Share News

Cancer Awareness : ఇలా చేస్తే కేన్సర్‌ను చిటికెలో పట్టేయ్యొచ్చు..

ABN , Publish Date - Nov 07 , 2024 | 09:13 AM

ప్రాథమిక దశలో కేన్సర్‌ను గుర్తిస్తే సాధారణ జీవితం గడిచే అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. మూడు, నాలుగు దశల్లో వస్తే జీవితకాలాన్ని కొంతవరకు పెంచగలమని, ప్రాణాలను కాపాడలేమంటున్నారు. ప్రజల్లో కేన్సర్‌ వ్యాధిపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏటా నవంబర్..

Cancer Awareness : ఇలా చేస్తే కేన్సర్‌ను చిటికెలో పట్టేయ్యొచ్చు..

విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): కేన్సర్‌ విజృంభిస్తోంది. ఏటా దేశంలో లక్షలాది మంది వ్యాధి బారినపడుతున్నారు. అదే స్థాయిలో మరణాలూ సంభవిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వ్యాధి పట్ల అవగాహన లేకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి ముదిరిన తరువాత ఆస్పత్రులకు రావడంతో ప్రాణాలను కాపాడే పరిస్థితి లేకుండా పోతోందని చెబుతున్నారు. ప్రాథమిక దశలో కేన్సర్‌ను గుర్తిస్తే సాధారణ జీవితం గడిచే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. మూడు, నాలుగు దశల్లో వస్తే జీవితకాలాన్ని కొంతవరకు పెంచగలమని, ప్రాణాలను కాపాడలేమంటున్నారు. ప్రజల్లో కేన్సర్‌ వ్యాధిపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏటా నవంబర్ ఏడో తేదీన జాతీయ కేన్సర్‌ అవగాహన దినంగా నిర్వహిస్తున్నారు. దేశంలో ఏటా కేన్సర్‌ బారినపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో 50 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే ఈ వ్యాధి కనిపించగా, ఇటీవల 40 ఏళ్లు దాటిన వారిలోనూ గుర్తిస్తున్నారు. కేన్సర్‌కు అనేక అంశాలు కారణమవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. దేశంలో ఏటా 1.1మిలియన్‌ కొత్త కేన్సర్‌ కేసులు నమోదవుతుండగా, అందులో సుమారు ఐదు లక్షల మంది మృత్యువాత పడుతున్నట్టు గణాంకాలు వెల్లడి స్తున్నాయి. వ్యాధి పట్ల అవగాహన లేకపోవడమే దీనికి కారణమని తేల్చారు.


ఇదీ ఉద్దేశం...

వ్యాధి పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, కేన్సర్‌ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వచ్చేలా చేసే ఉద్దేశంతో జాతీయ కేన్సర్‌ అవగాహన దినం నిర్వహిస్తున్నారు. సమయానికి వ్యాధిని గుర్తించడం, నిర్ధారించే పరీక్షలు చేయడం, మెరుగైన వైద్య సేవలు అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఇందుకోసం వివిధ స్వచ్ఛంద సంస్థలు, వైద్యసేవలు అందించే ఆస్పత్రులు, ఇతర ఆర్గనైజేషన్స్‌తో కలిసి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తు న్నారు. వాక్‌థాన్‌, ర్యాలీలు, అవగాహన సదస్సులు చేపడుతున్నారు.


గుర్తించడమే చికిత్సలో కీలకం..

కేన్సర్‌ అనగానే చాలా మంది భయపడుతుంటారు. నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకురారు. ఇది ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. కొన్ని లక్షణాలను బట్టి అనుమానాలను వ్యక్తం చేయాలి. వైద్యుల సూచనల మేరకు పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని ముందుగానే గుర్తించే వీలుంటుంది. చాలా మంది వైద్యులు సూచనలు పట్టించుకోవడం లేదు. అలాగే రొమ్ము, సర్వైకల్‌ కేన్సర్‌ను నిర్ధారించే పరీక్షలను 40 ఏళ్లు దాటిన మహిళలు లక్షణాలతో సంబంధం లేకుండా ఏడాదికి ఒకసారి చేయించుకుంటే మెరుగైన ఫలితం ఉంటుంది. ఒకవేళ కేన్సర్‌ కారక కణాలుంటే వేగంగా గుర్తించి, చికిత్స అందించే అవకాశం ఉంటుంది. కేన్సర్‌తో బాధపడేవారిలో సుమారు 90 శాతం మంది మూడు, నాలుగు దశల్లోనే వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.


