Share News

నర్సీపట్నంలో యువకుడి హత్య

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:24 AM

నర్సీపట్నం మునిసిపాలిటీలోని కొత్తవీధిలో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు.

నర్సీపట్నంలో యువకుడి హత్య

  • కొత్తవీధిలో అర్ధరాత్రి ఘటన

  • మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య గొడవ

  • ఒక వ్యక్తిని కర్రతో బలంగా కొట్టిన రౌడీ షీటర్‌ సంతోష్‌

  • తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి

  • నిందితులు పరారీ.. గాలించి పట్టుకున్న పోలీసులు

  • పోలీసు స్టేషన్‌ ఎదుట హతుడి బంధువులు ఆందోళన

నర్సీపట్నం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):

నర్సీపట్నం మునిసిపాలిటీలోని కొత్తవీధిలో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో స్థానిక యువకుల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాలను బలిగొన్నది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మోహన్‌, పట్టణ సీఐ గోవిందరావు సోమవారం మీడియాకు వివరించారు.

కోటవురట్ల మండలం రామచంద్రపాలెం గ్రామానికి చెందిన సర్వసిద్ధి నాగేశ్వరరావు(33) ప్రైవేటు ఎలక్ర్టీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇతని అత్తవారిది నర్సీపట్నం మండలం గురందొరపాలెం. ఉపాధి రీత్యా చాలా కాలం నుంచి నాగేశ్వరరావు నర్సీపట్నంలోని కొత్తవీధిలో భార్యాబిడ్డలతో నివాసం వుంటున్నాడు. మూడేళ్ల కుమార్తె వుండగా, ఐదు నెలల క్రితం భార్య నాగలక్ష్మి పురుడు పోసుకోవడానికి పుట్టింటికి వెళ్లింది. తరువాత కుమారుడు పుట్టాడు. ప్రస్తుతం భార్య, ఇద్దరు బిడ్డలు గురందొరపాలెంలో వుంటున్నారు. నాగేశ్వరరావు కొత్తవీధిలోనే వుంటూ అప్పుడప్పుడు అత్తవారింటికి వెళ్లి వస్తున్నాడు. ఆదివారం గురందొరపాలెం వెళ్లిన నాగేశ్వరరావు రాత్రయిన తరువాత అక్కడ నర్సీపట్నం టౌన్‌కు చెందిన ఇందల శంకర్‌, కాపు వీధికి చెందిన సియాద్రి వెంకట సురేశ్‌లతో కలిసి నాగేశ్వరరావు మద్యం సేవించాడు. రాత్రి 11 గంటల సమయంలో ముగ్గురూ కలిసి బైక్‌పై నర్సీపట్నం కొత్తవీధికి బయలుదేరారు. ఎంపీపీ స్కూల్‌ సమీపంలోకి వచ్చే సరికి అక్కడ స్థానికులైన బండారు సంతోష్‌ (పోలీసు రికార్డుల్లో రౌడీషీటర్‌గా నమోదైంది), బండారు కొండబాబు మద్యం సేవిస్తున్నారు. వీరు బైక్‌ను ఆపి ఇటువైపు ఎందుకు వచ్చారని నాగేశ్వరరావును ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం మొదలైంది. గొడవ ముదురుతుండడంతో ఇందల శంకర్‌ సర్దుబాటు చేసి ముగ్గురూ కలిసి బైక్‌పై నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు. అక్కడ అతనిని దిగబెట్టిన తరువాత తిరిగి వెళుతుండగా బండారు సంతోష్‌ మళ్లీ అడ్డగించి గొడవకు దిగి, మెడ మీద సిగరెట్‌తో కాల్చాడు. దీంతో శంకర్‌ తిరిగి నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి ఈ విషయం చెప్పాడు. ఇద్దరూ కలిసి మళ్లీ బైక్‌పై సంతోష్‌, కొండబాబులు వున్న చోటుకు వచ్చారు. సిగరెట్‌తో ఎందుకు కాల్చావని నాగేశ్వరరావు నిలదీయగా మళ్లీ ఇరువురి మధ్య గొడవ జరిగింది. సంతోష్‌ కర్రతో బలంగా నాగేశ్వరరావు మెడ మీద కొట్టడంతో కిందపడిపోయాడు. దీంతో శంకర్‌ కొత్తవీధిలోకి వెళ్లి నాగేశ్వరరావు బంధువులను పిలుచుకువచ్చాడు. ఈలోగా సంతోష్‌, కొండబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నాగేశ్వరరావును ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం ఉదయం ఏరియా ఆస్పత్రికి, సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. నాగేశ్వరరావు మేనమామ పల్లా అప్పన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండారు సంతోష్‌, బండారు కొండబాబులపై కేసు నమోదు చేశారు. పట్టణ సీఐ గోవిందరావు, రూరల్‌ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. రాయల్‌ రిసార్ట్స్‌ కూడలి వద్ద సంతోష్‌ని, మాకవరపాలెం శివారులో కొండబాబుని అరెస్టు చేశారు. మృతుడు నాగేశ్వరరావుకి చెందిన సెల్‌ ఫోన్‌, బైక్‌ తాళం కొండబాబునుంచి స్వాధీనం చేసుకున్నారు. కొత్తవీధిలో పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేసి, రాత్రి పెట్రోలింగ్‌ పెంచారు.

పట్టణ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ధర్నా

నాగేశ్వరరావు హత్యకు గురైన విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు రామచంద్రపాలెం, గురందొరపాలెం గ్రామాల నుంచి పెద్ద ఎత్తున నర్సీపట్నం చేరుకున్నారు. నాగేశ్వరరావు మృతదేహం వున్న ప్రాంతీయ ఆస్పత్రి, పట్టణ పోలీసు స్టేషన్‌ వద్ద ఆందోళన చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 19 , 2024 | 01:24 AM