Share News

గోతుల పూడ్చివేతపై నిర్లక్ష్యం

ABN , Publish Date - Dec 20 , 2024 | 01:35 AM

వచ్చే సంక్రాంతినాటికి రహదారులపై గుంతలు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచూ హెచ్చరికలతో ఆదేశిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో గుంతల పూడ్చివేతపై అధికారుల్లో అలసత్వం కొనసాగుతున్నది.

గోతుల పూడ్చివేతపై నిర్లక్ష్యం

బీఎన్‌ రోడ్డులో ఇప్పటికీ మారని దుస్థితి

సంక్రాంతిలోగా రోడ్లపై గుంతలన్నీ పూడ్చాలని కూటమి ప్రభుత్వం ఆదేశం

ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యంపై వాహనదారులు మండిపాటు

చోడవరం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వచ్చే సంక్రాంతినాటికి రహదారులపై గుంతలు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచూ హెచ్చరికలతో ఆదేశిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో గుంతల పూడ్చివేతపై అధికారుల్లో అలసత్వం కొనసాగుతున్నది. దీంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రహదారులను పట్టించుకోకపోవడంతో చోడవరం నియోజకవర ్గం పరిధిలోని బీఎన్‌ రోడ్డు పరిస్థితి దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, రహదారులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడంతోపాటు, తాతాలికంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా గుంతలు పూడ్చాలని సీఎం చంద్రబాబునాయుడు రెండు నెలల క్రితం ఆదేశించారు. గుంతలు పూడ్చేందుకు నిధులు మంజూరు చేశారు. గోతుల పూడ్చివేత పనులను ప్రభుత్వం గత నెలలో ప్రారంభించింది. అయితే మూడు జిల్లాల ప్రజల రాకపోకలకు ఎంతో కీలకమైన బీఎన్‌ రోడ్డులో గోతులు పూడ్చివేత పనులు అరకొరగా సాగుతున్నాయి. వెంకన్నపాలెం జంక్షన్‌ నుంచి చోవరం వరకు గోతులు పూడ్చలేదు. ముఖ్యంగా గోవాడ, అంభేరుపురం, అడ్డూరు, చోడవరం ప్రాంతాల్లో ఏర్పడిన భారీ గోతులను ఇంతవరకు పూడ్చకపోవడంతో వాహనదారులు తీవ్రఇబ్బంది పడుతున్నారు. అడ్డూరు సమీపంలో గుంతల వద్ద మెటీరియల్‌ వేసిన కాంట్రాక్టర్‌.. గోతుల పూడ్చివేత పనులు చేపట్టలేదు. ఇక చోడవరం నుంచి వడ్డాది వైపు వెళ్లే రోడ్డులో లక్ష్మీపురం కల్లాలు, విజయరామరాజుపేట, వడ్డాది వద్ద గుంతలు అప్పుడు ఎలా వున్నాయో.. ఇప్పుడూ అలాగే ఉన్నాయి. చోడవరం- చీడికాడ రోడ్డులో గుంతలను అరకొరగా పూడ్చారు. బంగాళాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో గోతుల్లో నీరు చేరి పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. బీఎన్‌ రోడ్డుపై గోతుల పూడ్చివేత విషయంలో ఆర్‌అండ్‌బీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడంలేదని వాహనదారులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. బీఎన్‌ రోడ్డులో గోతులు కప్పకపోవడంపై ఆర్‌బీ జేఈ సత్యప్రసాద్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. గుంతలు పూడ్చేందుకు చర్యలు చేపట్టామని, తారు కొరత వల్ల పనులు మందగించాయని చెప్పారు.

Updated Date - Dec 20 , 2024 | 01:35 AM