వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం
ABN , Publish Date - Oct 31 , 2024 | 01:22 AM
సాధారణ నిధులను డ్రైనేజీ కాలువల్లో పూడికతీత, పారిశుధ్య పనులకు ఖర్చు చేయడంపై మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. వైసీపీ అధికారంలో వున్నప్పుడు నామినేటెడ్ వర్కుల పేరుతో దోచుకున్నారని, పట్టణంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని టీడీడీ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి తీవ్రస్థాయిలో ఆరోపించారు.
నామినేటెడ్ వర్కుల పేరుతో దోచుకున్నారు
టీడీపీ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ధ్వజం
సాధారణ నిధుల వ్యయంపై వైసీపీ సభ్యుడు రామకృష్ణ అభ్యంతరం
మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం
నర్సీపట్నం, అక్టోబరు 30 (ఆధ్రజ్యోతి): సాధారణ నిధులను డ్రైనేజీ కాలువల్లో పూడికతీత, పారిశుధ్య పనులకు ఖర్చు చేయడంపై మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. వైసీపీ అధికారంలో వున్నప్పుడు నామినేటెడ్ వర్కుల పేరుతో దోచుకున్నారని, పట్టణంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని టీడీడీ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి తీవ్రస్థాయిలో ఆరోపించారు.
మునిసిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం బుధవారం చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగింది. సీనియర్ అసిస్టెంట్ వెంకటలక్ష్మి అత్యవసర సమావేశం అజెండాలోని తొమ్మిది అంశాలు, సాధారణ సమావేశం అజెండాలోని 17 అంశాలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా 9వ వార్డు జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో మెయిన్ రోడ్డు, కొత్తవీధి రోడ్డ విస్తరణ పనులకు రూ.16 కోట్లు మంజూరు చేయగా, ఇప్పుడు కొత్తవీధి శ్మశానవాటిక దగ్గర నుంచి ఆర్‌అండ్‌బీ బంగ్లా రోడ్డు వరకు రూ.53 లక్షలతో బీటీ రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు ఎందుకు పెట్టారని అధికారులను నిలదీశారు. శంకుస్థాపనకు నాటి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మునిసిపాలిటీ సాధారణ నిధులు నుంచి ఖర్చు చేశారని విమర్శించారు. గత ప్రభుత్వంలో పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేవారు కాదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చకాచకా పనులు జరుగుతున్నాయని అన్నారు. వైసీపీకి చెందిన వైస్‌చైర్మన్ కోనేటి రామకృష్ణ మాట్లాడుతూ, రూ.1.7 కోట్ట మునిసిపాలిటీ సాధారణ నిధులను చెత్త ఎత్తడానికి, కాలువల్లో పూడిక తీయించడానికి ఖర్చు చేస్తున్నారని, వీటిని ప్రజలకు ఉపయోగపడే పనులకు ఖర్చు చేయాలని అన్నారు. టీడీపీ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి జోక్యం చేసుకుంటూ.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లోనే మునిసిపాలిటీలో అభివృద్ధి పనులకు రూ.4.3 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. అజెండాలోని ప్రతీ అంశంలో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు వున్నాయని అన్నారు. వైసీపీ అధికారంలో వున్నప్పుడు నామినేటెడ్ వర్కుల పేరుతో దోచుకొని దాచుకున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ కౌన్సిలర్ల వార్డుల్లో అభివృద్ధి పనులకు కక్షపూరితంగా నిధులు ఇవ్వలేదని, తన వార్డులో కనీసం విద్యుత్ స్తంభాలు కూడా వేయలేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైస్‌చైర్మన్ కోనేటి రామకృష్ణ (వైసీపీ) మాట్లాడుతూ, వైసీపీ హయాంలో మంజూరైన రూ.1.5 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులతో ప్రతిపాదించిన పనులను కూటమి ప్రభుత్వం రద్దుచేసి, ఇప్పుడు అవే నిధులను టీడీపీ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లో అభివృద్ధి పనులు కేటాయించుకున్నారని ఆరోపించారు. టీడీపీ కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు మాట్లాడుతూ, ప్రజల అవసరాల కోసం సాధారణ నిధులు ఖర్చు చేస్తునామని స్పష్టం చేశారు.