నందన వనం.. ఆహ్లాదభరితం
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:44 AM
మండలంలోని ఈ.బోనంగి పంచాయతీ పరిధి ఫార్మాసిటీ పునరావాస కాలనీలో ఏర్పాటు చేసిన ఉద్యానవనం ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తోంది. సుమారు 80 సెంట్లకుపైగా స్థలంలో పంచాయతీ నిధులు రూ.40 లక్షలు వెచ్చించి ఆకట్టుకునే విధంగా పార్కును తీర్చిదిద్దారు.
పరవాడ, సెప్టెంబరు 15 : మండలంలోని ఈ.బోనంగి పంచాయతీ పరిధి ఫార్మాసిటీ పునరావాస కాలనీలో ఏర్పాటు చేసిన ఉద్యానవనం ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తోంది. సుమారు 80 సెంట్లకుపైగా స్థలంలో పంచాయతీ నిధులు రూ.40 లక్షలు వెచ్చించి ఆకట్టుకునే విధంగా పార్కును తీర్చిదిద్దారు. కడియం నుంచి మొక్కలు, పచ్చగడ్డి తీసుకువచ్చి పార్కు లోపల పెంచారు. కూర్చోవడానికి బెంచీలు, వెలుగుల నిమిత్తం ఎల్‌ఈడీ, హైమాస్ట్ దీపాలు ఏర్పాటు చేశారు. పార్కు మధ్యలో బాతుల బొమ్మలను పెట్టి తీర్చిదిద్దిన ఫౌంటైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పెద్దల కోసం ఓపెన్‌జిమ్, పిల్లలు ఆడుకోవడానికి సామగ్రిని ఏర్పాటు చేశారు. నడక కోసం ఉద్యానవనం చుట్టూ నడకదారిని తీర్చిదిద్దారు. తాగునీటి సదుపాయాన్ని కూడా కల్పించారు. కాలనీవాసులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు, పిల్లలకు, వృద్ధులకు అందుబాటులో ఉండే విధంగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్కును నిర్మించడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలతో కాసేపు ఆహ్లాదం పొందడానికి వీలుగా కాలనీలో పార్కును ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కాసేపు సేద తీరేందుకు పార్కు ఎంతగానో ఉపయోగపడుతుంది.