Share News

న్యూస్‌బాక్స్‌...

ABN , Publish Date - Nov 15 , 2024 | 01:23 AM

జాతీయ రహదారిపై తగరపువలస వద్ద గల గోస్తనీ వంతెన పైనుంచి గురువారం రాత్రి ఒక కారు కింద ఉన్న నదిలో పడిపోయింది.

న్యూస్‌బాక్స్‌...

గోస్తనీలో పడిన కారు!

డ్రైవర్‌ మృతి

బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొనడంతో ప్రమాదం

తగరపువలస, నవంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి) :

జాతీయ రహదారిపై తగరపువలస వద్ద గల గోస్తనీ వంతెన పైనుంచి గురువారం రాత్రి ఒక కారు కింద ఉన్న నదిలో పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్‌ మాదాబత్తులు సురేంద్ర (24) మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం...విశాఖపట్నం నుంచి భోగాపురం వైపు వెళుతున్న కారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వంతెన రెయిలింగ్‌ను ఢీకొని నదిలో పడిపోయింది. ఓ ఆటో డ్రైవర్‌ చూసి స్థానికులకు సమాచారం అందించడంతో వంతెన కింద నుంచి గోస్తనీ నది వద్దకు వెళ్లి కారులో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీశారు. అంబులెన్స్‌లో సంగివలస ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు చెప్పారు. మృతుడు సురేంద్ర తగరపువలస సమీపంలో ఉన్న బంగ్లామెట్ట ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు చేస్తున్న ఓ కంపెనీలో కొత్తగా చేరాడని, విశాఖపట్నంలో పని ముగించుకుని వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నదిలో పడిపోయిన కారును బయటకు తీయడానికి ఇబ్బందిగా ఉందని, ఆ ప్రాంతమంతా తుప్పలు డొంకలతో నిండి ఉండడంతో లోపలకు వెళ్లడం సాధ్యం కాలేదని పోలీసులు తెలిపారు. కాగా ఈ వంతెనపై లైట్లు లేకపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. బుధవారం కూడా ఈ వంతెనపై రెయిలింగ్‌ను ఢీకొని ఒక ఆటో దెబ్బతిందని తెలిసింది. ఇప్పటికైనా అధికారులు గోస్తనీ నది బ్రిడ్డిపై విద్యుత్‌ దీపాలు ఏర్పాటుచేయాలని స్థానికులు కోరుతున్నారు.

సికింద్రాబాద్‌-లక్నో మధ్య ప్రత్యేక రైలు

విశాఖపట్నం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి):

ప్రయాణికుల సౌకర్యార్థం దువ్వాడ మీదుగా సికింద్రాబాద్‌-లక్నో మధ్య ప్రత్యేక రైలు సర్వీస్‌ ప్రవేశపెడుతున్నామని సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. 07084 నంబరు గల రైలు ఈనెల 15, 22 తేదీల్లో రాత్రి 7.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5.55 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ఇక్కడ నుంచి ఆదివారం సాయంత్రం 6.00 గంటలకు లక్నో చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07083 నంబరు గల రైలు ఈ నెల 18, 25 తేదీల్లో (సోమవారం) ఉదయం 9.50 గంటలకు లక్నోలో బయలుదేరి బుధవారం తెల్లవారుజామున 1.30 గంటలకు (మంగళవారం అర్ధరాత్రి) దువ్వాడ చేరి, తిరిగి ఇక్కడ నుంచి 1.32 గంటలకు బయలుదేరి అదేరోజు (బుధవారం) మధ్యాహ్నం 3.00 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. ఈ సర్వీసులు నల్గొండ, విజయవాడ, భువనేశ్వర్‌, వారణాసి, అయోధ్య మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

కార్పొరేషన్లలో మరో ముగ్గురికి అవకాశం

విశాఖపట్నం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ప్రభుత్వం తూర్పు కాపు, మాదిగ, తదితర కార్పొరేషన్లకు సభ్యులను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. తూర్పు కాపు కార్పొరేషన్‌లో భీమిలి నియోజకవర్గం నుంచి టీడీపికి చెందిన కురిమిన లీలావతికి అవకాశం లభించింది. మాదిగ కార్పొరేషన్‌లో సభ్యులుగా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకురాలు ఈతలపాక సుజాతకు, ఎలమంచిలి నుంచి టీడీపీకి చెందిన డొక్కా నాగభూషణం నియమితులయ్యారు.

Updated Date - Nov 15 , 2024 | 01:23 AM