తొలిదశలో గుర్తిస్తే

ఏ కేన్సర్‌ అయినా తొలిదశలో గుర్తిస్తే 98 శాతం ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు కనిపించకుండానే స్ర్కీనింగ్‌ పరీక్షల్లో కేన్సర్‌ కణాలను గుర్తించే అవకాశం ఉంది. దీనిని జీరో స్టేజ్‌గా చెబుతారు. ఈ దశలో వ్యాధిని గుర్తిస్తే 99 శాతం వరకు ప్రాణాలను కాపాడవచ్చు. కొన్ని కేసులను ప్రాథమిక దశలో గుర్తించవచ్చు. ఈ దశలో మెరుగైన చికిత్స తీసుకుంటే 95 నుంచి 98 శాతం ప్రాణాలు కాపాడవచ్చు. రెండో దశలో గుర్తిస్తే 70 శాతం, మూడో దశలో గుర్తిస్తే 50 శాతం మాత్రమే ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. నాలుగో దశలో గుర్తిస్తే పది శాతం కంటే తక్కువ మందిని ఐదేళ్లపాటు జీవించేలా చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.


పరీక్షలంటేనే భయపడుతున్నారు

కేజీహెచ్‌లో డిజిటల్‌ మామోగ్రఫీ పరికరంతో రొమ్ము కేన్సర్‌ను అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌లో నిర్ధారించే అవకాశం ఉంది. ఈ పరీక్షకు బయట రూ.4 వేల వరకు అవుతుంది. ఇక్కడ ఓపీ టికెట్‌ లేకుండా ఉచితంగా చేస్తున్నాం. గైనకాలజీ వైద్యులు సూచిస్తున్నా చాలామంది ముందుకు రావడంలేదు. ప్రతిరోజూ ఐదుగురు మాత్రమే వస్తున్నారు. రోజూ 30 మందికి పరీక్షలు చేసే సామర్థ్యం ఉంది. ఎటువంటి లక్షణాలు లేని సమయంలోనే పరీక్ష చేయించుకుంటే వ్యాధిని గుర్తించే అవకాశం ఉంది. చాలా మంది రొమ్ములో కణితులు ఏర్పడినప్పుడు, రక్తం, చీము కారినప్పుడు వస్తున్నారు. అప్పటికే వ్యాధి మూడు, నాలుగు దశల్లోకి వెళ్లిపోతోంది. ఇది అత్యంత ప్రమాకరం. మిగిలిన కేన్సర్లకు స్ర్కీనింగ్స్‌ అందుబాటులో ఉన్నాయి.

- డాక్టర్‌ బుజ్జిబాబు,

రేడియాలజీ విభాగాధిపతి, కేజీహెచ్‌


అపోహలతోనే ప్రమాదం

కేన్సర్‌ స్ర్కీనింగ్‌ చేయించుకునేందుకు చాలామంది భయపడుతుం టారు. శరీరం లో కేన్సర్‌ కణాలు ఉంటేనే బయటపడుతుంది. అపోహలు వీడితే మేలు. కేజీహెచ్‌లో సర్వైకల్‌ కేన్సర్‌ స్ర్కీనింగ్‌ ప్రొగ్రామ్‌ నిర్వహిస్తున్నాం. ప్రతిరోజూ 20 మందికి ఉచితంగా స్ర్కీనింగ్‌ చేస్తున్నాం. 1.47 శాతం మందికి మాత్రమే తదుపరి దశ పరీక్షలు చేయించాల్సి వస్తోంది. ఒకటికి రెండుసార్లు కౌన్సెలింగ్‌ ఇస్తేనే మహిళలు ముందుకువస్తున్నారు. రీ ప్రొడెక్టివ్‌ ఏజ్‌ గ్రూప్‌ వారికి పరీక్ష చేయవచ్చు. దీనివల్ల మేలు జరుగుతుంది. కేన్సర్లను సకాలంలో గుర్తిస్తే మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు.

- డాక్టర్‌ కేవీఎస్‌ఎం సంధ్యాదేవి,

గైనకాలజీ విభాగాధిపతి, కేజీహెచ్‌

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 07 , 2024 | 10:24 AM