ఏయూ అధికారుల నిర్లక్ష్యం
ABN , Publish Date - Dec 06 , 2024 | 01:23 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది.
డిగ్రీ విద్యార్థులకు నిర్వహిస్తున్న మూడో సెమిస్టర్ పరీక్షల్లో తప్పిదాలు
ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులకు ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ పేపర్
ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కోర్సు
విద్యార్థులకు ఫుడ్ అండ్ టెక్నాలజీ పేపర్
కంగుతిన్న విద్యార్థులు
విశాఖపట్నం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. తాము చదువుతున్న కోర్సు ఒకటైతే పరీక్షల్లో మరో కోర్సుకు సంబంధించిన ప్రశ్నలు అడగడంతో విద్యార్థులు తెల్లబోవాల్సివచ్చింది. వివరాల్లోకి వెళితే...యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల ఒకటో తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నాలుగో తేదీన బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు చదువుతున్న విద్యార్థులకు కెమిస్ర్టీ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ పరీక్ష నిర్వహించారు. అయితే పేపర్ చూసిన విద్యార్థుల కంగుతిన్నారు. పేపర్‌పై కోర్సు, పేపర్ వివరాలను స్పష్టంగా పేర్కొన్న వర్సిటీ అధికారులు..ప్రశ్నలు మాత్రం ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కోర్సుకు సంబంధించినవి ఇచ్చారు. విద్యార్థులు విషయాన్ని ఇన్విజిలేటర్‌కు తెలియజేశారు. అయితే, ఆయా కాలేజీల్లోని ఇన్విజిలేటర్లు పరీక్ష హాల్ నుంచి వెళ్లడానికి లేదని, అబ్జర్వర్‌కు విషయాన్ని తెలియజేశామని చెప్పారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళతామని, పరీక్షకు హాజరైనట్టు హాల్ టికెట్ నంబర్లు వేసి ఇవ్వాలని అబ్జర్వర్లు సూచించారు. కాలేజీ యాజమాన్యాల ద్వారా ఈ విషయాన్ని ఏయూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు పలువురు గురువారం ఉదయం వర్సిటీకి వెళ్లి ఉన్నతాధికారులను కలిసే ప్రయత్నం చేసినప్పటికీ అవకాశం ఇవ్వలేదని తెలిసింది.
అదే తప్పు..
అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గురువారం కూడా అదే తప్పిదం జరిగింది. గురువారం ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కోర్సు చదివే విద్యార్థులకు ఫంక్షనల్ ఫుడ్ అండ్ న్యూట్రిస్యూటికల్స్ పరీక్ష నిర్వహించాలి. అయితే, జరిగిన ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులోని కెమిస్ర్టీ అండ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ సిలబస్‌కు సంబంధించిన ప్రశ్నలను ఇచ్చారు. కోర్సు పేరు, పేపర్ వివరాలను ఒకలా, అందులో ఇచ్చిన ప్రశ్నలు మరోలా ఉండడంతో విద్యార్థులు కనీసం పెన్ను కూడా పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఏయూ వీసీ ప్రొఫెసర్ జి శశిభూషణరావును వివరణ కోరగా తప్పు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా చూస్తామని, అవసరమైతే పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహిస్తామని వెల్లడించారు. దీనిపై అధికారులతో మాట్లాడతామని వివరించారు.