జీవీఎంసీకి జాతీయ అవార్డు
ABN , Publish Date - Dec 23 , 2024 | 12:34 AM
పరిశుభ్రత, చెత్త విభజన, సింగిల్ ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే ఇబ్బందులపై ప్రజలకు అవగాహన కల్పించడంలో జీవీఎంసీ జాతీయస్థాయి ఉత్తమ నగరంగా ఎంపికైంది.
పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఉత్తమ నగరంగా గుర్తింపు
రాయ్‌పూర్‌లో అందుకున్న అదనపు కమిషనర్ రమణమూర్తి
విశాఖపట్నం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి):
పరిశుభ్రత, చెత్త విభజన, సింగిల్ ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే ఇబ్బందులపై ప్రజలకు అవగాహన కల్పించడంలో జీవీఎంసీ జాతీయస్థాయి ఉత్తమ నగరంగా ఎంపికైంది. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్‌ఎస్‌ఐ) 46వ జాతీయస్థాయి సదస్సు ఈనెల 21న ఛత్తీస్‌గడ్ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన సేవలందించడంతోపాటు అవగాహన కల్పించడంలో కృషిచేస్తున్న పట్టణ స్థానిక సంస్థల పనితీరును పీఆర్‌ఎస్‌ఐ సర్వే చేసింది. జీవీఎంసీ పరిధిలో గత ఏడాది ఎకో-వైజాగ్, స్వచ్ఛసర్వేక్షణ్, సీజనల్ వ్యాధుల నియంత్రణ, చెత్త విభజన, నీటిపొదుపు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన వంటి అంశాలపై ప్రజలను చైతన్యపరచడంలో విశేష కృషి చేస్తున్నట్టు గుర్తించి జాతీయస్థాయిలో ఉత్తమ నగరంగా ఎంపిక చేశారు. రాయ్‌పూర్‌లో జరిగిన సదస్సులో జాతీయ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, ఎంపీ నందకుమార్‌సాయి చేతుల మీదుగా జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి, పీఆర్‌ఓ నాగేశ్వరరావు ఈ అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో పీఆర్‌ఎస్‌ఐ దక్షిణభారత అధ్యక్షుడు యూఎస్‌శర్మ పాల్గొన్నారు.