Share News

అవసరమైనచోట ఠాణాలకు కొత్త భవనాలు

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:21 AM

రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన పోలీస్‌స్టేషన్ల భవనాలను గుర్తించి, అవసరమైనచోట నూతన భవనాలను నిర్మిస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

అవసరమైనచోట ఠాణాలకు కొత్త భవనాలు
స్థల విషయమై సీఐ కుమారస్వామితో మాట్లాడుతున్న హోం మంత్రి అనిత

నక్కపల్లి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన పోలీస్‌స్టేషన్ల భవనాలను గుర్తించి, అవసరమైనచోట నూతన భవనాలను నిర్మిస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో పలు ప్రాంతాల్లో పోలీస్‌ స్టేషన్లకు కొత్త భవనాలను నిర్మించినట్టు ఆమె చెప్పారు. సోమవారం నక్కపల్లి పాత పోలీస్‌ క్వార్టర్స్‌ సమీపాన వున్న స్థలాన్ని ఆమె పరిశీలించారు. నక్కపల్లిలో సర్కిల్‌ కార్యాలయం కూడా వుండడం, ప్రస్తుతం వున్న స్టేషన్‌ భవనం మరమ్మతులకు గురవడంతో కొత్త భవనం నిర్మించాల్సి వుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడా కొత్త భవనాలు నిర్మించాల్సి వుందో పరిశీలిస్తున్నామని చెప్పారు. నక్కపల్లి, పాయకరావుపేట సీఐలు కుమారస్వామి, అప్పన్న, ఎస్‌ఐలు సన్నిబాబు, విభీషణరావులతో చర్చించారు. పోలీస్‌ స్టేషన్‌ భవన నిర్మాణానికి సంబంధించి స్థలం కేటాయింపుపై తహసీల్దార్‌ నర్సింహమూర్తితో ఫోన్‌లో హోం మంత్రి మాట్లాడారు. ఆమె వెంట కూటమి నాయకులు గెడ్డం బుజ్జి, బోడపాటి శివదత్‌, కొప్పిశెట్టి వెంకటేశ్‌, కొప్పిశెట్టి బుజ్జి, మీగడ సత్తిబాబు, కురందాసు నూకరాజు, వైబోయిన రమణ, కేవీ సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 12:21 AM