారి ఏర్పాటు చేస్తున్న పెదకొండా గ్రామస్థులు

రహదారి సౌకర్యం లేక పెదకొండా గ్రామస్థుల అవస్థలు

గర్భిణులు, రోగులకు తప్పని డోలీ మోతలు

గత ఐదేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం

గ్రామస్థులంతా శ్రమదానంతో మార్గం ఏర్పాటు

పెదబయలు, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): రహదారి సౌకర్యం లేక మండలంలోని రూఢకోట పంచాయతీలో గల మారుమూల పెదకొండా గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి సౌకర్యం కల్పించాలని గత ఐదేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో గురువారం గ్రామస్థులంతా శ్రమదానంతో ఐదు కిలో మీటర్ల మేర మార్గం ఏర్పాటు చేసుకున్నారు.

మండలంలోని రూఢకోట పంచాయతీ మారుమూల గ్రామమైన పెదకొండాకు సరైన రహదారి లేదు. దీంతో ఎవరైనా అనారోగ్యానికి గురైతే డోలీలోనే మోసుకెళ్లాల్సిన పరిస్థితి. తమ గ్రామానికి రహదారి నిర్మించాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులను గ్రామస్థులు కోరారు. కాళ్లు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తామే రహదారిని బాగు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గురువారం గ్రామంలోని పెద్దలు, పిల్లలు అంతా ఏకమై పారా, గునపం చేతపట్టి కనీసం ఫీడర్‌ అంబులెన్స్‌ అయినా గ్రామానికి చేరుకునే విధంగా పర్రేడా పంచాయతీ పెద్దపుట్టు గ్రామం నుంచి పెదకొండా గ్రామం వరకు ఐదు కిలో మీటర్ల మేర రోడ్డు బాగుచేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ ఓట్ల కోసం వచ్చే నాయకులు తమకు సౌకర్యాలు కల్పించడంపై మాత్రం దృష్టి పెట్టడం లేదని వాపోయారు. గర్భిణులను, అనారోగ్యానికి గురైన వారిని డోలీలోనే ఆస్పత్రికి తరలించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి వె ళ్లి నిత్యావసర సరకులు తెచ్చుకోవాలన్నా, పనుల నిమిత్తం కార్యాలయాలకు వెళ్లాలన్నా సరైన మార్గం లేక పాట్లు పడుతున్నామని వాపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్థులంతా ఏకమై ఫీడర్‌ అంబులెన్స్‌ తమ గ్రామానికి వచ్చే విధంగా రోడ్డును బాగు చేశామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి పక్కా రహదారి నిర్మించాలని గ్రామస్థులు మన్మథరావు, రాధాకృష్ణ, సింహాద్రి, తౌడుబాబు, కర్రమ్మ, చిలకమ్మ, ప్రవళిక, తదితరులు కోరుతున్నారు.

Updated Date - Nov 14 , 2024 | 11:52 PM